top of page

శ్రీ తాడుబందు వీరాంజనేయ శతకము
(ఆ.వె.)

1*

శ్రీలుజిందు భక్తి చిత్తంబు నిల్పగా

ధ్యాన నిష్ఠ వెలయు తమరి మహిమ!

రామనామ మయమె రాజిల్లు జీవనమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

2*

పేరు విన్న భూత ప్రేత పిశాచముల్

పారిపోవు దుష్ట భాధ దొలగు

నీదు భక్తి గుండె నిబ్బరంబును గూర్చు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

3*

గ్రామ గ్రామమందు గనిపించు నీగుడి

రోమ రోమ మందు రామ సడియె/

మ్రోగుచుండు గంట సాగుచుందురు జనుల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

4*

విశ్వ భక్త శ్రేష్ఠ వీరాంజనేయుడ!

విష్ణు దాస్య భక్తి విస్తరింప-

స్వామి భక్తి వెలయ సవరించి బ్రోచేవు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

5*

పొసగ సిక్కు గ్రామ బోయునిపల్లి-సి

కింద్రబాదునందు కీర్తి ప్రభల-

వెలసినావు ప్రజల వేడ్క స్వయంభువై

భాగ్యనగర తాడుబందు హనుమ!

6*

త్రేత యుగము నందె ప్రేమతో జాబాలి

మునితపస్సు మెచ్చి ముక్తి నొసగ

వెలసిన స్వయంభు వేనీవు మారుతీ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

7*

రామదాస!తలపురాణంబు వినిపించు

నాటినుండి జనుల నాల్క లందు

నమ్మికొలుచు దీక్ష నయజయంబుగ రక్ష!

భాగ్యనగర తాడుబందు హనుమ!

8*

రెండు మైళ్ళె రైలు బండిదిగినవారు

వివిధ వాహనాల వెళ్ళు దారి

ఎస్సు ఇరువ దారు బస్సు సౌకర్యముల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

9*

నీదు దర్శనంబు నిర్విఘ్న మొనరింప

పార్వతీ తనయుని ప్రస్తుతింత్రు!

నియమ నిష్ఠ మ్రొక్కి నీదీక్ష పాటింత్రు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

10*

జగతి మేలు గోరి జాబాలి యత్నింప-

గావినాయకుండు గాచె గాన-

నిత్యపూజమొదట నీచెంత నేటికిన్

భాగ్యనగర తాడుబందు హనుమ!

11*

తరతరాలు నేడు తాడుబండని పిల్చు-

క్షేత్రమందు నీవు సేమ మొసగ

జయము జయమటంచు జనజాతరలు సాగె

భాగ్యనగర తాడుబందు హనుమ!

12*

కాల గమనమందు గడిచె పందొమ్మిది

వందలేండ్లు పూజచందమొప్ప-

భక్త నిర్మిత గుడి భాసిల్లె పలుమార్లు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

13*

కలను గాంచి నిన్ను కనులార దర్శించి

భక్తుడొకరు దెల్ప ప్రాంత జనులు-

పూని పూజలెల్ల పునరుద్ధరించిరి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

14*

ఆపదలు తొలంగె నారోగ్య భాగ్యముల్

కాంక్ష దీర నమ్మకంబు గలిగె!

నియమ నిష్ఠ వెల్గె నిత్యకైంకర్యముల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

15*

పరగ నిచట గల్గు ప్రత్యేకతయె శిలా

శాసనోక్తమౌ విశేషమొకటి-

వాయుపుత్ర నీదు వైవాహికాంశమై

భాగ్యనగర తాడుబందు హనుమ!

16*

సూర్య గురుని వాక్కు సూచిత మగువిద్య-

పూర్తి జేయ సూర్య పుత్రితోడ

నీవివాహమయ్యె! నిజదీక్ష కొనసాగె!

భాగ్యనగర తాడుబందు హనుమ!

17*

ధ్యానమందు నిన్ను దలచె సువర్ఛల

గడిపె బ్రహ్మచర్య కఠిన దీక్ష!

దంపతులుగ మిమ్ము దర్శించి తరియింప!

భాగ్యనగర తాడుబందు హనుమ!

18*

వరుస క్రమముగను, నవవ్యాకరణ తుది-

భాగముల గృహస్తు గాగ నేర్వ-

వలయుగాన మరి సువర్ఛలతో పెళ్ళి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

19*

జరిగె నీదు పెండ్లి-జగతి చోద్యముగాంచె

సూర్యబోధ ధర్మ సూక్ష్మగతుల-

తెఱగు భవిత బ్రహ్మ తేజమై భాసించె!

భాగ్యనగర తాడుబందు హనుమ!

20*

ధీర వీర శూర దివ్య ప్రభావనిన్

మొగలు బాదుషాలు మ్రొక్కి కొలువ

తెలుగు రాజులవలె తేజరిల్లిరి నాడు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

21*

నయజయంబు గూర్చు నలుబది దివసముల్

మండలాభిషేక దండిపూజ

లొనరజేయు దీక్ష లోకళ్యాణమై

భాగ్యనగర తాడుబందు హనుమ!

22*

గర్భ గుడిని మెఱయు గ్రానైటు పలకముల్

తాపడంపు నిగ్గు తళుకులీను

గోపుర మహరాజ గోపురకాంతులన్

భాగ్యనగర తాడుబందు హనుమ!

23*

వివిధ విధుల వసతి వీలైన సత్రముల్

ఖర్చుతగ్గు కార్య క్రమము చౌక

గలుగు భోజనాల కళ్యాణమండపమ్

భాగ్యనగర తాడుబందు హనుమ?!

24*

హెచ్చె జనుల రద్ది యేయేటికాయేడు

భిన్న వేషబాషలున్న తీరు

భక్తి భావమొక్క బాటసాగింపగా

భాగ్యనగర తాడుబందు హనుమ!

25*

విధిగ సాగిపోవు వివిధ కైంర్యముల్

నిష్ఠతోడ జరుగు నీజయంతి

వేడ్క శోభయాత్ర వేనోళ్ళ కీర్తనల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

26*

వసుధ బహుళ దశిమి వైశాఖమున నీజ-

యంతి జరుగుశోభయాత్ర సాగు!

చైత్రపూర్ణమికగు చిన్నజయంతియున్

భాగ్యనగర తాడుబందు హనుమ!

27*

లక్షలాది భక్తులాబాల గోపాల

దీక్ష పరులు జనసమీక్ష ఘనత-

పెదహనుమ జయంతిపేరున కొనసాగు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

28*

వచ్చి పోవు జనులు వాహన పూజలు

మూడునాళ్ళజాత్ర మురిపెమొసగ

దురిత – దుష్ట శక్తి హరియించు నీచూపు

భాగ్యనగర తాడుబందు హనుమ!

29*

మండప సువిశాల మార్గాన దర్శనం

ఇరుగు పొరుగు రాష్ట్రమితర దేశ-

భక్త జనుల దాపు ప్రాపైన దైవమా!

భాగ్యనగర తాడుబందు హనుమ!

30*

సీతరాములెదను శ్రీలుజిందగజూపి

స్వామియవతరించు సమయమెఱిగి

దిక్కు ధీమవగుచు దీవించి బ్రోచేవు

భాగ్యనగర తాడుబందు హనుమ!

31*

భక్తి శ్రద్ధ విధుల బాటించు నియమాలు

చిత్త శుద్ధిని వికసింపజేయు

శాంతి సుఖము తృప్తి సత్సాంప్ర దాయముల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

32*

శ్రీనివాస దాస! శివునాంశ సంభూత!

నీతి బాట మాట నిల్పు నట్టి

మానవాళి తత్వ మార్గంబు సవరించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

33*

శరణుజొచ్చి కొలుతు సామీరి! సత్సంగ-

బాటయందు నడిపి భద్రతొసగు!

స్ఫూర్తి ధాతవగుచు కీర్తధనము గూర్చు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

34*

ఆంజనేయ నీకు – అంజలిఘటియింతు

శిష్ట భక్తి నొసగు చిత్త శుద్ధి!

అవని నీదు సేవ-జీవనమ్ పావనమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

35*

స్వాతి నేత నీకు సాత్వికాహార నై-

వేద్య మిచ్చి మ్రొక్కి వేడ్క నలరి

నిండు భక్తి భజన నీరాజనము జేతు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

36*

దాస భజన రామ దాస నీదీక్షయున్

రామ నామ నిర్విరామ జపము-

సాగు గుడిని భక్తి సాహితి శ్రవణము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

37*

నీప్రసాద మహిమ నినదించు దిక్కులు

విశ్వసించు జనుల విన్నపములు

కరువు కాటకాలు గమనింప ప్రార్థనల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

38*

దీక్ష దప్పకుండ దీవించి భక్తుల-

దురలవాటు జనిత దురితమాపు!

దుష్ట కలలుమాన్పి – యిష్టజీవనమిమ్ము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

39*

భయము భక్తి శ్రద్ధ పాడువ్యసనదారి

గూలకుండ శక్తి గూర్చు నంద్రు!

మరల మనిషి మంచి మార్గాన జీవించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

40*

విశ్వమంత నీది విశ్వాసమే మాది-

మంచి చెడుల మధ్య మనిషి మనసు-

నలుగ నీక బ్రతుకు నావను సాగించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

41* ధైర్య సాహసముల ధరసిరుల్ ప్రాప్తించు

భక్తి గల్గ పూల బాట బ్రతుకు

అతుకు వీడ దేలు, నానంద వారాశి

భాగ్యనగర తాడుబందు హనుమ!

42*

దురిత భీతి నరుడు దొడ్డగుణుండగు-

సుకృతప్రీతి శాంతి సుఖమొసంగు

నిత్య తృప్తి మదము నీభక్తి కీర్తనల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

43*

తేజి పాజి గోల తెగని వివాదముల్

బ్రతుకు దెరువు సైన్సు బాట జరుగు

పదిలమగును తిరిగి పాతపురాణముల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

44*

మంచి మానవతయు మర్యాద మార్గముల్

పుణ్యనిధులు భక్తి పూర్వకములు!

మంచి చెడుల సూచి నెంచి సాగిన జయమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

45*

మనిషి-భయము-భక్తి-మైత్రిభావము, పేరు-

కీర్తి ప్రేమ పూర్ణ క్రియలు, దాన

ధర్మ కర్మరహిత ధరజన్మ నిష్ఫలమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

46*

క్రియల బట్టి ఫలము కీర్తయునపకీర్తి-

పాపపుణ్యగతుల బ్రతుకు దారి-

మంచి నొప్పుకొనుట మాయ దప్పుకొనుట!

భాగ్యనగర తాడుబందు హనుమ!

47*

నీతి ధర్మ విధుల నిర్దేశ్యమైయొప్పు

నికరమైన శాస్త్రనిజమదొకటె!

సూత్రపరిధి బుద్ధి సూక్ష్మతదీపించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

48*

రాజి పడిన త్రోసి రాజన్న తీర్పులు-

అందరొక్కటన్న చందమందె!

మార్పు కాల గమన మార్గాను సరణమే

భాగ్యనగర తాడుబందు హనుమ!

49*

ప్రాప్త లేశమునకె బ్రతుకు సంతృప్తియు

పొందు మనసు గల్గ నొందు శాంతి!

కాలమొక్కతీరు గడుపుటే సౌఖ్యము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

50*

ప్రేమ బంచిపెట్ట ప్రేమలభించును

సేవ జేసి యితర సేవ బొందు!

రుజువు ప్రేమ శక్తి రూపాకృతియె సృష్టి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

51*

బాల్య రచన తిరుగ వ్రాయ దోషము గాదు

భావచందగతుల పటిమ మెఱుగు!

పరుల రచనలు నిజ ప్రతుల సమంబులౌ

భాగ్యనగర తాడుబందు హనుమ!

52*

పదగురాట కవిత ప్రస్తావనలెగాని

నికరమేది తుదకు నిగ్గుదేల్చ-

మిగులునేది? గొప్ప మిగుల తాత్కాలికమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

53*

కస్తియగును వ్రాయ ప్రస్తుతి పద్యముల్

మిగతవన్ని బ్రతుకు మిడుకు కృతులె!

పరగ నూక దంపు ప్రస్తావ నలె కదా!

భాగ్యనగర తాడుబందు హనుమ!

54*

మనసు నేను గాదు మరిదేహమును గాదు

బయటకొచ్చియాత్మ పటిమ వెంట-

నేనటన్న మాట నెఱిగన శూన్యమే!

భాగ్యనగర తాడుబందు హనుమ!

55*

అంతరంగ దృష్టి నాత్మదోచని వేళ

నన్ను నేను దెలియ నున్న గతిని-

గురుని కరుణ లేక గురికుదర దందురు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

56*

తరచి తప్పు బట్టి తాలును దంచేరు-

గొప్ప గురులమంటు గొడవ విడక-

భక్తిబాట మరచి భ్రమపడి దూషింత్రు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

57*

పోవు చుంద్రు మనసు బోయిన పోకలన్

తానుమునుగ గంగ తనదె రంభ!

తోచినంతలొ తన తోటిదే లోకము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

58*

తినుట కొఱకె బుట్టి తిండికై బ్రతికేటి

మొండి వాద ప్రజ్ఞ దండి ఘటము-

నాణ్యమైన దైన నవరంధ్రముల తోలు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

59*

బ్రతుకు దెరువు లందు హితవు దలంపక

నిరుగు పొరుగు మైత్రి నింపుగొనక-

భక్తి యనక వెసన బాటబంధిగ జనున్

భాగ్యనగర తాడుబందు హనుమ!

60*

ఇష్టమొకటి లేక దుష్టచింతన సాగు!

దైవమనక నితర దారికేగు!

పనియు పాట లేక పరనిందగ్రుంగేరు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

61*

యజ్ఞ దానతపము ప్రజ్ఞ మెఱయ జేయు

స్వార్థ తేగి జన్మ సార్థకంబు!

ఇహపవిత్రత గను సహన శీలము మేలు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

62*

అర్థ రహిత విద్య నార్జింప ఫలమేమి?

గురుల మెప్పు గనదు గ్రుడ్డి విద్య-

భక్త జనులమెప్పు బడసిన పదివేలు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

63*

ఒక్క మాట దెలియ నొక్కునా తాత్వికమ్

ఆత్మ యెఱుక గనని యవని జన్మ-

మరల జన్మకొఱకె మరలిపోయెడి దారి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

64*

సాత్వికతయు గల్గు సాధన పుణ్యమై

జన్మరహిత ముక్తి జాడ వెలయు

భువి పరోపకారి పుణ్య సంపన్నుడు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

65*

గీత దెలిసి నీతి గీతదాటక జీవి-

తంబు గడిపి యోగదారులరసి-

త్యాగి యగుచు జన్మ తరియించుటే ముక్తి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

66*

ప్రక్కవాని మొట్టి పబ్బంబు గడపగా

సాహితీ ప్రక్రియలు సాగు చుండె

పస్తులుండ వలసె ప్రస్తుతి కవివరుల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

67*

అనుచరాళి భక్తి నాధ్యాత్మికముసాగు

మంచి ప్రక్రియలు సమాజహితవు

తీరు తెన్ను సాహి తిగను రూపొందును!

భాగ్యనగర తాడుబందు హనుమ!

68*

భక్త కవుల యందు భక్తి ప్రధానమై

బరగు తదితరాల పాత్రవేరు-

వస్తువొకటె వేయి వాటేయు ప్రశ్నలన్

భాగ్యనగర తాడుబందు హనుమ!

69*

రాము మ్రొక్కి మంచి రాకపోకలదారి

జన్మ గడపి యాత్మ జనెడు ముక్తి

కలిమి జేర్చు భక్తి గలుగ నీవేయండ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

70*

నన్ను తీర్చి దిద్ధు నయభక్తి దారిలో

జయము నిమ్ము జన్మ జాగృతముగ

ఉత్తమోత్తమ గుణ విత్తంబు నీసేవ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

71*

పండితుండె మరొక పండితుఁదులనాడు

పామరుణ్ణినమ్ము పండితుండు

కంచె చేనుమేసె-కలతబాపుము దేవ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

72*

ప్రస్తుతించు కృతుల ప్రక్రియేదైతేమి?

భావ ప్రకటనంబు బాషలబ్ధి!

నీదు భక్తి దెలుపు నిస్వార్థ సాహితీ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

73*

తిట్టు కవులునెపుడు దిట్టకవులుగాదు

తగువిమర్శ వెన్ను తట్టు క్రియయె-

ఎవరి తప్పు వారికెటు సాధ్యమరయంగ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

74*

భక్తి కుదరబోదు బలవంత పెట్టిన-

రక్తి తొందరగ విరక్తిగాదు

భ్రాంతి వీడి రాగి బైరాగి గా మారు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

75*

తరతరాల నరుని తారతమ్య ప్రతి-

వాద ధరవివాద వరుస తెగదు-

తీర్పు దైవ భక్తి తీరుతెన్నుగ ముక్తి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

76*

కానిపోని పనులు కప్పల తక్కెడ

నికరముగను దేల్చు ప్రకటనేది?

భక్తి దారి జన్మ ముక్తిని ప్రకటించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

77*

కర్త గలుగ వస్తుఁ గామించు నభిమాన-

మూకలుండు కవియు ముదము బొందు!

నిత్య తృప్తి కీర్తి నిండు పేరోలగమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

78*

స్వేచ్ఛ బ్రతుకు జీవ చేతన స్వాతంత్ర్య-

దారి భక్తి సాగు ధరిని జేరు

జన్మ రహిత ముక్తి జాగృతి భారతమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

79*

అవని రామ భక్తి భవబంధ ముక్తికి

నావ సాగు నీవె నావికుడవు

నయము గూర్చు రామ నామమే చుక్కాని!

భాగ్యనగర తాడుబందు హనుమ!

80*

నాణ్యమైన కృషిని నలుగురు మెచ్చగా

చేయు శతక కృతుల చేతనాత్మ-

కర్మ ధర్మ దారి కడతేరు వరమిమ్ము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

81*

భక్తి శతక త్రయము “పాహి మంత్రపురిని

వాస భావి బ్రహ్మ!” వాయు పుత్ర!

నీదు శతకమయ్యె నీరాజనంబుగా

భాగ్యనగర తాడుబందు హనుమ!

82*

కామ రూప! కొండగట్టేశ! మమ్మేలు

కోహరీశ! కృతిని గొనుమటంచు-

సాగిలబడి నీదు సన్నిధి నుంచితీ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

83*

స్వామి!తిరుణ హరిని! సత్యనారాయణన్

వరుస శతక కృతుల వ్రతము సాగె!

భక్తి బాట దీక్ష పథమందు ఫలియించె!

భాగ్యనగర తాడుబందు హనుమ!

84*

ధన్యముగను నలుబదారు శతకములు-

నంకితంబు గాగ దైవ భక్తి-

పూర్ణమైన కోర్కె పులకించె నాత్మయున్

భాగ్యనగర తాడుబందు హనుమ!

85*

వావిలాల గ్రామ వాస్తవ్యుడను బోధ-

గురువు నైతి కవిగ గుర్తు గలుగ-

పండితాళి మ్రొక్కి భక్తి నిన్ ప్రార్థింతు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

86*

అంతరంగము నరి షడ్వర్గములదాడి

అధికమయ్యె భక్తి నరయకుండ-

ఆస్తి నాస్తి బయట నాస్తికములగోల!

భాగ్యనగర తాడుబందు హనుమ!

87*

ధనము నాల్గు శత్రు దారులఁబడిపోవు

తగిన దారి దానధర్మ మొకటె-

పుడమి మిగత గతులు భూపాగ్ని తస్కరుల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

88*

ధనముగోరి బ్రతుకు ధనముకై గతియించు

దాచు దోచు కథలు తగని వెతలు-

చిత్త గతపు చింత చివరకు మిగిలేది!

భాగ్యనగర తాడుబందు హనుమ!

89*

కోర్కెలుడుగ మనసు కోశాన శోకముల్

ఉడుగు శాంతి ముదము ముడిని బడగ

నిత్య సుఖము భక్తి నిశ్చలచిత్తము!

భాగ్యనగర తాడుబందు హనుమ!

90*

రాగి విసిగి భువి విరాగి యౌ త్యాగియౌ

కామి పిదప మోక్ష గామి యగును,

ఇష్ట దైవ భక్తి నిహపర సుఖశాంతి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

91*

శోభయాత్రయందు చోటుజాలని జనము

భక్తి నిష్ఠ సహన భావముదధి-

సంయమనము గూర్చి సాగించు నీజాత్ర!

భాగ్యనగర తాడుబందు హనుమ!

92*

భక్త జనులు పాద ప్రక్షాలనము జేసి

పూజ ద్రవ్యములతొ రోజు వలనె

క్రొత్తవారి గలసి కోర్కెనివేదింత్రు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

93*

మధ్య మందిర శిల మహిమాన్వితము జూడ-

కుఢ్య చిత్ర వింత గొలుపు కథలు-

గర్భ గుడిని జుట్టు గమన ప్రదక్షణల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

94*

వివిధ పూజ విధులు విశ్వాసమును గూర్చు

భక్తి విస్తరించు భావజములు!

నిర్విరామసేవ నిత్యనైవేద్యముల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

95*

విజయ సిద్ధి బాధ వీడిన బంధువుల్

ముచ్చటింప వారి ముందు వెనక

ఎంత భయము భక్తి వింతగొల్పెడు శ్రద్ధ

భాగ్యనగర తాడుబందు హనుమ!

96*

జనుల మేలుకొలుపు జాతిసమైక్యత

దాన ధర్మ మలర ధాతలగుచు

దాస జనులు నిన్ను దరిజేరి మ్రొక్కేరు!

భాగ్యనగరి తాడుబందు హనుమ!

97*

మంచి లేని పనుల మరియాద లుప్తమౌ

మంచి గలుగ వెలయు మానవతయు!

దేవ! నీదుసేవ జీవకారుణ్యమౌ!

భాగ్యనగర తాడుబందు హనుమ!

98*

బ్రతుకు బాట దైవ భక్తి మానవనీతి-

భావి భరత పౌర భాగ్య గరిమ!

ధర్మ పరిధి సకల దారుల కలయికల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

99*

దాశరథియె నీతి ధర్మ సంస్థాపన- దారి మానవావతార మూర్తి-

ధాతయయ్యె జనుల రాతమారెను నాడె!

భాగ్యనగర తాడుబందు హనుమ!

100*

ఉర్వి ధర్మ నియతి యుగములు గడచినా

గీతదాటనీని గీత బోధ!

వెల్గు దిక్కె సాగు వేదాంత సారమై

భాగ్యనగర తాడుబందు హనుమ!

101*

పత్నియొకతె, మాట, బాణంబు నొక్కటే

రామ వ్రతము భువిని రామరక్ష!

నీతి ధర్మపథము నిల్పగా నీదీక్ష!

భాగ్యనగర తాడుబందు హనుమ!

102*

దాస్య భక్త శ్రేష్ఠ ధర్మ రక్షణ బాట-

స్వామి భక్తి వెలయు రామ దూత!

కీర్తి తేజ భజన కీర్తనల్ నీగుడిన్

భాగ్యనగర తాడుబందు హనుమ!

103*

శిష్ట, జాన పద విశిష్టసాహితి రామ-

సీత, లక్ష్మణా సమేత నీదు

చిత్ర దర్శనమున చిత్తంబుపులకించు!

భాగ్యనగర తాడుబందు హనుమ!

104*

భక్తి పాట సాగు బాట సనాతనమ్

తెలుగు శతక పద్య తీపి ఘనత-

సరళ తరము విషయ సందర్భ వివరణల్

భాగ్యనగర తాడుబందు హనుమ!

105*

భక్తి భావ శతక పద్య గానము నిత్య

శుభము-శ్రోతలకును సుఖము, శాంతి-

గురుజనులకు, శిష్య కోటికి శుభకరమ్

భాగ్యనగర తాడుబందు హనుమ!

106*

త్యాగ రాజ రామ దాస కృతులు బాడి

భక్తి శతక పద్య పఠన జేసి-

బడియు సాగె బ్రతుకు బాట నీతినిగూర్చె!

భాగ్యనగర తాడుబందు హనుమ!

107*

పండితులకు, జాన పదులకైనను తల్లి-

దండ్రి, గురువు, నతిథి, యాత్ములైదు-

గురును, దైవ సములు గూర్చిరి నీభక్తి!

భాగ్యనగర తాడుబందు హనుమ!

108*

శుభము గీత గాన సుధలూరు సూక్తులన్

భక్తి శతక నీతి బహుశుభమ్ము!

సకల శుభము సుకవి సద్విమర్శకులకున్

భాగ్యనగర తాడుబందు హనుమ!

Contact
bottom of page