top of page
గీతామధురం-1
(తే.గీ.)

1*

శ్రీశ శ్రీకృష్ణ పరబ్రహ్మ! చిద్విలాస!

జీవ జీవనధాత! రాజీవ నేత్ర

సత్య దాస ప్రణీతమీ శతకగీతి!

వేణు గోపాల! వేదాంత వేద్య గొనుమ!

2*

బ్రతుకు పాలముంచు భారంబు నీదె గో-

పాలకృష్ణ! కర్మ ఫలము గొనుము!

సేదదీర్చి దరికి చేదుకో, నీలీల

గీత దెలిపి బ్రోవు క్రీడి వలెను!

3*

సత్య దాస భక్తి సాహిత్య సామ్రాజ్య

సార్వ భౌమ! విశ్వ శాంతి ధాత!

మనువు-నణువు దాక ననుభవ జ్ఞాన వే-

దాంత గీత దీప కాంతి కిరణ!

4*

వేయి రూపులందు వెలుగు దేవుడవీవు!

వెలధర్మ సూక్ష్మ విలవ నీవు!

అవగతంబు గాగ నవని మానవజాతి-

యమరకీర్తి గాంచె మర్త్యమందె!

5*

ధర్మమునునీవె, నయమైన దారి నడిపి

మోక్షమును గూర్చు భువి ధర్మ సూక్ష మీవె!

సూక్తి ముక్తావళిని నీతి సూత్రమీవె!

విధివి నీవె! వేదత్రయ వెలుగు నీవె!

6*

ఆశ్రయము నీవె! మైత్రి నుత్పత్తి నీవె! నాశమును లేని బీజము నందు నీవె!

బ్రహ్మ జనక! నీదయ లేక బ్రహ్మ సృష్టి-

ప్రకృతి చేతనాంశను బొందు ప్రగతి గనము!

7*

అన్నియును నీవె! యవినాశి యనగ నీవె!

అచ్యుతుడవు నీయాజ్ఞ చేనలరు ప్రకృతి!

అమృత – మృత్యు వౌషదము నీవె! అజర భూజ!

సౌష్ఠవాభివృద్ధిని గూర్చు శక్తి నీవె!

8*

ధర్మమును నిల్ప ధర నవతారమెత్తి-

జగతి నాటక పాత్రల జవ మొసంగి-

సుగతి బాటను నడిపించు సూత్రధారి!

పాత్రధారుల కాత్మీయ పరమ పితవు!

9*

తల్లి దండ్రి గురు వతిథి-యాత్ముడనగ,

నీవె! వివిధ రూపుల వెల్గు విష్ణుమూర్తి!

నటన పాత్రల నాడించు ఘటన నీదె!

ధర్మమును నిల్పు నాటక దర్శకుడవు!

10*

భక్త వత్సల దయజూపు పరమ పురుష-

భాగవత పురుషోత్తమ! బ్రహ్మ జనక!

భక్త జనప్రియ! గీతార్థ భావజలధి!

చేతనాంశలో దీపించు శేషశాయి!

11*

జగతి గురుడ! సాధు సజ్జన చిత్తాబ్జ-

సూర్య!నీదు మహిమ సూక్ష్మ గీత-

చేత వెన్న ముద్ధ జేసి మరల దెల్పు!

విశ్వసింప జాపు విశ్వ రూపు!

12*

మూగ మాట లాడు, ముగ్ధవిజ్ఞుండగు

కుంటి పరుగు దీయు, గ్రుడ్డి జూచు!

పూర్ణ భక్తి శ్రద్ధ పూర్తి విశ్వాసమున్

పట్టు దలయు గాంచు గట్టి మేలు!

13*

దేహ రథము నడుపు దివ్య సారథి నీవె!

రేయి బవలు రక్ష రేఖ నీదె!

రథిగ నరుడు నీవు రథసారథిగ నింట-

పటములుండ సిరుల పంటబండు!

14*గీ.

హే ప్రభు! శ్యామ సుందర! వేణు గోప!

హే మురారి! సర్వేశ్వరా! హేముకుంద!

సత్య శివ సుందరాకార! సంయమీంద్ర!

విశ్వరూప! గీతాచార్య విష్ణుదేవ!

15*

ప్రాజ్ఞుడైన నరుడు, ప్రశ్నించె నీసమా-

ధానముగను గీత దనరె బ్రహ్మ-

శోధనంబు, నిత్యపారాయణ-

శ్లోక పాఠమయ్యె! లోకమునకు!

16*

కర్ణుడన సహస్రకవచరాక్షసుడట-

కలిపురుషు నాజ్ఞ ఖలుల జేరె!

శిక్ష జేయు ధర్మ పక్ష పాతివి గాన-

నవతరించి తీవు నవని యందు!

17*

పదుగురేకమగుచు పాంచాలి సభకీడ్చి-

వస్త్రమూడ్వ – మాయ వస్త్రమిచ్చి-

బ్రోచితీవు! దుష్ట బుద్ధులు బంధింప-

నెంచి, చూచి, మూర్చ జెంది రంత!

18*

దుష్కృత కలిమాయ దుష్టచతుష్టయమ్

ఒక్కనివని పదుగురొక్కటయ్యు-

రాయభారి వనక డాయ వచ్చియు నీదు-

వింతరూపు గాంచి వివశులైరి!

19*

మూర్ఖ నృపులు జేరి మూన్నాళ్ళ మురిపెంబు

శాశ్వతమని బ్రతుకు సాగు బాటు-

క్రౌర్యమొప్ప క్రూర కౌరవులనుజేరి-

ముక్తి గనిరి యుద్ధ మూలకముగ!

20*

విజయు మైత్రి నెరపి, విశ్వవీరుని జేసి

రాజ ధర్మ యుద్ధ రచన జేసి-

ధర్మజుండు గెలువ-ధర్మ సంస్థాపన-

జేసినావు నరుడె శ్రేష్ఠుడనగ!

21*

కలిని జేరి పుడమి గల్గిన నరరూప

రాక్షసాళి రాజ రాజు జేరి

పాండు శత్రుపక్ష బండనంబున గూలి

చెడిరి-ధర్మజునకె జెందె కీర్తి!

22*

కౌరవాధములను కబలించె కలిమాయ

రక్తబంధు ప్రీతి రిక్తమయ్యె!

పొందు దోవ మాని పోరుదోవలో దుష్టులున్

గాసిగాగ నరుడు గాంచె కీర్తి!

23*

పోరు నష్టంబు గావున పొందుబాట-

హితవు జూదమనిరి యుద్ధ హింసమాన్ప!

ధర్మజుడు భరియించె జూదరిగ నింద-

శకుని మాయ పాచికబారె శత్రు గెలుపు!

24*

మాయ జూదరిగ శకుని, మామ నింద-

కౌరవులు నల్ప సంతోష గౌరమున-

పందెమునుగెల్చిరెదుటి సంపదలు గొనిరి!

ధర్మజుడుమాయ జూదాన దగిలి యోడె!

25*

తాను తమ్ములు ద్రోవది తరలి వెళ్ళి-

వరుస వనవాసమజ్ఞాత వాసు లైరి!

తోడు పడె-కలి ధర్మంబు తొట్రువడగ-

గెలిచె నరరూప దనుజ నృపాళిమూక!

26*

దైవ బలముచే గెల్చియు-దాయ చేత-

భంగపాటొందె పాంచాలి పగతు సభను!

కురులు విరబోసి ప్రతినలన్ కుదుట బడక-

ధర్మ బాహ్యుల నిందించి తరలి పోయె!

27*

మంచి నరుమెచ్చు మాధవుండంచు గురులు-

మంచి బోధించగా గీత బోధించి-మాయ-

తెరలు జించి యాత్మను మది దేల్చి తత్వ-

సారముగ ముక్తి గను బాటసారు లైరి!

28*

యుగయుగాల ధర్మ యుద్ధ రథము సాగె-

సారథి పరమాత్మ, సాగు హింస-

నాపివేయగ, నరు నాయకుజేసి కా-

రణము గాగ తానె రథము నడిపె!

29*

జగతి నాటక క్రియ జరుగుతున్నది పోరు-

మంచి బెంచి చెడును వంచు కొఱకె!

తనువు వీడియాత్మ తరలు కీర్తిని పుణ్య-

సంచితంబె వెంట-సద్గతికిని!

30*

విశ్వనాటకమున విహరించు నాత్మయు-బుద్ధి జీవి జన్మ బుద్బుదంబు!

తరలి పేలిపోవు తరణంబు దాకను-

వాయువట్లు-ముక్తి డాయు తుదకు!

31*

బలము బలగమున్న భవబంధమును బాయు

సాధనంబె జన్మ సత్ఫలంబు!

పుణ్యమనగ జెల్లు పుడమి కీర్తియు, తేగ-

గుణమె గీత జగతి గురుని బోధ!

32*

చిత్త శుద్ధి లేక, చెత్త దేహము బెర్గు,

చిత్త శుద్ధి ప్రకృతి చేతనాంశ!

శిష్టమార్గము క్రమ శిక్షణ నరజాతి-

చిత్త శుద్ధి గల్గి చెలగు పుడమి!

33*

జన్మ సార్థకమగు జాగృతి సేవలు, స్వార్థమున్న చోట సాగ బోవు!

తేగగుణము లేక తెగువ గల్గదు పుణ్య-

కార్యక్రమము ప్రీతి కరముగాదు!

34*

మనసు గెల్వ యోగ మార్గంబులును సాగు

శ్రద్ధ భక్తి చిత్త శుద్ధి వృద్ధి!

భక్తియోగికి పర బ్రాహ్మీస్థితియుగల్గు!

గుప్త తత్వబోధ గుర్తు గీత!

35*

మనసు నిలిపి మాయ మరజీల్చి పరమాత్మ

నాత్మలోన గాంచు నరుడు జగతి

కామియైన మోక్షగామియై తరియించు!

గుప్త తత్వ గురుని బోధ చలువ!

36*

మరల మరల దెల్పు మాత వలెను గీత-

ధర్మయుక్త కర్మ మర్మ గతుల

దెలుపు దైవ లీల తేటతెల్లము జేయు-

తరచు నరుని ప్రశ్న తగుజవాబు!

37*

తిరముగూర్చి చిత్త తిమిరంబు బోకార్చి

యాత్మ దెలిసి బ్రతుకుయాత్ర విధుల-

మరల మరల తగు సమాధానమిడు గీత-

తప్పటడుగు దిద్ధు తల్లి వలెను!

38*

బ్రహ్మమెరిగి యాత్మ బ్రహ్మమోదము జెంది

బ్రహ్మ జనకు జేర పరితపించి-

యోగ్య తెసగ సకల యోగ సంయమనంబు!

సమత నభ్యసింప సత్ఫలంబు!

39*

ఊర్థ్వ దృష్టి దైవ మూహదోచగవీలు-

నథమ దృష్టి నాశమధికమగును!

మధ్య మార్గదృష్టి మానవతయు గల్గు-

దోష రహిత దృష్టి దోవమేలు!

40*

మానవుండు మారి దానవుడును గాక-

దైవదారి గాంచి తారతమ్య-

మూర్థ్వ నీచ గతుల-నుదధి కెరటమట్లు-

పడియు లేచు ముక్తి బడయు దాక!

41*

ఊర్థ్వ దృష్టి నూర్థ్వ లోకంబు ప్రాప్తించు

ఊర్థ్వ దారి బంధముక్తి ప్రదము!

ఏడుకొండలట్లు ఏడేడు లోకాల

నుర్విమేలు గూర్చు నూర్థ్వ దృష్టి!

42*గీ.

దానవుడు మారి మానవ దారి, దైవ

దారి-జేరగ బహుదూర భారమగును!

మానవుండు నుభయ మార్గ మానసుండు!

నెంచుకొన్నంత సుళువుగా సంచరించు!

43*

భక్తి చేత ధృవుడు ప్రహ్లాదులును నూర్థ్వ-

దారి సాగి దైవ దర్శనంబు-

చేత కీర్తి గొనిరి-చేయూతగా స్వామి

సేద దీర్చి దరికి చేదుకొనియె!

44*

ఎంచు కొన్న దృష్టి సంచరించగ మంచి

చెడుల గోష్టి – మంచి చేత నాంశ-

దైవమిచ్చు నిఖిల ధర సురాసురులకు-

మానవులకు గీత మార్గమందు!

45*

మంచి చెడుల యుద్ధమాగదు కడదాక

బాహిరాంతరాల బలమెరింగి-

నరుని మేధ జొచ్చి నడిపించు కలిమాయ-

మంచి గెలుచు చుండు మరల మరల!

46*

భూత హితవె, భూప్రభూత సత్యముగాగ-

నిర్వచింప బడియె, నియమ నిష్ఠ-

సత్య వ్రతమె మేలు, సత్య హరిశ్చంద్ర-

చరిత చాటి చెప్పె-సత్య మహిమ!

47*

సత్య గతియె బుద్ధి సమదృష్టి సాగించు

సత్య వ్రతమె జీవ సత్య మగును!

సత్వ గుణమె-సకల సాధనంబుల గూర్చు!

సమత గాగ శాంతి సాగు చుండు!

48*

సత్య వ్రతుని యాత్మ సత్య లోకము జేరు

సద్గతిగను-గీత సద్గురుండు-

సత్య వ్రతుల భక్తి సామ్రాజ్యమున జేర్చు!

జన్మ రహిత ముక్తి జనుల కిచ్చు!

49*

భూత హితవె పుడమి భూరి సత్యవ్రతము

భూత దయయె నరుని బుద్ధి శుద్ధి!

భూత హితులవెంట బూని దైవము వచ్చు-

వత్స వెంట గోవు వచ్చు నట్లు!

50*

భూత హితవు పుణ్య భూయిష్టమగు నోము

దోష రహిత దృష్టి దోవ సాగు!

చింత మానియాత్మ చింతన పరమాత్మ-

చెంత జేర్చు భక్తి చేతనంబు!

51*

భువిపరోపకార బుద్ధి, పుణ్యమటంద్రు

భూతహితవె సత్య భూమికగును

భూత దయయులేని పుణ్యసాధనలెల్ల

భూమి విడిచి సాము బూనుటగును!

52*

ఇంద్రియాదులణచి యిందునందును దైవ

చేతనాంశ గాంచి చేయు సేవ-

నలరు వారు పుడమి నపర ప్రహ్లాదులై

ధన్య జన్ములగుచు దనరు చుంద్రు !

53*

జన్మ జన్మ నాత్మ జతపడు పుణ్యంబు

చేత నరుడు బ్రహ్మ చేష్ట లెరుగు!

శత్రులార్గురు మది సద్ధుమణగి చిత్త

శాంతి గలుగ బ్రతుకు భ్రాంతి దొలగు!

54*

చపల బుద్ధి భక్తి సాగదు, స్వార్థమై

లోభమెసగు నిష్ఠ లోపమగును!

శ్రద్ధ గలుగ కుండు శ్రేష్ఠుననుసరించు-

ప్రీతి దొలగి, చిత్త భీతి గలుగు!

55*

తులువయైన శ్రేష్ఠము తులనాడు నుత్కర్ష

శ్రేష్ఠుననుసరించు చేష్టమాను!

దోషదృష్టిని తన తోడిదే లోకమై

పోవుచుండు మనసు బోవుపోక!

56*

స్వార్థమసుర వృత్తి సాగుతామసగతి

సత్వ చిత్త వృత్తి సాగు సమత-

యోగము భువి రాజయోగము రాజసమ్

ఏది యైన శ్రద్ధ నెసగ వలయు!

57*

స్వార్థపరుల భక్తి సాధన నాటకమ్

సేవ బూటకంబు చెందు ఫలము-

వరుస మున్గియు తమ వారలముంచగా

వాస్తవంబు దాచి వాదులాడు!

58*

కదలు నీట వస్తు కనరాదు కలుషంబు

కల్గు నీటనదియు గానరాదు

చపలబుద్ధి యట్లు సఫలత గనలేదు

నేతిబీర నీతినే తలంచు!

59*

గతమె మేలు వచ్చు కాలంబు కంటెను

నాటి నన్నయార్యు మాట దలప-

వచ్చు కాలకీడు హెచ్చుకాలుష్యమే

గతము కంటె కలుష గతులు మించె!

60*

మంచి వినరు కనరు మంచి మాట్లాడరు

పోరు మానుకొనరు పోటిమాటె!

సంధియనరు నాత్మ సంధించి పరమాత్మ

నరయకున్న, మేలు-శరణటన్న!

61*

కర్మ యోగి బూనుధర్మ సంస్థాపన

కర్మ జీవి, నరుని కదన గరిమ!

జగతి నాటక క్రియ జరుగనున్నది-

జరుగు యుగయుగాల జగతియందు!

62*

ఆత్మ పుణ్యనిధుల నార్జించు ప్రక్రియల్

జన్మ జన్మ గతులు జగతి ధర్మ-

ప్రగతి నవతరించు పదివేసముల సామి-

చేయు గీతబోధ చేతి గీత!

63*

మనసు జుట్టి మాయ మనుగడ నరజాతి

కాని పనుల గోరి కాలు దువ్వు!

కర్త తానెయనుచు కర్తవ్య ధర్మమున్

విస్మరించ-జగతి విభ్రమంబు!

64*

మోహమందు నరుడు మోదంబు తత్కాల-

మనక బుద్ధి నాత్మ మరచు పనుల-

మాయ ప్రకృతి జఢము-మార్గాతరంగమై

లొంగి పోవు ద్రవ్యలోభియగును!

65*

ధర్మ ధేను రక్ష కర్మయోగి పరీక్ష-

యుగయుగాల దీక్ష నుర్వి రక్ష~

గాగ, గీత వేద గానంబుగా యోగ

సాధనముల దెలిపె సద్గురుండు!

66*

గీత గురుడు పుడమి నీతి ధర్మము గూర్చె

పూను యోగ గతులె తూనికలుగ

సూత్రధారి త్రాసు సూచించె నిష్కామ

కర్మ దెలిపె తానె కర్తననియె!

67*

చేత వేణు కోల జేసి సారధియయ్యె!

నరు విషాదముడిపె నలరుగీత-

నాత్మ తత్వవిద్య నాణ్యమై సత్ఫల-

దాయకముగ ముక్తి దారీ దెలిపె!

68*

గీత మహిమ దెలిసి గీతమాతకు మ్రొక్కి

దోష రహిత దృష్టి తోచు ప్రశ్న-

లడిగి, తెలిసి పుడమి నడయాడ దగు సమా

ధానమిచ్చు హరివిధాన మిదియె!

69*

గొప్ప విజ్ఞుజేయు గోవింద నామమే

గోపనీయ గీత గ్రోలి, దేహి-

దేహబంధమెఱిగి చేయు సాధన చేత-

గాకయున్న ముక్తి గాంచు శరణు!

70*

నీతి నియమ నిష్ఠ నిస్వార్థ జీవనమ్

హింస రహిత భూత హితవు – సత్య-

నిర్వచనము సాగు నిత్యసత్యవ్రతము-

దోషరహిత దృష్టి దోవ జూపు!

71*

విద్య చేత నాత్మ విజ్ఞానముదయించు

మనసు చుట్టు తలపు మాయ వీడు

తేగగుణము గీత తేటతెల్లము గాగ

ధాత కలియుగాన తపసిమించు!

72*

గీతనభ్యసించి, భీతిమానియు దైవ

ప్రీతి గలుగ యోగ రీతు లెంచి-

సులభయోగమందు సూక్ష్మబుద్ధిని సాగ

దాని వెంట ముక్తి దారి దోచు!

73*

గీత చేతబూని క్రీడిగా తానెంచి

యధ్యయనము చేయ సాధ్యపడగ-

నరయ పదునెనిమిది అధ్యాయముల యోగ

సాధనముల చర్ఛ-సత్పలంబు!

74*

గీత జన్మ ధర్మ కీలకాంశము దెల్సి

యాత్మ తానటంచు యాది గలిగి

మనసు నిల్పి సేవమార్గంబు, శరణుగా

మాధవార్పణముగ-మనుటమేలు!

75*

భీతి లేక-ప్రీతి గీతోక్తి మననంబు-

జేయు చిత్త ప్రకృతి చేతనాంశ!

మాయ వీడి దైవ మార్గంబు దీపింప

దోచు హరియె నరుని తోడు నీడ!

76

దైవ దర్శనమగు దారి గీతార్థము

హృదయ దుర్భలత్వముడుగు విద్య!

విషయచర్ఛ విశ్వ విజ్ఞాన విశ్వాస-

భక్తి విశ్వరూపు పరగ గాంచు!

77*

దేహి దాల్చుమాయ దేహంబు నశ్వరమ్

జీవి జీవి నాత్మ ఠీవి మెరయు

శాశ్వతమగు నాత్మ సాగు జన్మలు పెక్కు

బొందు పుణ్యఫలము జెందు ముక్తి!

78*

మానవాళి సేవ మాధవ సేవగా

సాగు సామ్య వాద సౌష్ఠ రూపు!

గీత తత్వసార దీప్తి క్రియాయోగి-

ముదము బొందు పిదప ముక్తి బొందు!

79*

సత్య వ్రతుల ధర్మ సాధన క్రియసాగు

గీత భారతీయ కీర్తి రేఖ!

వివిధయోగ ఫలము వివిధకోణంబులన్

గీతబోధ ధర్మ శోధనంబు!

80*

జరిగె-జరుగు-మంచి జరగుచున్నది సృష్టి-

మంచికేడుగడగ – మనుజు తీర్చి-

దిద్ధు గీత చిత్త శుద్ధి నాత్మయు సాగు-

దారియు పరమాత్మ దారి బోధ!

81*

మాటలందు మంచి – మానసంబున మంచి

కర్మలందు మంచి గలుగు బుద్ధి

త్రికరణాల శుద్ధి – త్రిగుణ సాత్విక వృద్ధి-

గూర్చు దారి గీత గురుని వాక్కు!

82*

నాటి భారత రణ నావికుండు హరియె-

గీత రాజనీతి గీతమయ్యె!

ధర్మజుండు గెలిచె-ధరణి నిష్కామమై

కర్మ సాగె ఫలము కర్త గొనగ!

83*

గంగ,గోవు,గీత, గాయత్రి గోవింద-

జపముగను ‘గ’ కార శబ్ధమహిమ!

సకల శుభము లాభ సంప్రాప్తి సహితాత్మ

జన్మ రహిత ముక్తి జగతి యందు!

84*

గీత విద్యయోగ క్రియ వివేకము గల్గ-

బుద్ధి వెలయు భక్తి వృద్ధి గాగ!

శ్రద్ధ వెలయు సమత సాగు జీవనగతిన్

పుణ్యప్రీతి హెచ్చు పుడమి యందు!

85*

దివ్య గీత కీర్తి దీపింప కీర్తించు-

శ్రేష్ఠు భాధ్యత ఘన చేష్ట జూపు!

లోకమనుసరించు లోప రహిత దృష్టి-

యోచనంబు కర్మ యోగి బోధ!

86*

చిన్న పెద్ధలనక, గీతార్థమును గ్రోల-

చిత్త శుద్ధి వెంట విత్త గడన-

దాన ధర్మ కర్మ దారి నైవేద్యమై

పేద సాద జెందు పేరు కీర్తి!

87*

గీత సూక్తి చేత క్రీనీడ దారిద్ర్య-

రేఖ పైకి జను వివేకమొసగు!

దాన గుణము హృదయ ధైర్య సాహస లక్ష్మి!

ఇంటి తలుపు దట్టి తిష్ట వేయు!

88*

విశ్వసించి గీత విధివిలాసము నెంచ-

తెగువ ప్రశ్నలకును తగు జవాబు!

విశ్వరూపు గాంచ విశదము ప్రభు జాడ-

దోష రహిత దృష్టి తోడ జూడ!

89*

సులభ బ్రతుకు గోరు సుఖము తాత్కాలికమ్

చేదు శ్రమను ఫలము జెందు నరుల-

చెలగు రుగ్మతలకు, చేదౌషదము, శ్రమ-

స్వాస్థ్యమొసగు యోగ సత్ఫలంబు!

90*

నివురు గప్పి నిజము నిప్పును దలపించు-

కాల గతిని రగిలి కాంతు లీను!

నిక్కమైన మనసు నిలకడ పైయాత్మ-

తానె బ్రహ్మ మనెడు తలపు గొనును!

91*

మానవతయు మంచి మర్యాద మానక-

విధిగ నెంచుచోట వివిధ యోగ-

మార్గ సంయమనమే, మానవ ధర్మమై

చేవగూర్చు జీవ శ్రేష్ఠ తొసగు!

92*

మానవతయె – మమత–మాధవు భక్తిగా

మారు-సమత యోగ మార్గమగును!

రూపురేఖ విశ్వరూప విభాగమే

దోష రహితదృష్టి దోవ – ముక్తి!

93*

భక్తి యోగమందు భవసాగరము నీది

యాత్మ జన్మజన్మ యాత్ర సాగు!

భువి ముముక్షువగుచు పులకరిం చెడుజీవి-

తనివి దీర్చు ముదమె తాత్వికంబు!

94*

శ్రవణ భక్తి సాగు-చేతనాత్మయువెల్గు

యుక్తి బహుపురాణ సూక్తి వెలయు!

పావనాత్ముడైన భవబంధమునువీడి

దాస-దాసు జేయు దాస్య భక్తి!

95*

సఖ్య భక్తి నిత్య సౌఖ్య భావన మది-

దుర్భలత్వమణిగి-నిర్భయంబు

గూర్చు, వాసుదేవు కూర్మి పేర్మియు బొందు-

నాత్మ బ్రతుకు బాధ నధిగమించు!

96*

అచ్యుతు మది నెంచి యర్చన సాగును

పాద సేవ భక్తి పరవశంబు!

నందనందను గని నామస్మరణ భక్తి

మేలు గూర్చు నాత్మ మేలుకొలుపు

97*

నవమసంఖ్య నొప్పు నాత్మనివేదనమ్

వాసుదేవు పూజ వందనంబు

కీర్తనాది భక్తి గీతసంగీతముల్

వివిధ యోగ గతుల విస్తరించు!

98*

వస్త్రడంబరంబు వాస్తవ భక్తిని-

దెల్పు నెట్లు డాబు సల్పు పూజ-

వేష – బాష, భక్తి వెలయింప సాధ్యమా?

దర్ప రహిత శరణు దారి మేలు!

99*

భ్రాంతి వీడి రాజు, బంటైన సద్భక్తి-

ఇహము వీడి పరము నింపు గొనుటె-

గాన, విజ్ఞ మూఢ గతి నమ్మకము వెంట-

భక్తి దైవభావ పరిమళంబు!

100*

సత్యవ్రతుల నాత్మ సత్య శివము సుంద-

రంబు ప్రకృతి చేతనంబు నిండ-

మూడుమూర్తులను – ముముక్షువు తరియింప-

భక్తి సాగు ముక్తి బాటలందు!

101*ఆ.వె.

నేల నడిచి, నింగికెగసి, నీటమునిగి-

గాలి దేలి యగ్ని గాలి, జన్మ-

నెగ్గు భక్తి పుణ్యనిగ్గు దేలినయాత్మ-

లీనమగును దైవ లీలలందు!

102*

సూక్తులెల్ల బంధముక్తి మార్గము దెల్పు

నాచరింపజేయు నాత్మగతులు-

చేరు నీరు ముందె చెఱువు కట్టను వేయు-

జాగరూకతోక్తి జగతి గీత!

103*

శ్రద్ధ గలుగు పనుల-శ్రమ సత్ఫలంబగు

భక్తి చేత చిత్త భ్రాంతి దొలగు

మాయలంతరించు మార్గంబులో నాత్మ

తనువు వేరటన్న తలపు గలుగు!

104*

భారతీయ స్వతంత్ర సద్భావ బీజ

వాపనంబు జేసెను గీత వాక్కు వెంట-

నాత్మతానటన్న నానుడియే స్వేచ్ఛ-

భావదీప్తి గూర్చె-భక్తి బాట!

105*

భారతీయ వేదనిధుల బాట, మునుల-

దేహ – దేహి తత్వము దేశ దేశములకు-

పంచి, దీవించి పలుకు ప్రపంచ సమత-నోచె, “సర్వే జనాస్సుఖినోభవంతు”!

106*

గీత గురలైరి ఘనభారతీయ తత్వ-

బ్రహ్మవిద్య-బ్రాహ్మీ స్థితి-భక్తి బాట-

పరమ పురుషు లీలలు గీత – పవిత్ర యోగ-

విద్య బోధింప వెలుగొందు-విశ్వశాంతి!

107*

తెల్గు సత్యనారాయణ తిరుణహరిని-

భక్తి విశ్వాస సహితమౌ బ్రతుకు దోవ!

సాగి నీకెయంకితమిస్తి-శతక గీత!

సంకటము బాపి రక్షించు వేంకటేశ!

108*

శుభము శ్రోత పాఠకులకు సుఖము శాంతి

శుభము సద్భక్తి యోగులకభయ ప్రదము!

శుభము గీతాప్రచారంబు నుభయ సిద్ధి-

శుభము సర్వజనులకెల్ల శుభయశంబు!!

Contact
bottom of page