top of page

ఆదికూర్మరూప శతకము
(ఆ.వె.)

1*(ప్రారంభం)

శ్రీరమాధవ! హరి! శ్రితజన మందార!

తిరుమలేశ! ముక్తితీరవాస!

దేవదేవ! భారతీయాత్మ సంచార!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

2*

పాలజలధి జిలుక ప్రార్థింప కూర్మమై

మంధరగిరి భారమంత మోసి

సృష్టి కాన్కలిచ్చి పుష్టిగూర్చిన తండ్రి!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

3*

హరుడు కృపనుబూని, హాలాహలముగొనె

వారుణి గొని దానవాళి యాడ-

అమృతమొసగి సురల నమరులజేసిన

ఆదికూర్మరూప! ఆత్మదీప!

4*

సహన శీలధర్మ సంస్థాపనము జేసి,

బరువు బాధ్యతలను పరగమోయు-

విధులనెత్తి చూపి, విశ్వాసమునుగూర్చు,

ఆదికూర్మరూప! ఆత్మదీప!

5*

విశ్వరూప!జనుల విభజించి సురలకే

మొదటనమృతమొసగి, మోహబుద్ధు-

లైన దానవులను, లయముజేసిన ప్రభూ!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

6*

ఆర్త జనుల బ్రోవనవతారమెత్తియు

ఆపదలను బాపు ఆది దేవ!

నిత్య సేవ్య! దివ్య సత్యలోకనివాస!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

7*

నీతి ధర్మవిధుల నిరతంబు వెలయించు

గీతబోధ గురుడ! విశ్వ నరుడ!

భక్తి నావయందు ముక్తి తీరముజేర్చు!

ఆదికూర్మ రూప! ఆత్మ దీప!

8*

అతుకు వీడి పుడమి బ్రతుకనేర్వని వారి

బ్రతుకు బాధమాన్పు బ్రహ్మజనక!

కర్మ ఫలము గొనగ, కరుణింపరావేమి?

ఆది కూర్మరూప! ఆత్మరూప!

9*

పుణ్యకార్యక్రమము బూని, కర్తవ్యమున్

నిర్వహించు నీతి నియమపరుల-

మెచ్చి, భక్తియోగ మిచ్చి బ్రోచెదవట-

ఆది కూర్మరూప ఆత్మరూప!

10*

నిశ్చలాత్మయందు నెలకొన్న దేవరా

కోర్కలణచి గుండె శోకమార్పి-

సమతయోగసిద్ధి సమకూర్చుమీ ధర!

ఆది కూర్మరూప! ఆత్మరూప!

11*

యోగములను భక్తి యోగమ్ము శ్రేష్ఠము

ముక్తి సాధనము, ముముక్షు-గమన

మార్గములను భక్తి మార్గంబు సులభము!

ఆది కూర్మరూప! ఆత్మదీప!

12*

కర్మయోగి గీత గావించి మముబ్రోవు

త్రికరణాల శుద్ధి తీర్చి దిద్ధి,

విధుల సాగజేసి, విశ్వరూపము జూపు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

13*

మంచి బెంచు కృషిని మన్నించి నడిపించు

కర్మఫలము నీకె కాన్క జేయు

విధము దెల్పి, భూత హితవుగా బ్రతికించు!

ఆదికూర్మరూప! ఆత్మరూప!

14*

ముళ్ళమీద పూలు పూయించు నీలీల

మూడు నాళ్ళ బ్రతుకు మురియు హేల!

నీదు సృష్టి కథలు, నిత్యవిచిత్రముల్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

15*

పనియు పాటలందు పనిముట్టువలె దిర్గి

బ్రతుకు పంటనూర్చి భక్తజనులు-

ఆత్మ గాంచి ముక్తి కారాటపడుచుంద్రు!

ఆదికూర్మ రూప ఆత్మదీప!

16*

మంచియనగ పుణ్య పూర్వకమగు పంట

గడ్డి గాదమంత చెడ్డచెత్త

మంచిగొనెడు జన్మ సంచారి జీవాత్మ

ఆదికూర్మరూప ఆత్మరూప!

17*

చిత్త సదన నిలయ! శ్రీకూర్మ గిరినాథ!

ధర్మబద్ధమైన ధనమొసంగు

ధర్మయుక్త కామ్య కర్మఫలముగొను!

ఆదికూర్మరూప ఆత్మదీప!

18*

మనసు దిరిసెనసుమ మార్ధవంబున నిల్పి

మాట తీపి దనము, మారుమ్రోగ-

పని పరోపకార పథము సాగగనిమ్ము!

ఆదికూర్మరూప ఆత్మరూప!

20*

భువిపరోపకార బుద్ధిగల్గుట మేలు

దానిచేత పుణ్య ధనము గల్గు

పుణ్యధనము ముక్తి పూర్వకమగు నిధి!

ఆదికూర్మరూప ఆత్మదీప!

21*

భువిపరోపకారి,పుణ్యాత్ముడైచను

జన్మరహితముక్తి జాగరూక-

తగను, ఆత్మదెలిసి, తాదాత్మియము బొందు!

ఆదికూర్మరూప ఆత్మరూప!

22*

పరులకుపకరించు పని పుణ్యము, పరుల-

పీడనంబె పాప ప్రేరితంబు!

సకలశాస్త్ర సార సర్వస్వమిదియంద్రు!

ఆదికూర్మరూప ఆత్మరూప!

23*

నీదు నాటకాన నిల్చిన పాత్రలు

నటన సాగు నీదు ఘటన గాగ!

నిగ్గుదేలునాత్మ నీలోన లీనమౌ!

ఆదికూర్మరూప ఆత్మదీప!

24*

పరుల మంచిగోరు పనులెల్ల పుణ్యము

గూర్చు మేలు, చెడును గూడి పనులు

పాపమగుచు నరక కూపంబులోనెట్టు!

ఆదికూర్మరూప ఆత్మరూప!

25*

ఇచ్చ వెంట భక్తి యింపుగూర్చును, ఇష్ట-

దైవపూజ సాగు, తనివి దీరు

భక్తి సొంత బుద్ధి-బలవంతములు వృధా

ఆదికూర్మరూప ఆత్మదీప!

26*

పాపభీతి చేత బరగుపుణ్యప్రీతి

పుణ్య ప్రీతి భక్తి పూర్ణు జేయు!

భక్తి పూర్ణత నిను భావింప సఫలంబు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

27*

తరతరాల భక్తి తాత్విక బోధలన్

సూక్తి నిధులు గ్రోలి, సూత్రధారి-

నీవటంచునాత్మ నిల్పి దర్శించేరు!

ఆదికూర్మరూప ఆత్మరూప!

28*

తరతరాల సూక్తి నిరతంబు వల్లించి

సహనమొప్ప, భక్తి సాధనముల

నీదుమెప్పుబొంది-దివ్యత్వమందేరు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

29*

నీదు మహిమ సహన నిధిగూర్ప మదికోర్కె

ముడుచు కొనగ, శోకముడిగిపోవ-

కీర్తికాంక్షగొంద్రు, గీతావగాహనన్

ఆదికూర్మరూప ఆత్మదీప!

30*

జగతి సాగు, సకలసాధన సర్వస్వ

కర్మసాక్షి నీవె! కర్మయోగి!

సకల వస్తుతత్వ సారాంశమును నీవె!

ఆదికూర్మరూప ఆత్మదీప!

31*

భరత భూమి వెలయు బహుపుణ్య తీర్థముల్

క్షేత్రములను నీదు సేవసాగు!

బాబలందువెల్గు భావసంపద నీదె-

ఆదికూర్మరూప ఆత్మదీప!

32*

ముగ్ధ భక్తి పల్లె మురిపాల సంద్రమే

ఇష్టభక్త చేష్టలింపునీకు!

వారిమెచ్చి తర్కవాదుల మార్చేవు

ఆదికూర్మరూప ఆత్మదీప!

33*

వివిధ భక్తి కథలు వివరింప తొమ్మిది

భాగవతము దెల్పు భావ గరిమ-

దారులన్నినీదు ధామంబునకుసాగు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

34*

నీదుమూర్తి భక్తి నికషలకు స్ఫూర్తి!

సహజ నిశ్చలత్వ సహన కీర్తి!

తరతరాలుగ గను, తామేటియేమేటి!

ఆదికూర్మరూప ఆత్మదీప!

35*

భారతీయులందు భావసమైక్యత

సహన, సంయమనము, సమత, మమత

బలము పుంజు కొనును భాగవతోక్తులన్

ఆదికూర్మరూప ఆత్మదీప!

36*

సకల మతములందు సమతయోగము గాంచు

భారతీయ జన్మ భాగ్య గరిమ!

భారతాన విశ్వభావనల్ ధ్వనియించు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

37*

లోకులందు భిన్న మొప్పు జీవనగతి

సాగు బాట గలుగు, సఖ్య భక్తి!

విస్తరింప నరుడు విశ్వ కుటుంబియే

ఆదికూర్మరూప! ఆత్మదీప!

38*

ఆశ మోసులెత్తు, నతిదీర్ఘ పాశమై

బ్రతుకు వెంటసాగు నతుకువిడక,

రీలుదారమట్లు గీలించు కోర్కెలన్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

39*

పెంపుకొలది, యాశ తెంపులేకను సాగు

నింపుగూర్చు, తృప్తి సొంపనీక-

కోర్కెవాడులోపె కొంపముంచునుహరీ!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

40*

సాటి పోటి బ్రతుకు సంఘజీవనమందు,

సూటిపోటిమాట స్రుక్కజేయు!

సహన మొకటె తృప్తి సరిదూగు సుఖయాత్ర!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

41*

మనసు శుద్ధి చేత, మైత్రిబంధముసాగు

మాటశుద్ధి, కీర్తి-మూటగట్టు!

కర్మ శుద్ధి ముక్తిగాంచు చందము భువిన్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

42*

మనసు జారు దాక మారవు బ్రతుకులు,

మాటజారు దాక మైత్రి నిలుచు!

కాలుజారుదాక కలుగదు హానియున్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

43*

కపటవాదమందు కలహంబు చెలరేగు

కపటి పనియు పాట కలుషయుతము,

నటనమైత్రికన్న నయము శాత్రవరేవు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

44*

అప్పుజేసి బ్రతుకు గొప్పప్రదర్శింప, ఈసుగల్గి లోకమీసడించు!

చేయకున్న తిరిగి చేతగాదని దెప్పు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

45*

పోలు పొందులేక, పొసగదు వైవాహి-

కంబు,డబ్బుకాంక్ష, కడకు, మిగుల-

మేలుగాదటంచు మేధావి వాక్రుచ్చు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

46*

వైరి దేశి దోచె, వైదికసంపదల్

భారతీయగతము, పరుల సోకె!

రాక, పోక నాగరికపు టాకును, టీకు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

47*

పెద్ధలెల్ల నిన్ను, పేరుపేరున జూపి

బుద్ధినిల్పి, భక్తి బూను విధుల-

గిట్టుదాక, గీత గిరిగీసిపోయిరి!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

48*

పల్లె కంత్రియయ్యె, పట్నాలు మెరుగయ్యె,

సరుకు కల్తి, కళల సరణి కల్తి!

కంటియద్ధపు రుచి, కడు మోసమయ్యెను!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

49*

గెలిచియోడె, పోటి గేలికేళినియాడె-

నోడె గెలిచె, తిట్లకోర్చు బ్రతుకు-

స్వామి భక్తి, ధైర్య సాహస సిరిమేడ!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

51*

మేధ బ్రతుకు ముళ్ళ మీదిపూముచ్చట

రాతి బ్రతుకు కేది రవ్వకీర్తి!

సాధు బ్రతుకె నయము సగటు జీవన జయము

ఆదికూర్మరూప! ఆత్మదీప!

52*

సహనమొకటె నరుని కిహపర చేయూత

భక్తి గలుగ, శక్తి యుక్తి గలుగ,

మంచి బ్రతుకె నీదు మహిమకు ప్రతిరూపు!

ఆది కూర్మరూప! ఆత్మదీప!

53*

కొండెగాని బ్రతుకు, కొడిగట్టు దీపమే

చాడినమ్ము చవట, సగముబ్రతుకు ఎడ్డెమంటె తెడ్డెమే, చెడ్డ పాపమే

ఆదికూర్మరూప! ఆత్మదీప!

54*

మంచిమైత్రి,సగటు మనుజుకూరట గూర్చు

మంచిమాటనేర్పు, మంచి గురుడు!

మంచి జనుల మధ్య మనుగడ స్వర్గమే

ఆదికూర్మరూప! ఆత్మదీప!

55*

సగటు మనుజు వృద్ధి సామాజికనర-

ధీప్రయోగశాల యిహమునందె!

మొదట విధిని దెల్ప మోదంబు సాధించు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

56*

చెట్టు పేరుజెప్పి గొట్టెకాయలనమ్ము-

కొంటెకాలమేగె, కొమ్మకొక్క-

రుచినిగాయు చెట్లు రూపొందె నూరూర-

ఆదికూర్మరూప! ఆత్మదీప!

57*

దుష్ట చెలిమి విషము, దురిత కలిమి చేదు

బ్రతుకు తేనెకుండ బడిన-నీటి

బొట్టు పగిది, ఎయ్డ్సిబొంకించు బోర్లించు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

58*

క్షణిక సుఖమె, ఎంత పనికి మాలిన చేష్ట

దుడుకు దనపు ఎయ్డ్సి దూరు దారి

కడ్డుగోడ నీతి- కట్టుబాటున గల్గు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

59*

నీదు తత్వమెరుగ నైతిక విలువలే

అర్హతప్రతులుగ, అదుపు పొదుపు-

గట్టిమేలు, నీతి కట్టుబాటున గల్గు!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

60*

స్వామి దాటనిమ్ము సంసారసాగరమ్

భక్తి నావజేర్చి ముక్తినిమ్ము!

విశ్వమంతనీదె-విశ్వాసమేమాది!!!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

61*

భక్తి పరిమళించు బాబాల బోధనల్

నీదు సేవ జీవి సేవగాగ

నీదరికిని సాగు, నిత్యమౌ శోధనల్

ఆది కూర్మరూప! ఆత్మదీప!

62*

శత్రు శత్రు మైత్రి సాగె చాణక్యుడు

గెల్పు తంత్రమాడి పిలిచె పాత-

మంత్రి, రాక్షసు తగు మంత్రిగా ప్రకటించె!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

63*

స్వామి కార్యమొప్ప, సాగు స్వకార్యముల్

తేగ గుణమె బంటు తెగువ దేల్చు

పేరు కీర్తి జనుల ప్రేమకు పాత్రము

ఆదికూర్మరూప! ఆత్మదీప!

64*

చేతగాని వేళ చేయూత గోరుటల్

చేవ కొలది సేవ జేయుటెల్ల

తక్కువేమి తాను దక్కి దక్కింపగన్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

65*

చేవ గల్గి కర్మమానియు నిరతంబు

చేయిదాచుకొన్న జెందునింద

నిందితుండు బొందు నీరస చరితంబు

ఆదికూర్మరూప! ఆత్మదీప!

66*

ఉరుము కన్న ముందె ఊరంత మెరిపించు

పిడుగు హెచ్ఛరికలు-పిదప మృత్యు-

జగతి జాగ్రత పడు-జనులదే పైచేయి!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

67*

పరువు బ్రతుకు దెరువు, పరిమిత సంతాన

పథకమమలు నేటి ప్రగతి మెట్లు!

కాని వేళ సంత గానుగే జీవితమ్

ఆదికూర్మరూప! ఆత్మదీప!

68*

సాంప్రదాయమందు,సైన్సుజోక్యము మేలు

దానియందు సాంప్రదాయ నీతి-

తగిన మేళవింపు, తాలింపు సొంపయ్యె!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

69*

కంపమొందు పుడమి, కలుగు సునామియున్

ప్రకృతి వైపరీత్య ప్రాభవంబు!

విరుగుడేది గీత విశ్వరూపము గాక!

ఆదికూర్మరూప! ఆత్మదీప!

70*

నరు దురాశరూపు – నాదను స్వార్థమే

అంతులేనియాశ వింత బ్రతుకు!

ఘోరకలినిగెల్చు గోరంత భక్తియే

ఆదికూర్మరూప! ఆత్మదీప!

71 *

కంటక సుమపథం కర్మాను జీవనం

కలసియుంటె సుఖము, కష్టముండు

జరిగినదియు, మరల జరుగని భావనల్

ఆదికూర్మరూప ఆత్మదీప!

72 *

మనసు తీపి చేత-మైత్రి భావము వెలయు

మాటతీపి చేత మనిషి గొప్ప!

పనుల తీర్పు చేత ప్రభవించు సత్ఫలం!

ఆదికూర్మరూప ఆత్మదీప!

73*

మంచి మిత్రు వలన మదికినూరట గల్గు

సద్గురుండు బుద్ధి చక్కదిద్దు!

మంచి జనుల నడుమ మనుగడ స్వర్గము

ఆదికూర్మరూప ఆత్మదీప!

74*

సకల జనుల సుఖము సరిగోరు భారత

జాతి భిన్నమేక రీతి బ్రతుకు!

విశ్వ సామరస్య వీధి పతాకమే

ఆదికూర్మరూప ఆత్మదీప!

75*

భారతీయ తత్వ భావంబు దీపించు

వేష బాషలందు వేల్పులందు!

చదువు శాస్త్రమందు సంస్కృతి నినదించు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

76*

ఐక్యతొకటె జాతి ఐశ్వర్య హేతువు

దీన జనుల సేవ దేశ భక్తి!

భారతీయ ఘనత పరమత సహనము!

ఆదికూర్మరూప ఆత్మదీప!

77*

మనిషి గొప్పదనము మరియాద లోనుండు

బ్రతుకు ఘనత సామ్య భావదృష్టి!

సర్వజనుల సుఖము – సమత మమత-పుష్టి!

ఆదికూర్మరూప ఆత్మదీప!

78*

స్వార్థ భక్తి ఫలము సాంతంబు నాశించు

ఫలసమర్పణంబు పనుల-మరచు!

గీత మరచి, నీతి గీతదాటగ జూచు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

79*

నుదుటి ముడుల పరద – ముదురు హాస్య సరద-

పరిధి దాటి, బురద-పలుముఖాల-

వెలయ జేయు పనుల, వేడుక గనవృధా!

ఆదికూర్మరూప ఆత్మదీప!

80*

ఆరు రుచుల, నాల్గు – ఆహారములు-నుప్పు

హెచ్చు తచ్చులు-సమ పచ్ఛడులును,

కూటి చదువు, నేడు కోటికై చదివేరు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

81*

విధులు బాధ్యతలును వివిధ హక్కులు ప్రజా

ప్రభుత చట్టపరిధి పాత కథయె

దొంగ సామి యుక్తి కొత్తదయ్యెను భక్తి!

ఆదికూర్మరూప ఆత్మదీప!

82*

గుండెయనగ హృదియె – గుర్తు బాషయు సైన్సె-

దర్శణీక్ష, క్రొత్త దర్పణీక్ష-

రంగులేడు కంట రణరంగ దృశ్యమే!

ఆదికూర్మరూప ఆత్మదీప!

83*

దారిమారె,మెరుపు తలపు నాగరికత-

తీరుమారె, నడచు జీవయాత్ర-

యాంత్రికంబు, వెసన తాంత్రికములు జత!

ఆదికూర్మరూప ఆత్మదీప!

84*

పరిసరాల కలుష ప్రాభవ చర్చలన్

చాపక్రింద నీరు, సాగు కల్తి!

మందులందని రుజ-మధ్యాంతరపు చావు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

85*

అన్నమమృత సమమె, అతి యంతట విషం-

మితము దప్పు బ్రతుకు నతుకదేది!

ఎదుటి వారి ముంచు, ఎదురీత శ్రమఫలం!

ఆదికూర్మరూప ఆత్మదీప!

86*

గట్టిమేలునుదల పెట్టుటే క్షేమము!

పోటి తంపిబెట్టి పొందు గెలుపు-

విద్యలేల? మిగత విధులెట్లు నెరవేరు?

ఆదికూర్మరూప ఆత్మదీప!

87*

కౌలు భూమి దున్ని కాడెద్దు తెగనమ్మి

అద్దె టాక్టరెక్కి-పెద్ద రైతు,

సాయమడిగెను వెవసాయ రుణము దీర్ప!

ఆదికూర్మరూప ఆత్మదీప!

88*

చదువు-నవల,కవిత,చవిదప్పె సాహితీ!

కావ్యకన్నె దాన-కర్మజిక్కి-

కవులు గోరు ఖర్చు-కలవారి రాయితీ!

ఆదికూర్మరూప ఆత్మదీప!

89*

చుట్టలారెలిరుసు-బుడ్డి శీలయు కమ్మి

పట్టి వంటి కవులు పలు రకాలు!

చక్ర సాహితి శ్రమ-శకటాల నీడ్చిరీ!

ఆదికూర్మరూప ఆత్మదీప!

90*

స్వేచ్ఛయు,స్వతంత్ర-జీవనేచ్ఛ కవిత- మ్రోగెనాడు, పేద మోదమెసగ-

కలలు గన్న కవియు కలమును ఝులిపించె!

ఆదికూర్మరూప ఆత్మదీప!

91*

సర్వ జనుల సుఖము శాయించుభారత

భిన్నమేక రీతి ప్రీతిగొన్న-

జాతి సామరస్య జగతి బాహుట నెత్తె!

ఆదికూర్మరూప ఆత్మదీప!

92*

లోకులెల్ల తమలోపాలు కనుగొని

బాహిరాంతర రిపు బలము గెలిచి- ఆత్మ దెల్సియు పరమాత్మ గాంచుటె గీత!

ఆదికూర్మరూప ఆత్మదీప!

93*

నిత్యశంక,నీదు నిజరూపు నమ్మదు

చుప్పనాతి బుద్ధి – శుక్రనీతి

వల్లెవేయు, నీతి జల్లెడలో రాలు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

94*

శంకదీర్చి బ్రతుకు వంకర సవరించి

వాస్తు జీవన దయ వాస్తవంబు-

గూర్చి మంచిజేయు గుర్తుగా గురువాక్కు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

95*

దేశి వీడి-ఇతర దేశిననుకరించు-

పరుల పాత్రనిరికి పలవరించు-

నేటి-భారతీయు నేమన్న నేముంది!

ఆదికూర్మరూప ఆత్మదీప!

96*

ఐక్యతొకటె,జాతి ఐశ్వర్య హేతువు!

దీన జనుల సేవ దేశభక్తి-

పరగునెట్లు-దైవ భక్తిచాయలు లేక!

ఆదికూర్మరూప ఆత్మదీప!

97*

ఉండి లేమి, పుడమినున్నంత కాలము-

నొంటి చేయి సడియె! ఒంటి బ్రతుకు!

ఇచ్చి పుచ్చు కోలు-యిరుపక్షముల మేలు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

98*

గ్రహపు గమన గణన గావించె నానాడె

నావరాహమిహిరు నాత్మఘోష-

నవ ఖగోళ శాస్త్ర నాదబ్రహ్మము కదా!

ఆదికూర్మరూప ఆత్మదీప!

99*

మేటి శాస్త్రి జెప్పె – నేయింట నేగ్రహమ్

అంతరిక్షయాన దొంతరాల-

దేల్చి చెప్పె సైన్సు-ఏగ్రహమేయిల్లు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

101*(సంపూర్ణం)

అవిటియైన,భక్తి దివిటిని శోభిల్లు

చవటయైన భక్తి సంస్కరించు

నీదు కృపయు గల్గ నిత్య కీర్తిని గాంచు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

102*

విషము గల్గ దాని విరుగుడు గల్గును,

విషము గల్గ నట్టి- విషయమందె-

అమృతముండు, నిన్ను నాశ్రయించియు నిండు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

103*

భయము వేరు, నీతి బాహ్య భయము వేరు

మంచి విషయ శ్రద్ధ మాట వేరు!

ఒక్క మాటకన్ని నొక్కవు వాక్కులన్

ఆదికూర్మరూప ఆత్మదీప!

104*

నీదు భయముచే, నిత్య కళ్యాణముల్

దురిత భయముచేత పుణ్యకర్మ-

పరుల కుపకరించు పచ్చతోరణమగున్

ఆదికూర్మరూప ఆత్మదీప!

105*

బ్రతికి పోతి నీదు భయభక్తి శ్రద్ధలన్

దూరమైతి చెడుకు-దుడుకు మాని,

ఇచ్ఛ ముడుచుకొంటి-కచ్ఛపముగ మదిన్

ఆదికూర్మరూప ఆత్మదీప!

106*

నీదు కృపయు గల్గె నిస్సారపు హృదిన్

భక్తి గురిసె, గురుని యుక్తి మెఱసె!

అక్షయ ప్రమిద ముముక్షువై మ్రొక్కెదన్

ఆదికూర్మరూప ఆత్మదీప!

107*

క్షితి చరాచరుల-సజీవనిర్జీవుల-

ద్వంద్వములకతీత దారి గీత-

భావ జలధినీది-భక్తి నిన్నర్చింతు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

108*

శుభము పాఠకులకు శ్రోతలకు శుభము

శుభము శతక కవుల కభయ ప్రదము

శుభము భక్తి శతక సూక్తి శుభము గూర్చు!

ఆదికూర్మరూప ఆత్మదీప!

Contact
bottom of page