top of page
గీతాగానం-ప్రథమ భాగము
(తే.గీ.)

1*

శ్రీశ! శ్రీకృష్ణ! పరబ్రహ్మ! చిద్విలాస!

విశ్వశాంతి ధాత!విశ్వరూప!

భక్తవత్సల! గోపాల! భవ వినాశ!

తిరుణహరిదాస హృదయేశ! తిరుపతీశ!

2*

దివ్య ఓంకార పంజర కీర! చక్రి!

క్రీడి వరద! గీతాచార్య! కీర్తిదాత!

దివ్య అష్టాక్షరీ రూప! దీనపోష!

జీవ జీవన హేతు! రాజీవ నేత్ర!

3*

విశ్వ విఖ్యాత గురువర! విజయ మిత్ర!

దేవకీ నందన! ముకుంద! దేవదేవ!

కష్ణ! నరుడ! నారాయణ! కృతిని గొనుము!

దోష రహితముగాగ సంతోష మొసగు!

4*

గీత పాఠమై విద్యార్థి క్రీడి గాగ,

విశ్వ గురునిచే యోగముల్ విషదమయ్యె!

విశ్వరూప సందర్శన విస్మయంబు-

విశ్వసించి నరుడుబొందె విజయసిద్ధి!

5*

పదునెన్మిది పర్వాల భారతాన

భీష్మ పర్వాన నెలకొన్న గీత యుపని-

షత్తు సారాంశమై మ్రోగె, జన్మ ముక్తి,

సూత్రధారి నోటను తత్వ సుధలు గురిసె!

6*

(గీతామాత మహిమ)

గీత మాతను పూజించి, చిత్త శుద్ధి-

నిత్య పారాయణము జేయ నిచ్చు శుభము!

భక్తి శ్రద్ధను గలిగించు, బ్రహ్మ విద్య!

నాత్మ పరమాత్మ దరిజేర్చు నంద్రు బుధులు!

7*

వేద విజ్ఞానమే గోవు, వెంటదూడ-

నరుడు, దోగ్ధ శ్రీకృష్ణుడు, నమృత వాక్కు!

గీత క్షీరమును బోలె-క్రీడి గ్రోలె!

జగతి గీతావతరణమై జనుల జేరె!

8*

క్షుణ్ణ పఠనజేయగ గీత సూక్తి దెలియు

మౌనపఠనచే మంత్రమై మాయదొలగు!

విహిత విస్తార పఠనంబు విశ్వశాంతి!

సమత యోగసాధనముక్తి సాధ్యమగును

9*

లోక కళ్యాణకర్త! గోలోకనిలయు-

గీత సాహితి వరభక్తి గీతమయ్యె!

జీవిజీవిలో పరమాత్మ దీప్తి గాంచు-

దేహి-దేహబంధములెల్ల దెలిసె నరుడు!

10*

ఆత్మ పరమాత్మ తత్వమాధ్యాత్మికంబు

గీతమాతగా విలసిల్లె, క్రీడి ప్రశ్న-

గోప్య గీతార్థముదయించె, గొప్పమేలు!

భక్త గోలోక ప్రాప్తి సోపానమయ్యె!

11*

(అర్జున విషాదయోగం)

పదియు రెండేళ్ళ వనవాస బాట సాగె!

పాండవేయాస్త్ర శస్త్ర సంపాదనంబు,

ఏక వత్సరమజ్ఞాత మేగె పిదప

రాయభారంబు కుదరక రణము గలిగె!

12*

యుద్ధ ప్రారంభమున సంజయుండు జూచి

తెల్పె ధృతరాష్ట్రునకు తేటతెల్లముగను

దోషరహిత దృష్టినిసాగు దోవలందు-

విధులు మానవధర్మమై మరల మ్రోగె!

13*

తండ్రులును,తాతలును,గురుల్ దైవసములు-

బంధుజన పుత్ర పౌత్ర సంబంధ మిత్ర-

బృందమునుగూల్పగా పృథా నందనుండు

బంధు శోకమై వ్యామోహభరితుడయ్యె!

14*

శూరనరుడస్త్రములు వీడి కూలబడియె-

మరల నిలబెట్ట వచియించె మాధవుండు

దేశ కాల పాత్రంబుల దేల్చువిధులు-

ధర్మమగు గాని, యిదివీరధర్మమగునె?

15*

(అర్జున ఉవాచ)

వంశ నాశన దోషము స్వజన హనన-

దు:ఖమోర్వజాలను, హింస దురితమగును

జయము, నిశ్చయము గాదు, నయము భిక్ష-

మర్త్యలోకాన తగునంద్రు, మాధవుండ!

16*

(భగవాన్ ఉవాచ)

అస్త్ర శస్త్ర సన్యాసాని కదను గాదు-

భీరువందురు లోకులు దీనికన్న-

మరణమేమేలు, రణభూమి మరలిపోవ

శత్రుగేళి సైతువె? లెమ్ము సవ్యసాచి!

17*

అర్జునా లెమ్ము చేకొమ్ము కార్ముకమ్ము!

రణముదాకనేతెంచి, నైరాస్యమేల?

వీరుడ! హృదయదౌర్భల్యము వీడి వేగ

నీదు కర్తవ్య విధిసాగనింక మేలు!

18*

(సాంఖ్యయోగము)

పామరుని వలె దు:ఖింప పాడి గాదు

పండితుని వలె వర్తింప దండి తనము

అర్జునా! దు:ఖమిప్పుడు-అనవసరము

జరుగనున్నది మానక జరుగుచుండు!

19*

నేను,నీవు,వీరందరు-నేడురేపు-

నుందుము,భువిగతంబుననుండునట్లె,

దేహతతిదాల్చి విడనాడు దేహితత్వ-

విధులెరుంగుటే జ్ఞానము, విజ్ఞులకును!

20*

నిత్య సుఖ-దు:ఖములసాగు నిర్వికారి,

యింద్రియ విజేత, ధీరుడు-విషయ-

రహితుడై పరతత్వదర్శనుడుగాగ-

నాత్మ-తానను నరుడు, తానమరుడగును.

21*

సత్తు యవినాశిగాగ, నసత్తునాశి!

ఆత్మ యవినాశి – దేహము నశ్వరంబు-

పాత క్రొత్త వస్త్రంబుల పగిది-దేహి

తనువు దాల్చి జన్మలనెత్తి దరలి పోవు!

22*

ఆత్మ చావదు, చంపదు, ఆరిపోదు

జనన మరణాలు దప్పని జన్మ-ఆత్మ

నెలవుగానున్న నాతత్వ మెరుగ మేలు!

దానికైయాత్మ తత్వంబు దరచ మేలు!

23*

స్థిరముగా నుండు నాత్మయు – యిగిరిపోదు,

నీటనానదు, తెగదగ్ని నీరుగాదు,

జగతి ననుజేర తపియించు జన్మజన్మ

పుణ్యసంచితార్థము వెంట పొందు ముక్తి!

24*

తత్వమిది,దు:ఖమపకీర్తి,దాని కన్న-

చావు మేలగు, తప్పవు జనన, మరణ-

గతులు, వాస్తవంబని నిత్య కర్మనడుప-

లక్ష్యమున కీర్తి- కర్తవ్య దీక్షమేలు!

25*

క్షాత్ర ధర్మంబు యుద్ధమే క్షత్రియుండు

యుద్ధమే దారిగా స్వర్గమునకు జేరు-

పారిపోయిన దు:ఖంబు, పరులనింద,

వీరులెవ్వరు మెచ్చరు భీరువులను!

26*

వినుము కౌమార, యౌవన, వృద్ధ దశల-

కలుగు నట్లు, జీవాత్మకు గలుగు నితర-

దేహములు, మోహితులుగారు దీనినెంచి-

పండితులు నిర్వికారులై బ్రతుకు చుంద్రు!

27*

(సాంఖ్య కర్మ యోగములు)

సాంఖ్య కర్మ యోగములందు సాగు విధము

సత్ఫలంబు గూర్చును, ముక్తి సాగుదోవ-

నిష్ఠబూని పాటింపగా, నీకు మేలు!

28*

సాంఖ్య సంగతి, సమబుద్ధి, సహనవృద్ధి

నిశ్చయాత్మికబుద్ధి, నిజేచ్ఛ నిహపు-

లక్ష్యమై ముక్తిగనుదారి లబ్ధి గలుగు-

కర్త, కర్తృత్వమనక, నీ కర్మ సాగు!

29*

కర్మ యోగాన తనవిధి, ధర్మమాచ-

రించు, తత్కర్మఫలితంబు నెంచకుండ-

నిర్వికారియై సమబుద్ధి నిల్చుదారి-

కౌశలముగల్గి, సమదృష్టి సాగ వలయు!

30*

రాగభోగమూబిగ, మోహ రక్తిసాగ-

వీడనీయదు, వైరాగ్యవిహిత కర్మ-

గలుగ, ఫలతేగమొనరింప గలుగునేర్పు-

నోర్పుచే సమతాయోగ మందు నరుడు!

31*

మొదట నిష్కామ చిత్తుడై మోదమొంది

తనకుతానుగా మదమొంద దగిన మనుజు

డవనిలో స్థిత ప్రజ్ఞుడు, అతనిబుద్ధి-

సుస్థిరత్వంబుచే వెల్గు చుండునెపుడు!

32*

నిండుమనసులో కోర్కె లేకుండు వాడు

ఇతర బలవంతమును లేక హితవు దలచి

సంతతానంద సుస్థిర స్వాంత బుద్ధి-

మంతుడే స్థిత ప్రజ్ఞుండు మహిని జూడ!

33*

ఎట్టి ప్రతికూల దుస్థితి నెదురుకొన్న

పొందడిసుమంత వ్యతిరేక పులకరింత!

ఎట్టి యనుకూల సుస్థితిమెట్టి యూహ-

లేక సమబుద్ధి పాటించు లేమి నైన!

34*

రాగ భయక్రోధ రహిత కర్మాను సారి,

పంతగించి, శుభాశుభ పనుల సాగి,

శద్ధి త్రిగుణ త్రి కరణాల బుద్ధి నిలిపి-

పరమ పదము సాధింపగా పరితపించు!

35*

ద్వంద్వముల కతీతుడు నిశ్చితార్థ మతిగ

ఆత్మ-పరమాత్మ సిద్ధికై తదితరాల

సంయమన బుద్ధి నిహపర సాధకముగ

దైవ శరణాగతినిబొందు వైన మెఱుగు!

36*

ముడుచుకొను కూర్మమట్లు తామందు వెనక-

విషయ వాసన వీడియు హితవివేక-

బుద్ధి కర్తవ్య సామర్థ్యముగను క్రోధ-

మోహ రహిత జీవనతృప్తి బొందుచుండు!

37*

క్రోధమున వివేకంబును కోలు పోవు

మోహమున బుద్ధి చల్లారి మూఢుడగును

దానిచె శాంతి విశ్వాసదారి చెదరు!

జడిసి-జడిపించు, జాగ్రత జెందకుండు!

38*

సంయమనము లేకను సాగు జనుల బ్రతుకు

భోగమైశ్వర్యమును రోజు పొంద వెదకు-

పెచ్చుమీరు, సామాన్యుని స్వేచ్ఛ గోరు-

సంయమికి తావిరద్ధమై సాగిపోవు!

39*

సంయమి సాగు-సామాన్య జనుల వీడి-

పగలు నిద్రించు, రాత్రియు తగుగ విధుల,

తద్విరద్ధమై చరియించు తాత్వికముగ-

మోహరహిత పరబ్రహ్మ మోద మొందు!

40*

నదులు సంగమించు కొలది నాల్గు దిశల-

జలధి గాంభీర్య మగునట్లు సంయమిగొన

సాగు సంసార భోగాల సరకు గొనక

మోహరహిత పరబ్రహ్మ మోద మొందు!

41*

నేను నాదనకను సంయమీంద్రుడెపుడు

శాంతి లబ్ధికుపాయసు స్వాంతుడగును,

తేగబుద్ధి తృప్తి యుదాని చేత సుఖము,

సాగు, సుఖభోగమైశ్వర్య సమము గాగ!

42*

కర్త నేనన్న భావమున్ కడకు ద్రోసి

అన్యమెంచక పరమాత్మ నాత్మజూచి,

నిశ్చలేకాత్మ భావన నిపుణ గతుల-

సాగు నభ్యాస యోగమే సాంఖ్యమగును!

43*

అన్నియాశ్రయముల సాంఖ్యమనుసరింప

కష్టసాధ్యమే, యభ్యాస క్రమవిచార-

తత్పరత చేత – నేకాత్మ దలచి, తరచి

యందు పరమాత్మ గనుగొను చందమొప్పు!

44*

సాంఖ్య కర్మయోగములందు, సాధకులకు

నేక పరిణామమే భిన్నమేకఫలము,

ఆశ్రయము బట్టియు సముచితాశ్రయంబు

యోగ్యతను బట్టి యొక్కొక్క యోగ మలరు!

45*

(కర్మయోగము-అర్జున ఉవాచ)

హే ప్రభూ! జ్ఞానమే శ్రేష్ఠమేని-ఘోర

కర్మలో ననుద్రోయ ధర్మమగునె?

కర్మయా? బుద్ధియా? దేని గల్గి బ్రతుక-

దగినదో స్ఫష్టముగ దెల్పి దయను జూపు!

 

46*

(శ్రీ భగవాన్ ఉవాచ)

జ్ఞానయోగి శ్రేష్ఠుడు, యోగి జనుల కెల్ల-

యోగ్యమైనదగును కర్మ యోగనిష్ఠ!

వీని చేసమబుద్ధియు విస్తరించు-

ప్రకృతి కర్మాచరణయే, సత్ఫలమొసంగు!

47*

విషయ చింతన కర్మయే విజిత- యింద్రి

యుండు మదినెంచి నిష్కర్మయుండుటెల్ల

మిథ్య ప్రకృతి జీవుల సాగు నిత్య కర్మ!

కర్మమానని-నిష్కామ కర్మ మేలు!

48*

మదినియంత్రించి కర్మలో మనుటమేలు

తత్ఫలాసక్తి వీడగా దనరు సమత!

కర్మసహిత ప్రజావృద్ధి కారణముగ,

యజ్ఞ దానతపాదుల యత్నమలరు!

49*

యజ్ఞ రూపక కర్తవ్య యజ్ఞ కర్మ

దేవతల తృప్తి! వర్షించు మేఘవృద్ధి

దేవుడును జీవుడును గూడి శ్రేష్ఠ కర్మ-

పూనకున్న హానియుగల్గు పుడమి యందు!

50*

స్వీయ కర్తవ్య కర్మమే శ్రేష్ఠ పథము!

శ్రేష్ఠుననుసరింతురు జనుల్ క్షేమమొప్ప!

చేసి చూపిరి జనకాది శ్రేష్ఠ నరులు,

చేయవలె నీవు నేనును-చెరిసగమ్ము!

51*

కర్త తానని దలచునాసక్తి నరుడు

నన్ను దెలియని యజ్ఞాని యనగ జెల్లు!

మోహితుడుగాడు సుజ్ఞాని మోద ప్రకృతి

బాహిరంతరముల నేనె బరగు చుందు!

52*

మోహితుడు మది చాంచల్య మొందుకొలది

మంద మతియగు నజ్ఞాన మందు గూలు

మోరకుల జేరుచుండును-మోజువిడక!

శ్రద్ధ దూరుడై తగుచిత్త శుద్ధి గనడు!

53*

ప్రకృతి రాగవిద్వేషముల్ ప్రబలి వికృతి

బొంది-దూషిత దారిలో బుద్ధి శ్రద్ధ-

దూరులై సత్కర్మ విధులకు దూరమగుచు

శుద్ధి మాని-కామాదుల వృద్ధిగొంద్రు!

54*

ప్రకృతి కర్మ శుద్ధియులేని ప్రజలు- రాజు

పతనమగుదురంతర శత్రు బవరమందె!

దోష దృష్టి వీడక నాకు దూరమైన-

వారి ననుసరింపగ కీడు, వలదు నరుడ!

55*

భయముచేనిండు పరధర్మ బాటవీడి

నీస్వధర్మంబు కొనసాగు నిర్భయముగ-

ఆచరింప స్వధర్మమే యమిత మేలు!

దానిలో మరణంబైన ధన్య జన్మ!

56*

భీతి త్రిగుణముల్ నశియించు ప్రీతి గలుగు

బాట మూయును, పరధర్మ భయముగాన-

దోవగా స్వీయ ధర్మమే దోష రహిత-

దృష్టి నామార్గమున పుణ్య పుష్టి గూర్చు!

57*

కామము రజోగుణ దారి గమ్య సుఖము,

ప్రోత్సహించు వికర్మకు – దోషబుద్ధి-

పాపపుణ్యంబు దలపదు, బ్రతుకు దారి

నంధకారబంధురమగు నర్జునుండ!

58*

అహము ప్రకృతిలో జడ, చేత నాంశ లందు-

జడములో కామమునుదాగు జనుల యందు,

ప్రేమ జిజ్ఞాస పరమాత్మ ప్రేమసూచి!

చేతనాంశయే నిలయమై చెలగు చుండు!

59*

ప్రకృతి జడచేతనంబుల ప్రభుడ నేనె!

చేతనాంశయే నాచేత చేవ బొందు!

చేతనావస్థశక్తి నాచేత నిండు!

తత్వ ప్రేమ జిజ్ఞాస చేతనము నేనె!

60*

కర్మ యోగకర్తను నేనె! కర్మనేనె!

తొలుత రవిదెల్సె, రవిమన్వు తోడ బలికె!

నతడు నిక్ష్వాకునకుదెల్పె-నదియె నేను

నీకు దెల్పుచుంటిని భగవద్గీతయనగ!

61*

నాకు-నీకు జన్మలు పెక్కు నరిగె ధరణి

యుగయుగాల నీతోడనేనుద్భవింతు

ధర్మ సంస్థాపనయు జర్గు – ధరణి యోగ-

మాయచే ప్రకటితమౌదు, మానవునిగ!

62*

దివ్య జన్మ ధర్మమునిల్ప-దివ్యకర్మ!

లోక కళ్యాణ హేతువై లోకహితవు

సాధు రక్షణ – దుష్టశిక్షణయు బూని-

యవతరింతును, పుడమి నాయంత నేనె!

63*

కర్మయు నకర్మ నడుమ-వికర్మ యుండు

సోమరి కొనసాగును, వికర్మ సోలిపోవు

కర్మయోగి నిర్లిప్తుడై కదలు-పనుల

కర్మయు నకర్మ దాగును-కనుము పార్థ!

64*

ధరణి కర్మయు జ్ఞానాగ్ని దగ్ధమగును

కలుగు కర్మలు నిష్కామగతుల జనెడు

నట్టివాడు, పండితుడనియందురతడె-

బుద్ధిమంతుడు, విజ్ఞుడు, భూరియశుడు!

65*

జ్ఞానయజ్ఞంబు తత్వజిజ్ఞాస గూర్చు!

కర్మజన్య యజ్ఞముమించి కలుగునట్టి-

పావనాత్మక కర్మ సత్ఫలము శ్రద్ధ-

కర్మయోగంబుగామారు-కలుగు సిద్ధి!

66*

ద్వంద్వములకతీతుడు – మది దనరు సమత

కర్మ బంధియైపోక, తత్కర్మ జన్య-

సిద్ధి యాసక్తిలేక బుద్ధి నీర్ష్య-

భావరహిత జీవికె, భవబంధముక్తి!

67*

కర్మ యోగమే కలిగెడు కర్మనార్పు-

తగిన బద్ధివివేకము తత్వ సంశ-

యంబు దీర సుజ్ఞానియై నంత నుభయ-

లోక సుఖప్రాప్తినొందగా నోచు నతడె!

68*

సంశయ నివృత్తిచే జ్ఞాని సాగుకర్మ-

బంధమును దాటి పోవును-పార్థనీవు

సంశయంబును-జ్ఞాన ఖడ్గంబు నేసి

నీదు కర్తవ్యమును బూని నిర్వహించు!

*

(జ్ఞాన-కర్మ సన్యాస యోగము-అర్జున ఉవాచ)

69*

త్యాగపూర్వక కర్మంబు తగునటన్న-

కర్మ యోగమే తీరున కడకు జేర్చు?

కదలు-కదలించు శ్రేష్ఠత గలుగు దిశల-

సాంఖ్య, కర్మయోగములందు సాగుటెట్లు?

70*

విధిగ యజ్ఞాచరణలేక నిహపరంబు-

లెట్లు లాభించు? మోహంబునెట్లు సమయు?

బాహిరంతరింద్రియ గెల్పు, భక్తి-శ్రద్ధ

సంశయము మెండు-సుఖశాంతి సాగుటెట్లు?

71*

(అర్జున ఉవాచ)

హే, ప్రభో! కర్మ సాంఖ్యాల శ్రేష్ఠమేది?

వీని తులనాత్మకముజేయు విధమదేది?

కర్మయోగమా? సాంఖ్యమా? కదలు బ్రతుకు-

వింతగొలుపు, గమ్యము, దీని సుంత దెలుపు!

(భగవాన్ ఉవాచ)

72*

కర్మ సాంఖ్యముల్ సమముగా కదలు గాని

శ్రేష్ఠమగు కర్మ యోగమే తేల్చి చూడ!

సమముగా శ్రేయమును గూర్చు సాధనముల

ధరణి సాగు సమాంతర ధర్మ గతులె!

73*

సిద్ధి రహితమై, సహితమై – శీఘ్రగతిని

పొందు సమరూప ధర్మము యోగముక్తు-

డగును, సర్వజీవుల నాత్మ దరచి చూచి,

తానెయాత్మగా పరమాత్మ తత్వమెఱుగు!

74*

నీవు తనువైతె-నీయాత్మ నిన్ను దెలుపు-

నీవ, ఆత్మగాభావింప నీది-తనువు!

జీవులాత్మలే – తనువుల తీరు వేరు!

ఆత్మలో పరమాత్మ సర్వాత్మ రూపు!

75*

ఎవరు వారి స్వభావమ్ము వెంట కర్మ-

దరలి, మదిలోన కర్తుత్వ తలపుమాని,

ఎవరి పాప పుణ్యాలు-వారివిగ-జన్మ,

తరలు చుందురు మదిగొన్న తలపు వెంట!

76*

జ్ఞానముదయింప,నజ్ఞానమంతరించు-

తాను,కర్త్రుత్వ,భోక్త్రుత్వ,తలపు మాని-

యాత్మ సూర్యుగనగ, పాపమంతరించు!

బ్రహ్మముదమొందు, పరమాత్మ పదముబొందు!

77*

ద్విజుడు,గోవు,తామసి,వేపి,ధీప్రశాంత-

మతియు,చండస్వభావుడు,మరొకటనక

నొక్కతీరున దర్శించు, యోగియాత్మ-

బ్రహ్మ మోదంబుగా పర బ్రహ్మ జేరు!

78*

అన్న పానాదులును వేరు, అన్నిజీవు-

లందు సాగునాత్మలతత్వ చందమొకటె!

ప్రకృతి రాగవిద్వేషముల్, పరగు విధుల-

ఘటనలనుకూల-ప్రతికూల గతులు వేరు!

79*

మోహరహితంబు,సమబుద్ధి మోదమలర-

బ్రహ్మ సమరూపమౌస్థితిఁ బడయవీలు!

దోషరహిత సద్భక్తిని దోవసాగ-

నిశ్చలాత్మలో పరమాత్మ నెఱుగ వీలు!

80*

వస్తు సంపదనాసక్తి వదలి పెట్టి –

తనకు తానె సాత్వికబుద్ధి తలపుగొన్న-

ననుభవించు సామ్యావస్థలను సమంబు-

వెలయ, పరమాత్మ లీనమై వేడ్క బొందు!

81*

జగతి సంబంధ సంయోగ జనిత సుఖము

దలప నాద్యంత శోకాబ్ధి, దానివిడచి

యాత్మ బుద్ధివివేకమ్ము నలర భక్తి

ప్రభువుగా నన్ను నమ్మిన – పరమ పదము!

82*

ఇంద్రియములణచియు, మది నిల్పి నిరత-

సంశయమ్ము లేకను, పుణ్య సంపదెసగ,

సాగి పోవు వివేకుల సాధనలకె-

నిరత నిర్వాణ బ్రహ్మంబు నిశ్చయంబు!

83*

ధ్యాన యోగాదులను సాగి, తత్వ మెఱిగి-

సచ్చిదానందయుక్తమౌ, సాధకుండు,

బ్రహ్మ నిర్వాణమును బొందు, భక్తి యోగి

నన్ను నమ్మియు నాలోనె నలరు చుండు!

84*

ప్రాణి మిత్రుడ నని దెల్సి భక్తి గలిగి-

జీవ కారుణ్యముదయింప, దీక్ష గలిగి-

సూక్ష్మమందె-మోక్షముగను, స్ఫూర్తిబొంది

నాదు శరణాగతిని బొంది నన్నుజేరు!

85*

సకల లోకేశ్వరుని గను సన్నుతించి,

యజ్ఞములకెల్ల భోక్తగా-నన్నుదెలిసి,

జపతపంబుల ననుదల్చి, సమ్మతించి

భక్తి యోగముచే బొందు బ్రహ్మ పదము!

86*

కర్మ యోగసారము దెల్సి, కర్మ ఫలము

వంటి యుత్పత్తి నాశక వస్తు నాశ్ర-

యింపకను నిత్య కర్తవ్య విధుల సాగు-

నరుడె, సన్యాసియనదగు-నతడె యోగి!

 

87*

(ఆత్మసంయమనయోగము)

తనకు తానె మిత్రుడుగాగ తగు నయంబు!

తనకు తానె శత్రువుగాగ తగజయంబు

ద్వంద్వములయందు సమజాగృతంబు దలచు-

నిర్వికారియే సమదృష్టి నిలువ గలడు!

88*

కర్మ యోగాన, నిష్కామ కర్మచేత-

పుణ్యఫలమొందు, సాంఖ్యము స్ఫూర్తి నిచ్చు,

జననమరణావృతము జన్మజన్మ సుకృతి,

జన్మ రహిత ముక్తిని గూర్చు, జగతి యందు!

89*

ధ్యానయోగాన,సమబుద్ధి దనరు నాత్మ-

గాలి వీచని గది దీప కళిక వలెను,

నిశ్చలంబగు, చిత్తంబు త్రిగుణదోష-

యుక్త, పాపరహిత యోగి యుత్తముండు!

90*

పుణ్య యోగియే, మది బ్రహ్మ పూర్వ పరము-

నెఱుగు, సకల ప్రాణుల శక్తి నెఱుగు, తనదు-

నాత్మగాంచు సర్వాత్ము తత్వంబు – నదియె!

ఇతరములగాంచు మదిలో సమతయు వెలయ!

91*

మనసు నిల్పి వైరాగ్యనేమములనుండు

సాధకుడు పట్టు విడవక సద్గతొందు!

నడుమ విడిచిన – శుభమగు నతనియాత్మ

పుడమి పుణ్యాత్ము లింటిలో పుట్టు చుండు!

92*

ఉభయ సాధనలిహపర యుద్య మాలు

సమత యోగంబు ప్రాప్తించు సాగుబాటు

నన్ను భజియించి నాలోనె యున్నయోగి-

సకల జీవుల సమదృష్టి సంతసించు!

93*

మనసు చాంచల్య ముడుగంగ మనుగడెల్ల-

ఇంద్రియాల కట్టడి నిష్ఠ నిహము పరము

దారి సుఖమొంది – జపతప ధ్యాన మగ్ను-

డైన యోగి, పుణ్యాత్ముడై డాయు నన్ను!

94*

కొంత సంసార సుఖముచే యోగబ్రష్టు-

డైన సాధకుడును, పుణ్య ధనఫలంబు లొంది,

కర్మాచరణ సాగు లోకములను,

పతనమొందక-మరుజన్మ భక్తుడగును!

95*

అంత్య కాలాన సాధకుడైన యోగి

భ్రష్టుడైనను బుట్టు సద్భక్తులింట!

విజ్ఞవంశోధ్భవుడుగాగ వెలయు కీర్తి,

పూర్వ పుణ్యంబు జతపడ బొందు కీర్తి!

96*

(జ్ఞాన – విజ్ఞాన యోగము)

తపసి కన్నను-యోగియే తగినవాడు

కర్మనిష్ఠులు, జ్ఞానులు కలుగు చోట-

యోగి శ్రేష్ఠుడు, నీవును యోగి వగుము

నమ్మి నన్ను జేరుము పరబ్రహ్మ నేనె!

97*

సర్వ శ్రేష్ఠుడు యోగియే సంశయింప-

వలదు, విజ్ఞానియై, జ్ఞాన వస్తు రూపు,

సమగ్రమునజూడ దెల్పెద-సవ్యసాచి!

ప్రకృతి జఢచేతనాంశల పగిది వినుము!

98*

నేల,నీరు,నిప్పును,గాలి,నింగి, మనసు-

బుద్ధి, గర్వము, లెనిమిది, పుడమి ప్రకృతి-

చేతనంబులు, జడములనెన్న వీని

భిన్నములుగాగ గనిపించు విశ్వమందు!

99*

జగతి సర్వము నాసృష్టి జనన మరణ-

భిన్నజీవహేతువు నేనె! భిన్న మణుల-

హారమునదారముగనన్ను నరసి పూర్తి

రూపు దర్శింప తత్వ-నిరూపణంబు!

100*

జల,రసము ,రవి,తేజము,చదువు,వేద-

మందునోంకారమున్,పృథ్వి గంధమేను!

నాల్గు పురుషార్థములు నగ్ని నలరుదీప్తి-

జగతి చేతనాశక్తి తేజంబు నేనె!

101*

తాపసుల తపోశక్తిని తరచి చూడ,

తెలివి, కలిమి, బలిమిగూర్చు తేజమగుదు,

ధర్మకామము నేనె! ధరణియందు-

సకల ప్రాణుల బీజమై సాగుచుందు!

102*

తెలిసి మాయలోజిక్కి, తెరలుమూయ

జనన, మరణ, భీతిని నన్ను జనులు మరచి,

త్రిగుణ మోహిత తత్వంబు తెలియ లేరు,

అవియు నాయందు గనరావు అర్జునుండ!

103*

ధర్మ పరుల కర్మలు సాగు దారి నేనె!

త్రిగుణ భావజాలగతుల తిరుగు చుందు,

శరణు జొచ్చియు సద్భక్తి సాగు దారి-

జనులు నన్నాశ్రయింతురు, సన్నుతింత్రు!

104*

వివిధ కోర్కెలు మదినిల వేల్పునిష్ఠ-

గొల్చు భక్తులు, తగుశ్రద్ధ గోలుపోవ,

చిత్తమునదాగి, దృఢచిత్త వృత్తిగూర్చి-

దయను బ్రోచెద-తద్వేల్పు దారియందె!

105*

అసురిలోబడి,నను మర్చి యసమభావ-

మాయ గుమ్మరుమూఢుల మార్గమందు,

భక్తి గల్గియు, మాయలోబడినవేళ-

మాయ గతులు దాటింతు, నమాయకులను!

106*

వాసుదేవ సర్వమనెడు వాస్తవంబు

తెలిసి శరణనన్న నిహ-మాయతెరలు దొలగ,

భక్తి నాధ్యాత్మికము నాత్మ భావగరిమ-

చేత, కడకునా సన్నిధి జేరుకొంద్రు!

107*(ప్రథమ భాగ అంకిత గీతి)

సత్యనారాయణాయని జనులు బిలువ

భక్తి విశ్వాస పూర్ణమై బ్రతుకు సాగ

శతక గీతుల కృతిజేసి, సామి నీకె!

అంకితము,సంకటము బాపు వేంకటేశ!

108*

శుభము-నీగీత గానము శుభయశమ్ము!

శుభము – నీగీత మననము సుకృత ఫలము!

శుభము – నీగీత మధురము సుఖము శాంతి!

శుభము నీభక్తి శతకము ముక్తి పదము!

Contact
bottom of page