కృష్ణా శతకము
(కo.)
1*
శ్రీద! రమామణియెదలో
వేదము పఠియించు చుండ, విశ్వవ్యాప్తా!
నీదయ సుస్థితి జాడల
పాదపమై ప్రాణశక్తి వరమగు కృష్ణా!
2*
పంచామృతకరులు, ఇలలో
మంచే జరిపింప నొక్క మాలగ వెలసెన్
మించె ప్రపంచము, కల్మశ
పంచీకరణంబు సాగె, పావన కృష్ణా!
3*
ఘోరపుకలియుగమాయెను
భారపు తనువూగులాడె, బాధ్యత తరిగెన్
బీరపుమాటలగారడె!
సారపుగీతార్థనిధుల సాకుము కృష్ణా!
4*
ఎవరో వస్తారందురు
వివరణగా పంచభూత విభజన లిడగన్
అవనీతలకణ శోధన
భవసాగరమీదనెట్లు బాల్పడు కృష్ణా!
5*
తిండియు గూర్చెన్ ప్రకృతి వే
దండము నెక్కెను మనస్సు, ధర్మముదప్పెన్
కొండను గొడుగుగ నిల్పుము,
బండను మనిషంటు బిల్వ భావ్యమ! కృష్ణా!
6*
ఎన్నో సుద్ధులు వినగను
అన్నీ వింగడపు విజ్ఞతాధారముగాఁ
పన్నీరులుగనిపెట్టగ,
మున్నీటను ముంచుచుండె, మోహన కృష్ణా!
7*
ఆకలికన్నము, వేదన
సోకిననౌషధము తనువుశోభను గూర్చన్
సాకున సారెకు వైద్యమె
మాకిలనారోగ్య భాగ్య మందున కృష్ణా!
8*
మనసే నీదరిరాదట-
తనువే తగుపూజలందు తచ్చాడుగతిన్
నేనూనాదను ఆత్మను
లేనూలేననగజేయు లెక్కలు కృష్ణా!
10*
సంసారము దుస్తారము-
హింసాపారము,వికాస హితవుల్ దరిగెన్
హంసా పాలను వీడియు
కంసున్ దరినీరు దాగె, కావుము కృష్ణా!
11*
అయ్యప్పవొ,సింహాద్రి న
ప్పయ్యవొ, విశ్వావతార ప్రాచీనుడవో!
కయ్యపు వియ్యపు గాథల
నెయ్యపు సద్భక్తినెంచు నిగ్గిడు కృష్ణా!
12*
మంచియె నీవిల దైవమ
టంచును గొనియాడ, కుటిల టక్కులుడెక్కుల్
మంచికి చెడ్డనుబూయగ
మించెన్, వైరసువిశేష మిచ్చెను కృష్ణా!
13*
కణకణమున చెడుగు గుణము
అణువణువున నాత్మమరుగు, నాశాపాశం,
గణగణ నీగుడి గంటల
ప్రణయం, నేనన్న నాత్మ పద్యమె కృష్ణా!
14*
నాదిశరీరము, నాస్తియు
నాదియె సర్వంబటంచు, నరజాతిగతుల్
వాదన నేనను భావమె-
ఏదది? జీవాత్మగాక, విషయము కృష్ణా!
15*
నేనంటేమిటొ తెలిసియు
నిన్నంటియె గడుప బూని ఎఱుకన్ గొంటిన్
సన్నిధి ననుజేర్చి మరల
కన్నులతడిదుడువబూను, కన్నయ కృష్ణా!
16*
అన్నది విన్నది కన్నది
మన్నన పాఠంబు జేసి మంచిని దెలుపన్
మిన్నగు గరువైతి శిశులు
మన్నించిరి పెద్దలైరి, మరువను కృష్ణా!
17*
బాషాబోధకవృత్తి త
మాషా కాలంబు సాగె మాయిక కల్మిన్
వేషార్భాటమె, తేగవి-
శేషాలకుతావులేదు, సేమమ కృష్ణా!
18*
లాగలు వచ్చిన వేళల
వేగమె చన్నీట దుడువ వేదన తగ్గున్
సాగక నూష్ణమునుంచిన-
తీగలు సాగేను రోగ, తీవ్రత కృష్ణా!
19*
పాటించగ సంయమనము
దాటించిగ శాంతి నౌక, ధరలో స్నేహం-
మీటించె సనాతనమత
ఘాటెంచి వినెదరెవరిల, గడుసల్, కృష్ణా!
20*
చెప్పితి పద్యము నెమ్మది
నొప్పితి నొప్పించి యెదరి, నొక్కడికైనన్
నొప్పుగ నీప్రేమ దెలుప
చొప్పడ దాయేను తత్త్వ చోద్యము కృష్ణా!
21*
ఇతరుల ధనమాశించక
వితరణముల సాగి తేము, విస్తృత ఫణితిన్
గతమును గాసిలెఁ, నాగరి
కతలో జరసాగె మమ్ము గావుము, కృష్ణా!
22*
మంచిగ బెరిగితి మదిలో
మంచినె బెంచితిని నీదు మార్గముగంటిన్
పంచితి నీతీ, శ్రద్ధ వ
హించితి సప్తతిని గొంటి, హితవర కృష్ణా!
23*
అడుసును దొక్కక కాలును
కడుగక శుచిశుభ్ర మెట్ట గామున బతుకున్
గుడిమెట్టను జేసి, శతక
ముడినీతిని భక్తి గూర్చి మురిసితి కృష్ణా!
24*
విడివడి బంధుగు మిత్రులు
నడవడి పోటీలు బెట్టి నాణ్యత గనకన్
గడనల దూరియు దెప్పుచు,
చిడిముడి వైదొల్గిరంత చిత్రమె! కృష్ణా!
25*
వాగున వచ్చును వరదయు
ఆగున సర్వంబుబోవు, నాణ్యపుటతుకున్
రాగియె కోరు, విరాగుల-
తేగమె జీవాత్మ శాంతి తిరముగ కృష్ణా!
26*
పెద్దగ దిని బతికి జగతి
గద్ధగ వెసనాల వృద్ధి గడనకు దూరన్
పెద్దగ రుగ్మత గలుగున్
యుద్ధపు బతుకెట్లు, భక్తియుతమగు, కృష్ణా!
27*
బతికితె బలుసాకులు దిని
బతుకగ వచ్చునటంచు భావన,సబబే
మితముగ నారోగ్యదములు-
లతికెడు తిండియె, విశేష లబ్ధిడు కృష్ణా!
28*
ఫలితము దేనికినది స
ఫలతే తనమంచి తనము, సకలమునీగో
కులమై గావగ పశుపతి-
కలహముజాడేది? శాంతి కాంక్షయె కృష్ణా!
29*
శక్తులు చెడుగున జచ్చెను
యుక్తిలు, సద్భక్తి భావ యుతముగ జగతిన్
ముక్తిగ సాగి తరించిరి,
శక్తిలొ నీప్రేమపాలు సత్యము, కృష్ణా!
30*
రానిది రాదిల తిరిగియు
పోనిది, ఇసుమంతలేదు, పొందును మించన్
లేనిది పోరని తెలిసెను,
హీనపు యుద్ధాలనాపు, హితవర కృష్ణా!
31*
పెన్నిధి నీవై నిలువగ
సన్నిధి నేనుండి బాల్య చపలములుడుగన్
ఏన్నిన తత్త్వపు సూక్తుల-
మన్నిక పద్యంబు జెపితి, మాథవ! కృష్ణా!
32*
కాలపు సేపము, నాటక-
మేలపు దీపము వెలుగుల మేటిపురాణా
జాలపు నీతుల కృతి శతి-
లీలగ ముదిలో నితరము లేలనొ? కృష్ణా!
33*
గరువగు జగతికి గురువు స
ద్గురువగు తంత్రజ్ఞ భక్తి దురితములణచున్
కరువగు నాయువు బెంచుచు-
నిరతము కట్టడలు సేయు నిపుణత- కృష్ణా!
34*
తెలిసియు చెడుచేష్టితములు
మలిసియు తగురీతి మార్గమన్వేసింపన్
వెలసిన నాధ్యాత్మికమున-
కలిసియు జీవింపమేలు గలుగద? కృష్ణా!
35*
తొక్కిన మొక్కిన పూజలు
తక్కిన నాస్తిక విశేష తరతమ వాదుల్
నిక్కిన ఫలమేమి భరత
మక్కువ గలకీర్తి సిరులు మాకిడు కృష్ణా!
36*
ఉక్కిరి బిక్కిరి చేసెడు-
మృక్కడి విజ్ఞానతేజమిది జేయకుమా-
చక్కగనాధ్యాత్మిక ఘన
చక్కినిముడివేయుసూత్ర చయమిడు కృష్ణా!
37*
మనుజు స్వేచ్ఛన భక్తియు
మనుగడ సాగించు, తేగ మార్గాంతర మై
గనబడు గమ్యములొక్కటె!
అనుచుండగ నైకమత్య మమరెను, కృష్ణా!
38*
ఎడతెరిపియులేని వాదు
విడమర్పులులేని బోధ విస్తృత ఫణుతుల్
మడిసికి సుఖశాంతి రహిత
గడనలు తగిలించెను, కలికాలమె! కృష్ణా!
39*
వలదిక కులమతబేధము
చలమతి గుణదోషజాల సకలము వలదున్
స్థలమున శాంతియు లేకను
నిలబడునే మానవాళి నెగ్గునె? కృష్ణా!
40*
అలనాటి భరతయుద్ధము
వెలయించిన నీతి మరచి వేదికలెక్కీ
కలహింత్రు పోటిపేరట-
గెలుపులు శాశ్వతమ జీవ కేళిని కృష్ణా!
41*
రాజును నేనే బంటును
బూజును నేభుక్త రాశి పూర్వపురుచులన్
త్యాజము జేసితి, పథ్యపు
తేజిగ నౌషధి గుణంబు దిద్దుము-కృష్ణా!
42*
ఎన్నో వైద్యము లరిగెను
అన్నిటనీ నామజపమె ఔషధి యనగన్
మున్నిటముంచకు నృహరీ!
సన్నిధి యాదాద్రి వైద్య సాక్షివి కృష్ణా!
43*
వరయోగా నరసింహుడ!
మరవకు నను బాగుజేసి, నడుపు విధులన్
వెరవుగ దేహపు చింతను
కరముగ నడగించియాత్మ గావుము కృష్ణా!
44*
జ్వాల నరసింహ! దినదిన
జాలముగానీక పూర్వ జవసత్వములన్
కూలముజేర్చియు తగునను
కూలముగా స్వస్థతొసగు, గోపీ కృష్ణా!
45*
వరలక్ష్మీ నరసింహుడ!
కరమునగొని నడుపకున్న కలుగున? చైత్యం
నిరతపు నావిశ్వాసము
కొరతయు వడకుండ కోరు కొనియెద! కృష్ణా!
46*
సంచారముజేయు కవిగ
పంచామృత పానమందె వర శ్రీనాథున్
వాంఛా కనకస్నానము-
ఏంచక్కాబొంది దివికి నేగడె కృష్ణా!
47*
పంచెన్ కావ్యపు రసములు
మించెన్ సభలందు పోటి మీటెను భక్తిన్
బాంచెన్ బతుకును బతికెన-
కాంచెన్ నీపేర ముక్తి కాశము కృష్ణా!
48*
పోతన భాగవతోత్తమ
గీతను దాటకను రాజు గేళినిసైచెన్
ప్రీతిగ రామార్పణ విధి పూతగ కృతకృత్యుడయ్యె పుణ్యుడె! కృష్ణా!
49′
కవులు ప్రభువు జనిరి
అవనీ ప్రభులై ప్రజాళి, యంతయు సమమై
రవిగాంచిరి కవిగాంచిరి-
చవిజూచిరి సొంత జగతి చేతన-కృష్ణా!
50*
సామ్యము జెరచని పాలన
రమ్యముగా సాగె దినము రక్షిత రాజ్యం-
గమ్యము జేర్చగ తారయు
తమ్యములడవడగ నీకు! తాత్విక కృష్ణా!
51*
తండ్రియు దొరలిత్తురనియు
మొండిగనాశించి శూన్యమోదమునందెన్
కొండగ నిల్చిన నినుగని
యండగ నమ్మితిని యెడద యదువర కృష్ణా!
52*
అడుగుచునారా దీయుచు
గడనలధిగమించు మిషతొగాలును దువుచున్
విడవరు సిరివితరణ దిశ
నడతురు నరకాన్నిజేర నాపలు కృష్ణా!
53*
మొదటనె తనపెట్టెకు సరి
పిదపను తనవారి పొట్ట ప్రీతికి మిగులన్
ముదమున పెట్టుబడులకే
కదనముసాగించు లుబ్ధు గావుము కృష్ణా!
54*
అతికిన గతకని తిండియు
చతికిన పథ్యంపుకూడు చచ్చెడుదాకన్
మతిచెడు ఔషధ సేవలె!
చితిగని మధుమేహరోగి చితికెను కృష్ణా!
55*
పేదది పథ్యపుకూడై
ఉదయాన్నె వ్యసన పరుగు ఊరును ముంచన్
సాదక పిల్లలనాథల
బీదలజేయంగ సాగె బెదరక కృష్ణా!
56*
త్రాగుడు,తనువును గాల్చెను
వాగుడు తనవారి జీల్చె వరుసగ సంతున్
రోగము పాలై పోయెను-
వేగమె దరిజేర్చిగావ వేడెద కృష్ణా!
57*
వాదముజేయక తగునభి
వాదము జేయంగ మేలు వసుధను శాంతిన్
పోదనజేయ ఫలించు, వి
వాదముదప్పించు కీర్తి వరలును కృష్ణా!
58*
సులభము జేయుము జీవిత
కలశములోనాత్మ నిన్నుగలిసెడు దాకన్
కలకలముడుపుము-భువి భవ
జలనిధి దాటించరమ్ము! జయసిరి కృష్ణా!
59*
కరివరద!కుచేల సఖుడ!
పరలోకమునేలు బమ్మ! పావన గుణుడా!
జరభారమందు మదినీ
చరణాలను వీడనియకు సజ్జన కృష్ణా!
60*
పరులెవ్వరు నాత్మయొకటి
గురుబోధలయందు జీవి గుట్టును నీవే!
పరతలములెక్కడున్నవి-
ధరయంతయు నీదె మహిమ దనరును కృష్ణా!
61*
దైవము నీవై భక్తుల
భావన సత్కీర్తి దిశల భద్రము జేయన్
రావము నెత్తిన హరినీ
సేవలు మానవలకెపుడు సేమము కృష్ణా!
62*
మాయామానుష వేశము
డాయన్ సామాన్య బాష డంబర చక్రం
సాయముగోరియు బిలిచిన
ఓయని పల్కేటి దొరవు మోహన కృష్ణా!
63*
ఆడియు పాడియు సాటిని
గూడియు రేపల్లె గోప రేడుల వెంటన్
చీడకు పీడకు వైద్యము-
వీడక రక్షణ గానపు వేణువు-కృష్ణా!
64*
గోధన మొసగియు నిరతము
సాధన సంపత్తి గూర్చి జవసత్వములన్
శోధగ జనులకు బంచిన
మాధవ మానవ యశ వనమాలివి కృష్ణా!
65*
కంసాదుల దురిత ఛర్యలు
హింసావాదాలు రయపు హీనుల గాథల్
కంసారిగ నాపి పరమ-
హంసాసత్సంగ దారి సాగిన కృష్ణా!
66*
రాజుల నీతిని దిద్ధగ
రోజులు మార్చేసి జనుల రోదనబాపన్
కూజిత కుటిలుర రిపుబల
రాజిని సమయింప జగతి రాజిలె కృష్ణా!
67*
సమసె నధర్మము పుడమిని
తమములు విడనాడె యుద్ధ తదనంతరమున్
సమతా యోగము సాగెను-
సమవర్తన ధర్మ విజయ సాధక! కృష్ణా!
68*
ఆర్జనలాపేక్షలకిల
అర్జునవిజయమె తగిన లబ్ధి గూర్జెన్
తర్జన భర్జన లాగెను-
కార్జము సన్ముక్తిబాట గలిగెను- కృష్ణా!
69*
సత్యమహింసల తత్వము
నిత్యము జేయించె నిగమోక్తులు సా
హిత్యముగాపొంగెత్తగ
ముత్యపు సూక్తావళిధర మ్రోగెను కృష్ణా!
70*
శుభమే నీదగుగీతా
శుభమే నీరాసకేళి సూక్ష్మత మోక్షం-
శుభమే తుదగోలోకము
శుభమే ధరసృష్టికెల్ల శుభమిడె! కృష్ణా!
71*
కృష్ణా! గోపకిశోరా!
కృష్ణా! నవనీత చోర! కృపగను శౌరీ!
కృష్ణా! ధర్మోద్ధారా!
కృష్ణా!సద్భక్త ధీర! కృతిగొను కృష్ణా!
72*
భక్తివి నీవే భువిజన
శక్తివి నీవే రిపుజన సాహస దుడుకుల్
రిక్తయె, పాత్రోచిత నట
నుక్తులె, నీప్రేమశక్తి, నూత్నము కృష్ణా!
73*
దానము నీవే పుణ్య వి
ధానము నరజాతి కొఱకె ధర సమ్మతమై
దానమె ధర్మంబయ్యెను
దీనులనెడబాయ నట్టి దీక్షయె కృష్ణా!
74*
తపమే కలియుగ దానము
నుపయోగమె వస్తు కీర్తి నుపకృతి ప్రతిగా
నుపకృతి సల్పుట విధియె-
చపలత్వము నుడిపి బ్రోవు సజ్జన కృష్ణా!
75*
తపసియె దాతగ బుట్టును
జపముగ దానంబుజేసి జగతిని సుకృతం
విపరీతముగా పొందును
అపహసిత కలిజయించి అలరును కృష్ణా!
76*
స్వార్థత్యాగవి హీనులు
ఆర్థికసామాజిక స్థితార్థులె భువిపు
ణ్యార్థులు గానేర రెపుడు
పార్థులుగాజేసి బ్రోవు ప్రార్థన కృష్ణా!
77*
చాలును జీవితఘనివా
చాలుని జేసతి-శతకపు సప్తతి భక్తిన్
మేలుగనేలితి సామీ!
వీలుగ విశ్రాంతి నొసగ వేడెద కృష్ణా!
78*
మలెబడె పాపపు గుట్టలు
కలెబడె నిస్తేగమూక కలికల్మశముల్
వెలువడె పోటీనాయక
వలరాజుల-గీతదాట వద్ధను కృష్ణా!
79*
ధర్మమె చక్రాయుధమై
కర్మయోగమెనీ విశేష కాంక్షగ సాగెన్
మర్మము దెలిని మాకిల
ధర్మమె నీపూజయయ్యె దండము కృష్ణా!
80*
చేతిని వీడక నడుపుము
గోతులుదాటించి నన్ను గోలోకమునన్
పూతుని జేయుము, జన్మల
ఘాతము భరియింప లేను ఘనయశ! కృష్ణా!
81*
రామా రాఘవ! భార్గవ
రామా! బలరామ మల్ల రంగవిరాజా-
రామా! తారకనామా!
రామా! రంగా! హరిహర! రసధుని కృష్ణా!
82*
శివకేశవ! శ్రీహరి! మా
ధవ! మోహిని వరద! విధాత! విశ్వాకారా!
అవనిని భాగవతార్థము-
స్తవనీయము నాత్మ దృష్టి సాగగ కృష్ణా!
83*
ఏకేశ్వర! లోకేశ్వర!
సాకేత రామేశ్వర! మతసాహితి గంగా!
మాకిడు దైవీగుణముల-
నీకిదె నుతిశతనివాళి నిచ్చెద కృష్ణా!
84*
చెడుగున్ ద్రోసియు బుడుగున
నడుగున్ బెట్టంగ మాని నాణ్యత బతుకున్
పిడుకగ గాల్చెద భక్తిని-
చిరిదిండిని సాగి నిన్ను చేరెద కృష్ణా!
85*
ఖాళిగమానవుడుండిన
కాలము కలి మాయజాల- కల్మశ భరమే
ఇలనాధ్యాత్మిక, సైన్సులు
నిలపు నిరంతర విచార నిధులై కృష్ణా!
86*
జ్ఞానము విజ్ఞాన ధనము
దీనులరక్షించు కొఱకె దీక్షగ సాగెన్
మానవ హననము నేడిట
గానముగాసాగె మమ్ము గావుము కృష్ణా!
87*
కృష్ణా! నరవరద!మదిని
తృష్ణన్ గలిగించి దు:ఖ ధారలదేల్చీ-
జిష్ణన్ వ్యామోహితపు స
హిష్ణన్ బతికించు నిచ్ఛ హితవా? కృష్ణా!
88*
ఒద్దిక నేర్పియు ఎంతో
ముద్దుగ గుడినాదరించె మోదపు కళలే
వృద్ధిగ యాదిని బెంచెను
ముద్దెర జరపీడగల్గె ముదమిడు కృష్ణా!
89′
ఉంచుము నను ప్రశాంతిగ
పంచుము నిశ్చల పుతత్వ పావన బోధల్
ఎంచిన పరిమితి పరుగె-
త్తించుము!నిరతము, నుతింతు నీతిగ కృష్ణా!
90*
మంగళహాలతి గొనుమా!
వింగడముల సామినీవు విశ్వాధ్యక్షా!
ఎంగిలి బతుకాయె దునియ!
మంగళమును గూర్చు వైరి మర్ధన కృష్ణా!
91*
భూమండల రిపుఖండన-
సేమందయసేయు మయ్య! చిత్తపు వృత్తిన్
క్షామందలపక నీపద
శ్రీమండల ధూళిదాల్తు చిన్మయ కృష్ణా!
92**
కల్మశ భోక్తల చేతను
గల్మలు దాటొచ్చె’ కరొన’గాసియుగలిగెన్
గుల్మము నాటియు పెంచగ
చిల్ములుదొలగేనటండ్రు – సిరివర! కృష్ణా!
93**
త్యాగమె గొప్పది మతముల
రాగములో తేగమొప్పు రచనలె శ్రేష్ఠం-
భోగము రోగమె! దుడుకుల-
త్యాగమె భువి సుఖము-శాంతి, ధార్మిక కృష్ణా!
94*
కన్నది సీతమ వెంకన-
సన్నిధి గుడిబెంచితీవె! చాపల్యదశన్
పెన్నిధివై విద్య-పదవి
మిన్నగ నడిపించి నట్టి మేలిమి కృష్ణా!
95*
తిరుణాహరి వాయ్లాలని
కరుణించె, కవిలోకమెల్ల కాదనకుండన్
తిరమును పొందితి వృత్తిని
విరమణ దాకను నుతించి- వేడితి కృష్ణా!
96*
మ్రొక్కెద పెద్దల – చిన్నల
చొక్కపు బంగారబుద్ధి చోద్యముగొల్పన్
మిక్కిలి మక్కువ జూపెద-
గ్రక్కున సద్గుణములిమ్ము! గౌరవ కృష్ణా!
97*
దోషములెంచకు పద్యపు
బాషయు చందంబు దోష భావము, దాసున్
దోషము దండముతోసరి!
ఘోషను దప్పించు రక్ష గోరితి కృష్ణా!
98*
శుభములు వృద్ధులకెల్లను
శుభములు గాయపడిన సుద్ధికి- బుద్ధిన్
శుభమే ప్రవహించు కృతిగ
శుభమే సద్భక్తి బోధ శోభన కృష్ణా!
99*
అడిగియు నారాదీయుచు
గడన దనమదిగమించు కాంక్షయె పోటిన్
విడరు సొమ్ములు వితరణకు
నడతురు నరకాన్ని జేర నాపలు కృష్ణా!
100*
మొదటనె తనపెట్టెకు సరి
పిదపను-తనవారిపొట్ట ప్రీతికి నిడుచున్
ముదమున పెట్టుబడులకే
కదనముసాగించు లబ్ధి కాంక్షను కృష్ణా!
101*
పేదది పథ్యపు కూడే
లేదనిభావంచనట్టి లెక్కయె బ్రతుకున్
ఈదగ నీదయ-పిల్లల
సాదగ సామాన్యు తరమ? జగతిని కృష్ణా!
102*
మారెను కాలము కలుషము
జేరెను జీవాయుపట్టు సేమము దప్పెన్
సారెకు వైరసు ఘాతమె-
నేరముమాదే క్షమించు నేతృడ! కృష్ణా?
103*
వాదముజేయక,తగు నభి
వాదము చేయంగ మేలు-వసుధను శాంతిన్
నాదము జేయగ సేమము
ఖేదము దొలగించి గావు కేశవ! కృష్ణా!
104*
సులభము జేయుము బతుకును
చిలికియు జీవాత్మ నిన్ను జేరెడు దాకన్
అలజడి మాన్పుము నను భవ
జలధిని దాటించరమ్ము! జయశ్రీ కృష్ణా!
105*
కరివరద!కుచేలసఖా! జరమోయగ నోపికిమ్ము!, జగతిని స్వాస్థ్యం-
వరముగ దయసేయుము-నీ
చరణాబ్జముజేర్చియిమ్ము-జయమును కృష్ణా!
106*
పరులెవ్వరు! ఆత్మయొకటె-
వరుసగ నిహమందు జన్మ ఫలముగ పుణ్యం-
పరతలములెక్కడున్నవి-
ధరతలమేనీవు దీప్తి దాయక కృష్ణా!
107*
మంగళము ముకుంద రిపుజన
సంగరజయ సన్నుతాంగ! సజ్జన పోషా!
మంగళకర! మిత్ర! జగతి-
వింగడములు విందుజేయు-విభుడవు, కృష్ణా!
108*
శుభమగు భక్తులకెల్లను-
శుభయశమభిమానులైన శ్రోతలకెల్లన్
శుభమగు నీతికి నిరతము
శుభమే సర్వత్ర గూర్చు-శుభకర! కృష్ణా!