top of page

 

శ్రీ శ్రీ శ్రీ కొత్త గట్టు మశ్చగిరీంద్ర స్వామి శతకము

(ఆ.వె.)

1*

శ్రీలు చిందు రూపు చిత్తంబులో నిల్పి

చింతనమ్ముజేతు చిద్విలాస!

నిత్యవిధుల సాగి నిను భక్తి ప్రార్థింతు

ఆది మత్సరూప! ఆత్మరూప!

2*

శివుని హృదయమందు నీవుందు వందురు

నీదుహృదయమయ్యె శివుని నెలవు

జీవులందు వెలుగు జీవశక్తివి నీవె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

3*

శ్రీశ కొత్తగట్టు శ్రీ మత్స్యగిరి గుడి

వెలసినావు ప్రజల వేల్పు వగుచు,

వేడ్కలొసగి బ్రోవు వేదవేద్యుడవీవు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

4*

ప్రజలు హుజ్రబాద్ ప్రాంత నివాసులు

మీన మత్స్యనామ మింపుగూర్ప!

పరవశింత్రు భక్తి పౌర్ణమి జాతరన్

ఆది మత్స్య రూప! ఆత్మ దీప!

5*

చదువులుద్ధరించి చవటసోమకు జంపి

బ్రహ్మ సృష్టి బాధ బాపినట్టి,

కొత్తగట్టు వెలయు గొప్పదేవుడ వంద్రు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

6*

శ్రీరమేశ!నీదు చింతనచేచిత్త

చింతమరచి కొలుతు చిద్విలాస!

భవవినాశ! భక్త పరమాణువైయుందు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

7*

బుద్ధి జీవియాత్మ పుడమి జన్మించగ

విశ్వసింప గాంచు విశ్వరూపు!

జీవుల సమదృష్టి చీమయేనుగుదాక!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

8*

బ్రహ్మ జనక నీదు భక్తిభావముగల్గ

నాల్కపైననాడు నాటవెలది

గూర్తు భక్తిశతక గుచ్ఛంబు నర్పింతు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

9*

తల్లిదండ్రి గురువు దలచియు నిలవేల్పు

గొలిచి కవుల మ్రొక్కి భక్తి

చందమెరిగి దేశి చందంబు వినిపింతు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

10*

అరసి చూడ నాదిమధ్యాంతములు నీవె

ఆత్మలోని పరమాత్మ నీవె!

ముగ్గురమ్మలందు మూలశక్తియునీవె!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

11*

చిత్త మేలునట్టి శివ కేశవుడవీవె!

భక్తి భావ దీప్తి బ్రహ్మ వీవె!

మూడు మూర్తులందు ముక్తి ధాతవు నీవె!

ఆది మత్స్యరూప! ఆత్మ దీప!

12*

శ్రీ శ! వెంకటయ్య సీతమ్మల సుతుడ!

నూరు వావిలాల పేరు సత్య

నారణనగ బిల్చినారు నీవ్రతమందు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

13*

హరిహర!భువి తిరుణహరి వంశమున బుట్టి

సత్యవ్రతము బారసాలనాడు

కనులు దెరచి నిన్ను గాంచితి తొలిసారి

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

14*

వేదనిధుల-చివర వెలుగొందుమా స్వామి!

శాశ్వత సుఖమిచ్చు సత్యదేవ!

వివిధ జీవులందు వెలుగొందు నీప్రభల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

15*

విశ్వ జనుల భక్తి విశ్వాసములు నీవె!

వివిధ నీతిధర్మ విలువ నీవె!

వినుతిగాంచు శక్తి విశ్వాత్ముడవు నీవె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

16*

జగతి మానవాళి జన్మించి జీవింప

ప్రాపునీవె!దరియు దాపు నీవె!

వివిధదారులందు వెలయు ధర్మమునీవె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

17*

నీవె నిత్యమవని – నీవె సత్యము తండ్రి

పలుపురాణ శ్రవణ ఫలము నీవె!

లోక నాటకమున నేకదర్శకుడీవె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

18*

చదువు చేత బ్రహ్మ పదవినాశించెనొ

దనుజుడొకడు దాని దస్కరించె!

కష్టమయ్యె-నిత్య సృష్టికాటంకమై!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

19*

సుస్థిరతను గూర్చు-సూత్రధారివి నీవె!

చదువు గాచునట్టి పదవి నీదె!

దేహి పాహియనుచు- దేవతల్ నీచుట్టు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

20*

సూర్య చంద్ర నేత్ర! సురలనోడించగ-

ద్వేషభావముండె-దోషియయ్యె!

సోమకుండు జలధి జొచ్చియుదాగుండె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

21*

అండపిండ బ్రహ్మ భాండమ్ములను సృష్టి

సర్వమాగె కాలచక్రమాగె!

దబ్బపండు పృథ్వి దెబ్బదినగసాగె!

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

22*

మత్స్య రూపమెత్తి మాయలుఛేదించి

సోమకుణ్ని జలధి జొచ్చి చంపి,

విద్యలుద్ధరించి విధికి నిచ్చిన తండ్రి!

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

23*

పుడమి కొత్తగట్టు పున్నమి జాతర-

చదువు పండుగనగ జానపదులు

కోరి రాగ వారి కొంగు బంగరునీవు!

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

24*

దీనబంధు!జగతి దివ్యనాటక జీవ

పాత్ర ధారి నడుపు సూత్రధారి!

సన్నివేశమొప్ప సవరించు మమ్మెల్ల!

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

25*

భారతునకు తత్వభావ గీతార్థముల్

ప్రోదిచేసి చెప్పు బోధగురుడ!

ధర్మసూక్షమీవె! కర్మసాక్షివి నీవె!

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

26*

భక్తి తిక్కనిచ్చె భారతకృతినీకె

శ్రీహరిహరనాథ! రేడు ప్రజలు

నొక్కత్రాట నిలుచు నొనరుసాధించెను!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

27*

విశ్వరూప!నీదు వివిధావతారముల్

భక్తి తత్పరమగు భావనిధులు-

సాధుజనులు ముక్తి సాధించు త్రోవలు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

28*

నీదు భక్తి – చిత్త నిర్మలత్వము గూర్చు

భ్రమలుదొలగు, కలుగు భావదీప్తి!

భాధలుడిగిపోవ బ్రహ్మమోదము గల్గు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

29*

సకల బంధు మిత్ర సంబంధములు నీదు

భక్తిగల్గు మదిని పదిలమంద్రు!

సమత మమత గూర్చు సఖ్య సమైక్యతల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

30*

పాడుచిత్తమొక్క పట్టాన నిలువదు

పనికిరాని పనుల పరుగు దీయు

పునికి పుచ్చుకోదు పుణ్య కర్మ ఫలము!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

31*

జాలి జూపరమ్ము జాలము చాలించు

మలినబుద్ధి దులుపు మనసు నిలుపు

తనువు నాత్మ దారి తరలించి కరుణించు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

32*

మూడులోకములకు మమ్మూర్తుల నీదు

మహిమలు ప్రసరించు మనిషి బ్రోచి

మూడు కాలములను ముందడు గేయించు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

33*

కలిని నిన్ను గొలువ కష్టమయ్యెను దశ

రూపులందు వెలుగు రుక్మిణీశ!

నాల్గు పాదములను నడిపించు ధర్మమున్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

34*

చదువు దోచె నాడు చవట సోమకుడంద్రు

నేడు దోచనట్టిదేది ధరణి?

చదువు దప్ప నరుడు సర్వము దోచెడున్

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

35*

జీవి జీవి నీదు జీవాత్మ దీపించు

జీవ హింస మాని నీదు భక్తి

సేవజేయు వారి చేవ బెంచుము తండ్రి

ఆదిమత్స్యరూప! ఆత్మదీప!

36*

బ్రతుకు పాలతోడు భక్తి మీగడ పెర్గు-

వెన్నుడాత్మనున్న వెన్నయనగ-

భావమథనమందు జీవామృతవిందు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

37*

భారతార్జునుండు భక్తి గీతనువిని

తగిన ప్రశ్నలడిగి తత్వమెఱిగి

విశ్వ రూపు గాంచె-విశ్వాసమును పంచె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

38*

అక్షరాల భక్తి సాక్షాత్కరించగా

పదము భక్తిబాట పరుగు లెత్తె!

వాక్యమయ్యె భక్తి వారధి ముక్తికిన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

39*

సర్వజనుల సుఖము – శాంతిగోరు భరత-

జాతినైక్యభావ భాతి దనరు!

తరతరాల నరులు తరియించు సంస్కృతిన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

40*

భావ సామ్యమొప్పు భయభక్తి శ్రద్ధలన్

సహన బుద్ధియుఋషి సంతతులకు-

సమయ పాలన విధి సరిక్రొత్త విద్యయా?

ఆద మత్స్యరూప! ఆత్మదీప!

41*

ఐక్య భావమిచ్చు నైతిక విలువలన్

నిలుప వలయు శాంతి నిలుచు వరకు

జగతి పరిఢవిల్లు జాతి సమైక్యతల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

42*

సఖ్య భావమొప్పు సామాన్యు బ్రతుకులో

హద్ధు మీరనట్టి సుద్ధు లెంచి

గాంచు తృప్తి చేతగాని తనముగాదు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

43*

విశ్వరూప!విష్ణు! విశ్వశాంతాకార!

గగన సదృశ వర్ణ! కమలనయన!

సకల నామరూప! సాదుహృదయ గమ్య!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

44*

తనువె మొదట పిదప ధర్మసాధనలెల్ల

తనువు లేక సాగు తగవు లెట్లు?

నిలుప వలయు తనువు నియమ నిష్ఠల చేత!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

45*

బాల్య మేగె నాటపాటల యవ్వనమ్

జతను గట్టసాగె – జరను-రుజలె-

నీదు భక్తి నెపుడు నినదించు నామదిన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

46*

మంచి మనసునిచ్చి మనిషిగా దీవించు

మంచిమాట పనుల మంచిగూర్చి

తీర్చి దిద్ధు బుద్ధి త్రికరణ శుద్ధిగా

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

47*

భక్తి సేదదీరు భావమ్ము చిగురించె

బ్రతుకునస్మదీయ యతుకులూడె!

వెతల జిక్కి మనము వెదక సాగెను నిన్నె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

48*

ప్రేమ రహిత జన్మపేరు పాషాణము

జగతి దీరునెట్లు జన్మ ఋణము

మనసులేని వారి మనువుయాంత్రికమగు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

49*

ధర్మ నిరతి పుణ్య కర్మలు యాంత్రిక

యజ్ఞ శాలయందు ప్రజ్ఞ మీరె!

కాలమార్పు భక్తి కర్మలన్ పొడసూపె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

50*

ఆది నిష్టురమ్ములంత్య భ్రష్టత్వముల్

నడిమి తరగతులను నాడు నేడు

కొండపెద్ధరికము గోరంత గౌరవం!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

51*

విధిగ నమ్మకమ్ము వేయేనుగుల శక్తి

నిచ్చు నంద్రు బుద్ధి నిలిపి చూడ

నమ్మలేని బ్రతుకు నడుప శక్యముగాదు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

52*

చేదు మందు రుజను ఛేదించి మాన్పును

తీపిచేత రుజలు తీవ్రమగును

నిగ్రహించి బ్రతుకు నిలుపుకోవలె నేడు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

53*

నాల్కదాటు వరకె నానారుచులు నభి

రుచులు తల్లి నాల్క రూఢియగును

మాటపల్కులందు నాటికి నేటికి

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

54*

రాజుబోయె ప్రజలె రాజులు భారత

జాతి చరితమారె జరుగు భవిత

సంస్కరణలు నాటి సత్యయుగముబోలె

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

55*

గుఱియు దప్ప చీమ గుట్టె కిరాతుని

బారినుండి గువ్వ బ్రతికె – నీట

ఆకువేసి చీమ-నద్ధరికిని జేర్చె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

56*

మంచివారి వెంట సంచరించుట మేలు

చెడ్డవారిజేర చేటుగలుగు!

నమ్మకమ్ము వెంట నడుచు ప్రపంచమున్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

57*

మంచి మైత్రి బ్రతుకు మార్చివేయును భువీ

మంచిబోధ వలన మనసుగుదురు

మంచితోడు మనిషి-మహనీయుగాజేయు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

58*

దుమికె జుట్టుబట్ట దుసికిలవడి కాళ్ళు

బట్టె నిలిచి వెళ్ళె వట్టి నటన

అట్టెజూపె నెదరి కర్థముగాకుండ!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

59*

కలిసిరాగ రాళ్ళు – కానివేళల కాళ్ళు

బట్టనేర్చువాడె బ్రతుక నేర్చె!

ఏరుదాటి తెప్పనెదరితో గాల్పించె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

60*

కోరుకున్నది మరికొరగానిదై పోవ

మంచి తరణమందె మార్చకున్న

సమయనష్టమెవరు సవరింప నేర్తురు?

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

61*

కష్టమైన పనుల నిష్టమే కొనసాగు

సుళువు గతుల నరుడు సుఖము గోరు

కట్టు బొట్టు మార్పు కథలె నాగరికతల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

62*

ఈసుగల్గి పరుల నీసడించిన వాడు

నీ సమాజ సేవ నిలిచి యింట

గెల్వకున్న రచ్చ గెల్వగాతూగాడు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

63*

పగలు రాత్రి షిప్టు పనులందు కొనసాగు

నేది గొప్పయన్న నేకదినమె!

పొల్లువాదమేల? పొద్దస్తమానమున్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

64*

క్రూరడింబకాళి గూడి డంబములాడ

నడ్డు పడిన వారి నడ్డి విరుగు

గురుడు తలను వంచు గుమిగూడి జననింద!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

65*

లలితకళలు మదిని లాలించు నందురు

మిగత కళలు గూర్చు మిగుల శాంతి

శాస్త్ర కళలు మనిషి శాసించి పాలించు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

66*

వ్రేలువంచి వెన్న వేగదీయగ నేర్చి

నేతులమ్మిదెచ్చు నేతి బీర

గడనకొలది బతుకు గడిచిపోవునుకదా!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

67*

ఆప్తిజెందనేల తృప్తియె పదివేలు

ప్రాప్తమున్నయంత ఫలము దొరుకు!

కలలుబండుదాక కాలమాగదుగదా!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

68*

సాంప్రదాయ భక్తి సాగుసేవలు నేడు

నిత్యవిధుల సాగె నిజముదెలియ

నరుడు మారె పూజ నైవేద్యములుమారె!

ఆది మత్స్యరూప ఆత్మదీప!

*

69*

మంచివాడు సొమ్ము పంచియిచ్చిన దిట్టు

చెడ్డవాడుముంచ చేరి పొగడు!

దెబ్బలన్న జడియు దేవుని మనిషైన

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

70*

సప్త వెసనమున్న సుప్తభుజంగమై

పుట్ట బుసలు గొట్టు బుట్టద్రోయ

బుద్ధి విషము గ్రక్కు – యుద్ధమే ప్రకటించు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

71*

కుతుక మెచ్చి మనిషి కుడువడా మత్తులన్

మానివేయ జూడ మరలమత్తు

భృత్యునివలెజొచ్చి – మృత్యువై శాసించు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

72*

చెడుగుణమ్మొకటియె చెడగొట్టు సుగుణాల

నిండు కడవ కడుగు నందునొక్క

చిన్న చిధ్రమైన చిమ్మదా నీరంత-

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

73*

పాడు మనసు పరుగు పగ్గాలు మేథకు

దఖలు జేయకున్న దారిదప్పు!

మనిషి నెత్తికెక్కి మరలాగు-దర్గతిన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

74*

చపల చిత్త వృత్తి చెలరేగి వర్తించు

బ్రతుకు దిమ్మదిరుగు బ్రమలు బెంచు

మెప్పు మత్తు ముంచు – నెత్తిని గూర్చుండు,

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

75*

స్వారిజేయు మనసు వారించకున్నను

తనువు నశ్వమట్లు తరుము చుండు

తిప్పలొచ్చు బ్రతుకు తిర్లమర్లను సాగు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

76*

చక్కబడునె తెల్ప సంసారి గననొంటె

ముళ్ళమొక్క రక్తమోర్చి నమలు

విడని రుచులు దలప విధిరాతలే కదా!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

77*

చిక్కు ప్రశ్న మనిషి చిత్తచాంచల్యమే

పరుగు గుఱ్ఱమాగి తిరుగు నట్లు

చెత్తపనుల సాగు చేరదు గమ్యంబు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

78*

కాళ్ళు చెవులులేని కథముంతలకు జోడు

కలిపిరెవరు – జూడ కలియుగాన

ఎడ్లు బండ్లులేని ఎడ్డెమాటామంతి!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

*

79*

తేడ వచ్చు మొదట తెలియక వాదింప

నుభయ మెరిగి పోల్చ శుభము విషయ

సామ్యమొప్పు గతులె సద్విమర్శను సాగు!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

80*

విశ్వ గుట్టుదెల్పు విజ్ఞానశాస్త్రముల్

మనసు గుట్టు దెల్పు మన పురాణ

వాఙ్మయమ్ములనగ వాదింప నేముంది!

ఆదిమత్స్యరూప ఆత్మదీప!

81*

ఉన్నకాడ సొరగ మూహించి జీవించు

వాడె సగటు మనిషి – వాదు గొనక

నరకమైన నట్లె నడయాడు తుదిదాక!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

82*

పట్టి విడువరాదు, వట్టిమాటలు గాదు

ఆడితప్పరాదు-చాడి వద్ధు

చెట్టు లాగ బ్రతికి, సేవింతు నీ సృష్టి!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

83*

నాటి వ్రాతలెల్ల-నాటు వాతలు గావు

నేటిదెల్లగాదు నేతిబీర!

చూడ నునుపు దోచు దూరపు కొండలున్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

84*

మనసు లేని సైన్సు – మరియాదలేవేరు

భూత దయయు లేని బుద్ధి వేరు

అన్నవస్త్రమడుగ అణ్వస్త్ర మిప్పించు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

85*

వినెడు మాట సైన్సు విజయమయ్యె మొదట

భావవాహకమగు బాషయయ్యె

కళలు సైన్సు బాష కలబోసి వడబోసె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

86*

అంతరిక్షయానమయ్యె తేలిక యాత్ర

సేవ భక్తి సాగె-పోవజూడ-

నిద్ర ప్రేక్షకుండె ఇహలోక వింతలన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

87*

ఎందరేమియన్న – ఎగతాళి జేసిన

కాసులేనిదె తిరకాసు బ్రతుకు!

వేష భాషలుత్త భేషు శభాసులే!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

88*

ఇరుగు పౌరుగు దిరిగి ఇటు నటు దట్టించి-

జుట్టు ముడులు బెట్టు జూట బుద్ధి-

తీపిమాటచేత త్రిప్పును చక్రముల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

89*

వస్తుదెలియకుండ వాదించు వారంత-

వేదనిధులనుండి వెడలిరాగ-

ఆధునికులు వారికడ్డము వాదింత్రు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

90*

తగవు జెప్పు – బట్ట తలకు మోకాలుకు-

ముడినిబెట్టు ఘనులు-ముక్కుసూటి-

మానవీయ సైన్సు మాటనెత్తరు కదా!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

91*

ఎవరి శక్తివారు వెల్గి పేరొందగా

ఎవరు గొప్పయనెడు నెదురు ప్రశ్న

పక్షపాతరహిత పరిశీలనకు రాదు

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

92*

చెట్టు గొప్ప పేరు జెప్పియమ్మెడుకాయ

కొమ్మకొక్క రుచిని గొల్ప – చెట్టు

సొమ్ములాగువాని – కొమ్ముగాయదుకదా?

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

93*

గమన కక్ష్య మార్చు గణనీయశోధనల్

సాగెనూష్ణ బాధ సాల్వుజేయ-

సూత్రమూహసాగె సూదంటు శకలముల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

94*

కళలు సైన్సు భాష కంప్యూటరాములు

శ్రావ్య దృశ్యయంత్ర కావ్య సహజ-

ప్రకృతిదృష్టి – నకలుప్రతియయ్యె చూడగా

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

95*

భరతమునుల నాటి భావ గాంభీర్యమున్

శత్రురాజు మెచ్చి మిత్రుడయ్యె!

హద్ధుదాటిరాక యుద్ధంబు విరమించె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

96*

ఆత్మ శోధక కథ లాధ్యాత్మిక నిధులు

విశ్వ జనులకెల్ల వింతగొల్పె!

వైరికైనబంచు వైభవోపేతముల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

97*

వట్టిమాట వద్దు-గట్టిమేల్ తలపెట్టు

మట్టిగాదు దేశమన్న మనమె!

దేశభక్తిగుట్టు దేల్చడే గురజాడ!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

98*

జనులు భరతభూమి జన్మించ ధన్యమే

పుణ్య పాప కర్మ పుటలు ద్రిప్పి-

మళ్ళి మళ్ళిబుట్టి మరణింప ధన్యమే

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

99*

వివిధ వైదికాలు వైశిష్ఠ్యమార్గముల్

సాంప్రదాయ నూత్న సాధకాలు!

మంచి ప్రాతిపదికమైన సంస్కృతి ప్రభల్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

100*

భరతమాత వీడె-బానిసత్వము ప్రజా-

స్వామ్యమొప్పు ప్రగతి సాగె జాతి!

జగతిమెచ్చు రీతి – జాగృతమగుచుండె!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

101*

పల్లవించె పాడిపంటలశోభ

పట్టణాలశోభ పాక్టరీలు

సంతుమితము పొదుపు సంసారమేశోభ

ఆది మత్స్యరూప! ఆత్మ దీప!

102*

సగటు మనిషి నలుగు సామాజిక సేవ!

నరప్రయోగశాల నడుపుచోట

తూచితూచి యడుగు చూచివేతురుకదా

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

103*

కలసిబ్రతుకు గుణము కౌటుంబజీవనమ్

భరతజాతి వరము భావితరము

నైక్యమొప్పు వసుధ సౌఖ్యము, శాంతియున్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

104*

మంచివారి వంచు వంచకులను ద్రుంచి

నీతిధర్మములను నిలుప భువిని

వివిధ రూపులెత్తి విహరింతువో స్వామి!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

105*

చిన్ననాటి భక్తి చిటికెల పందిరీ

నడిమి వయసు భక్తి నాటకమ్ము!

ముదిమి గలుగ భక్తి ముదమిచ్చి నినుజేర్చు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

107*

నీదు రూపుగన్న నిత్యమోదము గలుగు

నీదు పూజ బుద్ధి నిగ్గుదేల్చు

నిశ్చలాత్మ వెలుగు నిన్ను స్మరింపగన్

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

108*

శుభము గూర్చువినగ సూక్తి ముక్తావళుల్

శుభము నీదు భక్తి సుగతి గూర్చు

శుభము శతక పఠన సుఖశాంతు లొనగూర్చు!

ఆది మత్స్యరూప! ఆత్మదీప!

Contact
bottom of page