top of page

 

దశవేషధారి(మనసా) శతకము

(కo.)

1*

శ్రీవాసు దేవ పదయుగ,

సేవా భాగ్యంబు చేత సేమము గలుగన్

భావాలు, భక్తిపూరిత,

మైవాక్కుల కంద చందమయ్యెను మనసా!

2*

విద్దెయె బుద్ధిని తీరిచి-

దిద్ధును, విజ్ఞాన విషయ,ధీమను గూర్చున్

విద్దెయె, జీవన సౌష్టవ

వృద్ధిని గలిగించు,భక్తివిరియగ మనసా!

3*

అంగడి గొనలేనిది, ధర

దొంగలుబడి దోచుకోని తోరపు విద్ధెల్

సంగతి నుత్తమ గౌరవ

ముంగను, పరదేశమైన, ముదమున మనసా!

4*

అక్షరము రాని మనుజుని-

రక్షరకుక్షంద్రు, సాక్షరాస్యత ధరలో,

నక్షయ కీర్తి కరంబగు,

రక్షణ కవచంబుగాగ, రాజిలు మనసా!

5*

భూమిని సృష్టియు జెదరగ

సోమరి సోమకుడు దోచె, చోద్యపు విద్యల్

నీమము దప్పియు దాచగ

నేమియు లాభంబు గలిగె నేర్పడ మనసా!

6*

మచ్ఛరి సోమక మ్రుచ్ఛును

మచ్చపు రూపెత్తి, శౌరి మహసంద్రంలో,

జొచ్చి వధించియు విద్దెలు

దెచ్చియు విధికిచ్చి, సేద దీర్చెను మనసా!

7*

చదువుల నిచ్చియు, స్రష్టను

పదవిని నియమించె, సృష్టి పథకము హరియే,

పదిలము జేయగ వెలసెను,

సదయుడు శ్రీ మచ్ఛగట్టు, సదనుడు మనసా!

8*

చదువే సంపద లొసగును,

చదువే పురుషార్థసిద్ధి, సదమల వృత్తిన్

పదవిని పరువు ప్రతిష్టగు,

చదువే జన సాహిత్యరూప చతురత మనసా!

9*

మచ్చము జలచరమే భువి-

నచ్చపు జీవాళి కాదియవతారముగన్

వచ్చెను, సృష్టిక్రమమున స్వచ్ఛపు జీవాత్మ భావ సరళిని మనసా!

*[కూర్మావతారం]*

10*

శ్రీవేద వేద్యు తిరుపతి-

దేవాలయవాసు,భక్తి దేలుచు పుడమిన్

దేవాదిదేవ! బ్రోవుము,

నీవే దిక్కనుచు మ్రొక్కు నిరతము మనసా!

11*

పాలసముద్రంబు దరచ,

వీలుగ గిరివీపు దాల్చ వేడిరమృతమున్

దేలగ, ముందర తామే,

గ్రోలిరి, శ్రీ కూర్మ రూపు గొల్చిరి మనసా!

12*

తరచిరి కాన్కలు గాదని

వెరవక హాలాహలంబు వెడలగ సైచీ

తరచిరి, మదినుత్సాహము

దరగక నమృతంబు వెడలు దాకను మనసా!

13*

విషభోక్త పార్వతీశుని,

విషయంబే త్యాగమయము, విశ్వంభరుడౌ,

ఝషకూర్మ రూపు లీలలు,

ఋషులకు నవగతముగాని, ఋజువులు మనసా!

14*

శ్రీ పతి మోహినిగ, సురల

ప్రాపున నరుదెంచె, సుధను బంచగ దనుజుల్

దాపున మైమరచి, కనుల-

రూపును ద్రావరె, విమోహ రూఢిని మనసా!

15*

పంచిన సుధతీరుకు నిర

సించెడు, దనుజాళి, నీరసించెను సృష్టిన్

వంచకులకు దక్కిన నివ

సించగ దరమౌనె పున్నె జీవికి మనసా!

16*

టక్కరి రక్కసు డొక్కడు,

చక్కగ సురపంక్తి సాగి, చక్రము కెరయై,

ముక్కలు, రాహువు, కేతువు

లక్కజముగ నీచ గ్రహము లైరట మనసా!

17*

పాలాబ్ధి పుంత దరచగ,

లోలో సూదంటు శక్తి లోకావృతమై

పాలాక్షు ప్రాణ భిక్షను,

వేలాదిగ జీవగతులు వెలసెను మనసా!

18*

కచ్ఛప ముభయ చరము భువి – హెచ్చిన జీవాళి కర్మ హేతువు తానై

వచ్చెను, పరిణామాత్మక-

స్వచ్ఛపు జవసత్వ సామ్య సరళిని మనసా!

*[వరాహావతారం]*

19*

శ్రీ రామ భక్తి తత్పరు,

లారాధనజేయ, వావిలాలను ఖాదీ

యారామమందు, మారుతి

నీరాజనమందు కాస్తనిలువుము, మనసా!

20*

తెలివిని, కలిమిని, బలిమిని

గలిగింప త్రిమూర్తులైన కారణ శక్తిన్

పలుగాకి బుద్ధి గానక,

కలహించిరి హింసబూని కదలిరి మనసా!

21*(ఆదివరాహస్వామి అవతారము)

కనకనలాడేయగ్నిని,

గనిదూకెడు మిడతయట్లు కనకాక్షుండున్

గనివిని యెరుగని రీతిని

మునులను బాధించె, మూఢ ముదమున మనసా!

22*

పుడమిని జుట్టుచు, ప్రాణులు

మడయ, హిరణ్యాక్షుడంత మారణ క్రియకున్

గడగిన, వాని వధించగ,

వెడలిన వారాహరూపు వేడుము, మనసా!

23*

కనిపించిన ప్రతిదానిని,

తన సొంతమటంచునెంచి, దనుజులు బొగడన్

కనకాక్షుడు మితిమీరిన,

జనహింసకు బూనె, పుడమి జడియగ మనసా!

24*

అదరగ-బెదరగ ప్రజవిన

వదరుచు, దానవ వితండ వాదము మీరన్

యెదిరించు, దారి ధర్మము

జెదరగ కనకాక్షు నాజ్ఞ జెలగెను, మనసా!

25*

వరహావతారుడై హరి, వరగర్వి హిరణ్య నేత్రు వధియించె ధరన్

దరిజేర్చె-జీవసృష్టియు,

తరియింపగ జేసె భక్తి దనరగ మనసా!

26*

ఆశనిరాశల నెన్నగ,

నాశయె, జీవింపజేయు, నరులకు ధరలో

ఆశయె, పేరాశగ, యమ-

పాశము, బెనవేయునంద్రు-పదదిలము మనసా!

27*

నాదీయన్నదె నరకము,

గాదా? స్వర్గంబు, దెంపు గలవారలకే-

రాదా? నేనన నేరము,

నీది నాదనక బ్రతుకు నీదుము మనసా!

*[నరసింహావతారం]*

28*

శ్రీనార సింహు గొలువుము,

నానాఫలపత్ర పుష్ఫ నైవేద్యములన్

గానాది భజన కీర్తన,

జీనాత్మ తరింప,మంచి జేయుము మనసా!

29*

పరమేష్ఠి వరము పెంపున,

వరదైవము తానటంచు, ప్రజలకు చాటెన్

ధర కనక కశ్యపుండన,

వెరవిడి, బ్రతుకంగ నాశ వీడిరి మనసా!

30*

కదనానికి రాడేమని,

వెదకుచు దిరుగాడె, విశ్వ వేదిక లన్నిన్

యెదదాగిన హరిగానక,

మదినెంచె మడిసె నంచు మరలెను మనసా!

31*(నరసింహస్వామి అవతారము) వరగర్వి రాక్షసేంద్రుడు,

దురితాత్ముండై, చరించె, తులనాడె హరిన్

వరపుత్రుడు ప్రహ్లాదుని,

పరిహాసములాడె,హరిని బాడగ మనసా!

32*

బోధించిరి గురుదేవులు,

బాధించిరి విష్ణు భక్తి బాయగ బాలున్

క్రోధించక, వారికి తను-

బోధించడె చక్రితత్వ బోధన మనసా!

33*

బాలుని హరిభక్తికపర-

కాలుడుగా మారె, తండ్రి, కడుశిక్షించెన్

తాలిమి, జూపియు బాలుడు,

చాలగ హరినామ మహిమ జాటెను మనసా!

34*

నింగిని, నీటను, నిప్పున

సంగతిగా గాలి నేల సర్వము హరియే

ముంగిలి కంబమునుండడె,

కొంగున బంగారమవడె, కోరగ మనసా!

35*

నమ్మిన భక్తుల కభయము,

నిమ్మహి నీచులకు రయము-నీతికి జయమున్

సమ్మతి సజ్జన గణముల

సొమ్మగు, నరసింహరూపు, గొలువుము మనసా!

36*

బాలుడు జూపిన కంబము,

జీలగ వేయ నుగ్రనారసింహుడు వెడలెన్

లీలగ, హిరణ్యకశ్యపు

గోలను మాన్పించ జీల్చె, గోళ్ళను మనసా!

*[వామనావతారం] *

37*

శ్రీవామనావతారుడు,

దేవేంద్రాదులను, బ్రోవ, దిక్కులు వెలుగన్

వేవేగ బలిని జూడగ-

నావాటిక జేరె, యాగమలరగ మనసా!

38*

వడుగై వచ్చియు పొగడగ,

పొడగనె బలిచక్రవర్తి-బోలినయట్లున్

అడిగిన కోరికలిడగన్,

కడుగౌరవించి బలికె, కరుణను మనసా!

39*

మేటిగ పూర్వులవలె నీ-

మాటను నిలుపంగ నిలువు మనగా, బలియున్

ఏటికి సంశయమనె? హరి,

చోటును మూడడుగులడిగె, చోద్యము మనసా!

40*

చక్రియె యీతండని గురు-

శుక్రుడు వారించ, బలికి సూచన జేసెన్

శక్రుని బ్రోవగ జగతి త్రి

విక్రముడై నిండు నిజము, వినుమనె మనసా!

41*(వామనమూర్తి అవతారము)

వడుగాయని పద త్రయమున్

తడబడకను ధారవోసె, దనుజులు చెదరన్

వడిగా రవిశశి నయనుడు

పుడమిని గొలువంగ బెరిగి పోయెను, మనసా!

42*

భువి,దివి,పదద్వయంబు గొ

లువగా సరియౌ, తృతీయమున్ గొలువంగన్

అవనత బలిశిరమున, హరి

సవరించియు పాదముంచె, సరిపడ మనసా!

43*

బలిజేరెను పాతాళము,

బలపడె సురలోకశాంతి, బాయక ధరలో

కలహించు పిశాచాసుర,

కలకలమెడబాసె, దైవ కరుణన్ మనసా!

44*

దీనుల నేలగ శ్రీ హరి

దానవ సంహారమునకు ధర నుదయించెన్

దానగుణ శీలి బలినే,

తానుగ పాతాళమంపె, దయతో మనసా!

45*

మానవ జపతప సుకృతి వి

ధానము లన్నింట, దాన ధర్మమె ఘనమై,

దానవత మార్చు నుపకృతి,

దీనులతరియింప జేయు,దివ్యము మనసా!

*[పరశు రామతారం]*

46*

రామా! రిపుజయ భార్గవ

రామా! బలభీమ! దుష్టరాజవిరామా!

రామా! జమదగ్ని తనయ!

రామా! మాంపాహి పరశు రామను మనసా!

47*

చెడుదారినిబడి రాజులు

నడయాడగ నంత జనుల నడవడి చెదరన్

ముడివడు మూఢాచారము

నడగించెను, పరశు రామ నామము మనసా!

48*

జనకుని మెప్పించె పిదప,

జననిన్, బ్రతికింపజేసె, జగతినుతింపన్

మునికుల తిలకుడు రాముడు,

మునియాశ్రమ రక్షజేసె, ముదమున మనసా!

49*

ధేనువు కై, తండ్రి దునిమె,

దానవుడా కార్తవీర్యుడని వినినంతన్

వానిని, వెంటాడియునతి-

దీనముగా గూల్చె, పరశు చేగొని మనసా!

50*

జనపాలుర రుధిరంబున,

జనకుని తర్పణలు జేసి జనులు నుతింపన్

మునిజన విధేయుడు, దశరథ-

జనకాదుల విడిచె, విశ్వజయమున మనసా!

51*(పరశురామావతారము)

తాపస రక్షకు-భృగుకుల

దీపకు హరిబ్రహ్మతేజు దీక్షాదక్షున్

కోపవిభూషణు, శరణను

భూపతులే, దక్కిరింక పుడమిని మనసా!

52*

కోటల దాగియు గడపలు

దాటగ లేనట్టి నృపులుదాడులు మానీ! దీటుగ వితరణ బుద్ధిని,

జాటిరి భృగురామ భక్తి, సాగిరి మనసా!

53*

అక్షరమగు జగన్నాటక-

దక్షుడు, నిర్మాత సూత్రధారియు హరియే

రక్షకుడై భువి భక్తుల-

నక్షయ పాత్రలను సృజించి, నడుపును మనసా!

54*

దీనజనావళి గావగ,

దానవులను ద్రుంచి నృపుల, ధరణి జయించీ

దానముజేసెను మునులకు,

మానవతను నిల్పుమార్గ మరయగ మనసా!

*[రామావతారం]

55*

రామా! దశరథ రామా!

రామా! రణరంగభీమ! రాజలలామా!

రామా! రఘురామ! సుగుణ

ధామా! సీతా మనోభి రామను మనసా!

56*

ఆగదు కాలము – నాగిన

సాగదు ధరజీవ సృష్టి సాగెడు దాకన్

ఆగిన యూపిరి మరికొన

సాగదె, శ్రీరామ రక్ష, సరగున మనసా!

57*

రక్కసి దునిమియు యాగము,

చక్కగసాగించి, శివుని చాపము విరిచీ-

చక్కని సీతను రాముడు,

మక్కువ తో బెండ్లియాడె, మహిలో మనసా!

58*

రాముడు,రమణీ భూసుత – కాముడు,

సాకేత సార్వభౌముడు, మేఘ

శ్యాముడు, నాదర్శ మానవ –

నామము, సార్థకముగాగ, నడచెను మనసా!

59*

భూమిజ చెఱగొనె, రావణ-

కాముకుడవ్వాని, బాణఘాతిని గూల్చీ-

భూమిని పాలించె, పరం-

ధాముడు, శ్రీ రామచంద్రు దలపుము మనసా!

60*

గురి దప్పని బాణ మొకటె,

సరిదప్పని మాట యొకటె, సాగెడు మనువున్

మరిదప్పని భామ యొకతె,

వరదుడు శ్రీ రామ విభుని వ్రతమిది మనసా!

 

61*(రామావతారము)

తమ్ముడు – సౌమిత్రి, రావణ-

తమ్ముడగు విభీషణుండు-తగమారుతియున్

నెమ్మది రామునిప్రేమను,

సొమ్ముగ భావించి గొలువ చోద్యమె మనసా!

62*

మంచిని బెంచిన సోదరు

పంచను జేరంగరారె పగతుర తమ్ముల్

వంచకుడన్నను, విడినిర-

సించరె, నిజతమ్ములైన ఛీ! యని మనసా!

63*

దనుజుల దునుమాడెను, ధర

మనుజుల కాదర్శ మార్గమందు జరించెన్

అనుచర నర వానర తతి,

చనువును సాధించె, రామజనపతి మనసా!

*[బలరామ, కృష్ణావతారములు]*

64*

రామ!యదువంశ జలధి-

సోమా! భువి రాచ మల్ల యోధాచార్యా!

రామా కృష్ణాగ్రజ గుణ

ధామా! బలరామయనుచు దలపుము మనసా!

65*

కృష్ణా గోపకిశోరా!

కృష్ణా నవనీత చోర! కుబ్జవరద శ్రీ

కృష్ణా! కుచేల వరదా!

కృష్ణార్పణ భక్తి దైవ కృపగను మనసా!

66*

శేషశయణుండు కృష్ణుడు,

శేషుడు సీరిగ జనించె, నేలను సుఖసం

తోషము గలిగించగ, దశ-

వేషుని లీలావిశేష మెఱుగుము మనసా!

67*

నరకచ్ఛాయలు బాపగ,

నరకాదుల సంహరింప, నరలోకములో

నర నారాయణ మునులే,

వరకృష్ణార్జునులు గాగ వచ్చిరి మనసా!

68*

బలదర్పమొప్ప దానవ,

బలగర్వము వంచి భక్తి బాటను నడుపన్

బలభద్ర, కృష్ణ దేవులు,

బలపరిచిరి, ధర్మపక్ష పాతము మనసా!

69*

ఖ్యాతిని గడించె, సీరియు,

భీతి రహిత యుద్ధ విద్య భీమాదులకున్

నీతిగ నేర్పియు, హితుడై

జాతికి గలిగించె, గొప్ప జాగృతి మనసా!

70*

రక్కసి కరువున రైతులు,

మ్రొక్కగ హలధారి యమున యొడ్డును జీల్చీ-

దుక్కులు దడపగ, లెక్కకు

మిక్కిలి, దిగుబడిని సస్యమిడె భువి మనసా!

71*

చిరిగిన దుస్తుల్వీడియు,

ధరనరులు నవీనములను ధరియించు గతిన్

మరియాత్మ శిధిల దేహము,

సరగున విడనాడి జన్మ సాగును మనసా!

72*

భయమది హృది బలహీనత,

భయమే యపకీర్తికి జత, భయమోటమియౌ

భయహేతువు గీత దెలిపె,

భయవారణశక్తి దైవ భక్తియె మనసా!

*[బుద్ధావతారం]*

73*

బుద్ధుడు త్రిపురాసుర ని-

బద్ధత దప్పించి, దుష్టబలము హరించెన్

యుద్ధమున నీశ్వరుజయ,

సిద్ధికి, తానస్త్రమయ్యె, శ్రీ హరి మనసా!

74*

విద్దెలు నేర్చిన సజ్జన-

బుద్ధియు వికసించు గాని, దుర్జనులందున్

తద్ధయు వికటించును ధర,

బుద్ధియు కర్మానుసారి పుడమిని మనసా!

75*

ధర్మము నశింప ప్రజ దు-

ష్కర్ములుగాగ, బౌద్ధ సంఘమె శరణమ్

నర్మము జేయక, వారికి

మర్మము నెఱిగించి బ్రోచు మార్గము మనసా!

76*

బుద్ధుడు భూతదయా గుణ

వృద్ధిని సాధింప, దుష్ట బుద్ధుల మార్చెన్

శ్రద్ధగ, సుజ్ఞానోదయ

బౌద్ధము బోధించె,కోర్కె వద్దనె మనసా!

77*

కొంచపు వాంఛలు పాపము

బెంచును, మహిజీవనంబు పెనుభారమగున్

సంచిత కర్మను, పున్నెము

మించగ, నిహపర సుఖమ్ము మిగులను మనసా!

78*

నీతి నియమాధికములె-

జాతికి నుపకార నిధులు, జగతిని వెలుగన్

గౌతమ బుద్ధుడహింసను,

నీతిగ బోధించె, బౌద్ధ రీతిని మనసా!

79*

వేదన హేతువు కోరిక,

ఖేదము గలిగించు, రాజు పేదకు నైనన్

మోదము గూర్చెను బౌద్ధము,

వేదికగా నిల్చె, శాంతి వెలయగ మనసా!

80*

సతతమహింసయు,సత్యము,

వ్రతముగ నరజాతి బ్రతుకు బాటయు సాగన్

హితవగు మానవ ధర్మము,

జతపడగా సౌఖ్య మెసగు, జగతిని మనసా!

81*

తరతమ బేధ రహితులున్,

నిరతము సుకృతోపకార నిస్వార్థ గుణుల్

పరపీడన పాప రహిత

నరులే ధర దైవ సములు నరయగ మనసా!

*[కల్క్యావతారం]*

82*

ధర కృత, త్రేతంబు, ద్వా

పర, కలియు, మహా యుగంబు బ్రహ్మకు బగలై

జరుగున్ సృష్టి-స్థితి, లయ,

పరమేష్ఠికి యుగము రాత్రి ప్రళయము మనసా!

83*

కలిలో పాతిక ధర్మము,

కలుగున్ కలికావతార కాలము దాకన్

కలిపురుషు మాయ దైత్యులు-

కలుగన్, నరజాతి నీతి కట్టడి, మనసా!

84*

కాలము దిరుగన్, భువికలి

కాలము, సుఖశాంతి జిక్కుగాలము, మాయా

జాలము, పెనవేయగబో

గాలము, భవబంధ ముక్తి గానదు మనసా!

85*

ఛీకాకు చిత్త చింతయు,

గాకేదిల తుచ్ఛ కామ్య కర్మలు మనుజున్

యేకాకి జేయు, నైక్యపు

సాకేల, వివేక భక్తి సాగుము మనసా!

86*

ఎవరిది దుష్కృత కర్మము,

నెవరిది సుకృతంపు మోద మెవరికి మోక్షమ్?

చివరికి మిగిలేది యశము,

వివరము శోధింప ముక్తి, విడుదల మనసా!

87*

ఎన్నగ పాపవిమోచన,

పున్నెము వెచ్చింప గలుగు పుడమిని కలిలో

అన్నెము దలపక శ్రీ హరి-

సన్నిధి సుమమైన,ముక్తి సాధ్యము మనసా!

88*

నమ్మకము, భక్తి భావమె,

సమ్మతి కలిదోషహరుని సన్నిధి ముదమౌ!

నెమ్మదిలో గురుదేవుని

నమ్మక నానందమెట్లు నలవడు మనసా!

89*

కలిమియు, లేమియు, నిలలో

కలకాలము నుండబోవు, కల్మశరహితున్

కలిమాయ సోక దందురు,

కలియుగమున కల్కియండ గలుగగ మనసా!

90*

మదిలోపల మంచిచెడుల, కదనము కొనసాగుచుండు, కల్క్యవతారుం-

డెదనుండగా, సురాసుర

కదనము నేరూపమందు గలుగదు మనసా!

91*

భయవిషయమెన్న-దురితపు

భయమే,యిరుపక్షములకు నయమును గూర్చున్

భయములను మాన్పు దేవుని

భయమే భక్తిగనుమారి, జయమిడు మనసా!

92*

రక్తిని సాగిన, మదినా

సక్తిని గలిగించు, జీవశక్తిగ భక్తిన్

రక్తిన్ వీడిన, హృదినా

సక్తిని గలిగించు దైవ శక్తియు, మనసా!

93*

చెప్పిన వినువారికి, దగ

జెప్పిరి వేదాంత గుట్టు, శ్రేష్ఠులు దెలియన్

జెప్పిన విననొల్లని, నరు-

జెప్పక పోవుటయె, గీత మేలనె మనసా!

94*

ఇష్టము సాగిన, నొరులకు

కష్టము గానీక ధర్మకట్టడి పరిధిన్

వ్యష్టికి బోధించు విధులు స-

మష్టిగ సాధించు, శాంతి మార్గము మనసా!

95*

చదువుల సాహితి, చతురత

పదములు, వాక్రుచ్చి భక్తి పాటలు పాడీ!

తదిగిన తాళపు సరిగమ

పదనిస రాగాల దేలు, పదిలము మనసా!

96*

పరమార్థమెంచి,పుడమిని

పరులకు నుపకారియగుచు, బ్రతికిన సుకృతమ్

పరమాత్మ జేరుటకు, మది

పరమానందంబు, ప్రథమ ఫలమగు, మనసా!

97*

వేదము నరయగ, హరిహర

భేదము లేదనిరి మునులు, వేదాంతములన్

మోదముగూర్పగ, మ్రోగెడు-

నాదమె, పరబ్రహ్మ జనకు నామము మనసా!

98*

వేదమె పురాణ సూత్రము,

వేదమె – పురుషార్థములకు, వేదికయయ్యెన్

వేదమె-గీతకు మూలము,

వేదమె ప్రశ్నకు పునాది వేసెను మనసా!

99*

నాటి సురాసుర యుద్ధము,

నేటికి మదిమంచి-చెడుల నేర్పున జరుగున్

ఆటున పోటున కాలము,

దీటుగ ప్రవహించు నీతి, దిశలన్ మనసా!

100*

ఆపద మ్రొక్కులు మరచిన,

తేపకు రక్షించు వేంకటేశుడు ధరలో

దాపరమగు దోష- తిమిర-

దీపికయై, దారిజూపు, దేవడు మనసా!

101*

అక్షరమైనది యాత్మయె,

లక్షణ లక్ష్యంబు దఱచ, లయ రహితంబై

యక్షయ పరమాత్మయె,

రక్షణ కవచంబు గాగ, రాజిలు మనసా!

102*

ధర్మమె జీవన – సత్యము,

ధర్మమె పరమాత్మ భావ తాదత్మ్యమమున్

ధర్మమె పరమ పవిత్రము,

ధర్మమె దైవంబు జేర్చు, దారియు మనసా!

103*

ధైర్యము జయమిచ్చు, మనో

స్థైర్యము సమకూర్చు, చిత్త శాంతిని గూర్చున్

ధైర్యము దేవుని వరమగు,

ధైర్యమె సాహసము, లక్ష్మి, ధరలో మనసా!

104*

హింసకు బాల్పడు, కలియుగ

కంసులు, కలిపురుషు మాయ గలుగన్ వారిన్

ధ్వంసము జేయగ, భక్తప్ర

శంసయు బొందంగ, హరిని శరణను మనసా!

105*

ధరవావిలాల తిరుణా

హరివంశోద్భవ, సత్యనారాయణుడన్,

తిరునామ భజనపరుడా!

హరి, దాసుడ, దాసదాస హరియను మనసా!

106*

విభవం బొసగియు, సజ్జన

సభలో మెప్పించు, భక్తి సామ్రాజ్యమునన్

అభయంబిచ్చియు, జీవన

శుభయాత్రను బ్రోచు, భక్త సులభుడు మనసా!

107*

శాంతిని గూర్పగ భువిసం-

క్రాంతిని సమకూర్ప లోక కళ్యాణమె, వే

దాంత నినాదముగను, శ్రీ

కాంతుడు సర్వత్ర నిండె, కనుగొను మనసా!

108*

శుభమౌ! పోతన దలచిన,

శుభమౌ! భాగవత పఠన సుఖదాయక మౌ!

శుభమౌ! దశవేశునిగన,

శుభమౌ! హరిభక్తి భావ సూక్తులు, మనసా!

Contact
bottom of page