లోక రీతి శతకము
(తే.గీ.)
1*
శ్రీ తిరుశైల శిఖరేశ! శ్రీ నివాస!
అహము, కోర్కెయు విడనాడి, ఆర్తితోడ –
వడ్డి కాసుల నర్పించి వచ్చియుంటి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
2*
కొటవటంచ నృసింహుని గొలుతు-భక్తి
నిశ్చలానంద ప్రదమగు నిష్ఠగూర్ప!
కోరి పూజింతు పరకాల కుంకుమేశు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
3*
భక్తి భద్రాద్రి శ్రీ రామ భద్రు దలతు!
వరుస నిల్లందకుంట నివాసు దలతు!
పూజ – నీరాజనము సేతు పుణ్యమెసగ!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
4*
శబ్ద పల్లవ మదియేదొ చదువలేదు!
చంద వయ్యాకరణ చందమందు, దేశి-
యక్షరోపమాలంకార యత్నమిదియె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
5*
గీత సంగీత, నృత్యాది రీతులందు
జానపదముల తాలింపు జనులకింపు!
సాంస్కృతిక కార్యక్రమసేవ సాగు చుండు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
6*
తెలుగు పూదోట నెలకొన్న తేటి పాట!
తేనె యూటలో రుచిగొన్న తెల్గుమాట!
వెలయు పలుకు బడుల కృతి వింత మూట!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
7*
కవిగ గుర్తింపుగనలేదు, గాయకునిగ-
పేరు కీర్తియులేదు, నీపేర బ్రతుకు-
భక్తుడన జెల్లు ప్రజమెచ్చు భజనలందు-
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
8*
భరత కీర్తి పురాణాల భావ గరిమ!
చరిత చదివి, చర్చించిన సారమెల్ల-
వినియు వినిపించ విద్యార్థి వీను విందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
9*
జగతి తుది మజ్లి భారత జాతి జన్మ!
జన్మ రాహిత్య ముక్తికి జనెడు వరము!
అనచు దేశ దేశజనులు మనుచు నుంద్రు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
10*
భారతుడె ధన్యుడు, పరమ భాగవతుడు
తరతరాల గీతోక్తికి తగిన నరుడు!
విశ్వ రూప సందర్శన విమల యశుడు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
11*
భారతుని జన్మ ధన్యము భక్తి నొసగి-
వేయి నామ రూపములందు వేడ్క గూర్ప
వెలసె వేంకటాద్రీశుడు వేయి ప్రభల!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
12*
జగతి భరత ప్రజాస్వామ్య ప్రగతి రథము!
సాగె, సామ్యవాదము విశ్వ శాంతి బాట!
మానవతపునాదిగ భక్తి మార్గమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
13*
పాల కడవ మీగడ పేరి పరగునట్లు
గతములోపలి మంచియే కథల సాగి
సాంప్రదాయమై జన సదాచారమగును!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
14*
అనుభవ జ్ఞాన విజ్ఞానమంద్రు పిదప
సాగు నాత్మ తత్వ జ్ఞాన సద్వివేక-
బుద్ధి వికసించి పరతత్వ సిద్ధి గలుగు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
15*
అనుభవంబు సమ్మతమయ్యె – మనువు మొదలు-
ఆధునికులదాక నదియు నచ్చుపడియె!
సాంస్కృతిక భారతీయ విస్తార చరిత!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
16*
వేద వేదాంగములు యోగ శాస్త్ర విధులు- నిధులు-
పుణ్య సూక్తులు వెలయించె పూర్వ చరిత!
ముని పురాణ సంచయమయ్యె! మునుపె పుడమి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
17*
శాస్త్ర శస్త్ర చికిత్సలు సాగె! వసుధ-
వాద ప్రతివాదములు రేగె – వాస్తవంబు-
భరత పుత్రుల గీతగా బ్రహ్మ విద్య!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
18*
బాష తొలి సైన్సు విజయమై బహుళ కృతుల-
సాంస్కృతిక సాహితిని గూర్చె, సద్విచార-
భావముప్పొంగె – ముక్తికై భక్తి వెలసె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
19*
మూడు మూర్తుల సద్భక్తి ముదమొసంగె!
వివిధ సాహిత్య ప్రక్రియల్ విస్తరించె!
అర్థ పరమార్థములు గల్గె – అహరహంబు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
20*
బ్రాహ్మణారణ్యకములందు బరగు ప్రజ్ఞ-
శృతులుపనిషత్తులును-బాష్య సూత్రబోధ!
నిత్య నూత్న బాటలు వేసె నీతి కృతుల!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
21*
నన్నయకు ముందు వెనకగా నున్న కృతులు-
బ్రౌణ్యముగనచ్చు పడెనన్న బాష వెలుగు
తెలుగు వారికి కనువిప్పు తేల్చి చూడ!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
22*
జానపద – జాను తెనుగన్న జనులు మెచ్చ!
తల్లి నాల్క బాషా రుచుల్, దనరు మాతృ-
బాష చార్లెస్ పిలిప్సు చే బాగు పడియె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
23*
దేశ బాషలలో తెల్గు లెస్సటన్న-
తెలుగు లెస్సుమాటయ? బ్రౌణు తెగువచూడ!
జీవితము జీతమునిచ్చె దేవుడతడు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
24*
కన్నడము – తెల్గు కవలలు కనగ వినగ!
బ్రౌణు దగు ర కారముచేత బాధనొందె!
దూరమయ్యె కన్నడ లిపి చూపు మేర!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
25*
సరస సారస్వతాబ్ధిలో సాంతముగను
మునక వేసినయాస్థాన మురిపెమంత-
జానపద ధార మరచె-నిజానిజాల!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
26*
తెలుగు సారస్వత నిధులు-తేనెమతులు!
సూక్ష్మ గ్రాహులు, తగు బుద్ధి సూక్ష్మ మొప్ప!
ధరణి సర్వజ్ఞ బిరుదంబు దాల్చి చనిరి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
27*
సరస లలితకళార్చన సారమతులు!
కీర్తి సాంద్ర కవీంద్రులు స్ఫూర్తి నొసగ!
తిరుగ వ్రాసిరి పరదేశి తీర్థ చరులు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
28*
ప్రజలు – ప్రభువులదే శ్రద్ధ పాఠకులుగ-
దేశి బాషాపురాణాలు తేజరిల్లె!
భక్తి బాటసారుల జేసె, భ్రాంతిదొలగె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
29*
ప్రజల మద్ధుముచ్చట, గ్రంధ ప్రతిభ జూపె!
ప్రభుల యుద్ధ యాత్రలు కృతి ప్రభలు జిమ్మె!
సంస్కృతీకరణ, భరత సంస్కృతయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
30*
దానమె తపసు, కలియుగ ధర్మమనగ-
భవితనూహింప పరమాత్మ భక్తి సాగె!
దేశ భక్తి-నిస్వార్థమై తేజరిల్లె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
31*
సహన శక్తియు సమభావ సాధు యుక్తి
భారతీయ దాంపత్యంబు, భర్త – భార్య!
బండి చక్రాలు సంసార దండియాత్ర!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
32*
భాగవత గీత – సమత సద్భావబోధ
ధర్మ ఘంటా నినాదమై, తనువు నాత్మ-
వేరు జేసి చూపగ, విశ్వమేకమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
33*
భిన్న మేకత్వమై జాతి భీతి లేని-
కట్టు బాటున బాధ్యత గలిగి బ్రతుకు-
భారతీయ రాజుల రీతి పౌరనీతి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
34*
భక్తి,మాటయు-మర్యాద పాటిగాగ-
మానమే ప్రాణ తుల్యమై మనెడు భరత-
జాతి, కీర్తిని గాంచె, నీ జగతి యందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
35*
ఎన్ని నీతిరీతులు భువి వేద ధర్మ
సూక్ష్మములు మానవతనిల్పు సూత్ర గతులు
చక్కదిద్ధి నిరూపించు చతుర మతులు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
36*
పసయు గలకృతుల్ ప్రచురించు ప్రభులు – ప్రజలె!
భక్తి ముఖపుస్త కాకృతి ప్రకటితిముగ-
ప్రభుత సాంకేతిక సహకారంబు గలుగ-
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
37*
సంధి – రాయభారము శాంతి సాగు విధము-
గీత దాటినయుద్ధాన గీతబోధ!
దాన ధర్మ వీరము రాజ ధర్మమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
38*
హద్ధులో వర్తనము, గీత పద్ధతిగను-
కర్మ ఫల సమర్పణ – గీత కాంక్ష గాను!
ప్రజలె రాజులు పోషకుల్ పండితులకు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
39*
తెలుగు భారతి శ్రీ కృష్ణ దేవరాయ-
సభను వెలుగొందె నానాటి చరిత ఘనత!
పసిడి పుటకెక్క నిస్వార్థ ప్రతిభ వెల్గె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
40*
కర్మవీరమె తెలుగింటి ధర్మమయ్యె!
దండ దారమై సమభావముండు రీతి-
ప్రజలు వర్తింప పాలించు ప్రభుత వెల్గె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
41*
కళలు వెలుగొందు భారత కర్మ భూమి!
ప్రజలలో స్వతంత్రేచ్ఛయు ప్రస్ఫుటంబు!
సాగు బ్రతుకున పదిపుట్ల సహనమొప్పు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
42*
విశ్వ పటమున బంగారు పిట్టయనగ-
పూర్వ కీర్తికి పుణ్యాల పుట్టయనగ-
దినదినము భారతీయత దిట్టమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
43*
నీతి కేదారములు భారతేతిహాస-
కావ్య గాథాప్రబంధాలు, కళలు సైన్సు!
దినదిన ప్రవర్థమానమై దిశలు వెలిగె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
44*
ఆది శేషమనగ శూన్యమవని చుట్టు-
భ్రమ పరిభ్రమణాల ప్రభావ జనిత-
కాల చక్రంబు తిరుగాడు క్రమము వెలిసె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
45*
విశ్వ జీవాళి పరిణామ విషయ క్రమము-
దనరు విష్ణుదేవుని దశావతార గణము!
ధర్మ సంస్థాపనార్థమై ధరణి వెలసె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
46*
కోర్కె యజ్ఞాన వృక్షము కొమ్మ రెమ్మ-
లాకు పూత కాతయు పంట శోకమయము!
కోర్కెతో శోకముడుగును లోకమందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
47*
కామ దహనంబుచే, దు:ఖకాననంబు-
గాల్చి వేయగ, జ్ఞానముక్కన్ను వలయు!
పిదప రంగు జీవన హోళి ప్రీతి గొలుపు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
48*
అప్రమత్తానిమేషులు-అదితి సుతులు!
అమృత పాన సంతృప్తులై యమరులైరి!
అసురులోడిరి ధర్మంబు నతిశయించె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
49*
ధరసురాసుర యుద్ధాన నరులు, సమిధ-
లైరి! సద్భక్తి పరులైరి, లబ్ధి గొనిరి!
వాసవాదులు దాసాన దాసులైరి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
50*
దేవ దేవ నిన్నర్చించి తేజరిల్లి-
మాయ గెల్తురు కలియుగ మానవాళి!
ధర సురాసురులను మించి దనర గలరు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
51*
సమయ పాలన సమదృష్టి సాదరంబు-
సత్య వ్రతము, దయాగుణ సాత్వికంబు!
భక్తి శ్రద్ధ ముముక్షువు బాటయయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
52*
మూఢ తత్వంబుచే మాయ ముడియు వడగ-
గాఢమై పునర్జన్మంబు గలుగు, జన్మ-
రహిత ముక్తియు నీభక్తి సహిత ఫలము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
53*
హంసవలె పాలు నీరములరసి చూచి-
మంచి గొను మహాత్ముడు,విసర్జించు చెడును!
పరమ హంసయై నీకార్య పటిమ జూపు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
54*
జనుల పదజాగృతిని జూపు జానపదము!
పట్టి విడువని సద్భక్తి పాఠశాల-
మాయ దూరమై వెలయు నమాయకంబు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
55*
ముగ్ధ భక్తియమాయక ముక్తి బాట!
ప్రకృతి పాఠశాలగ నేర్చు పల్లె విద్య!
మాయ తెరజీల్చు-నినుజేరు మార్గమెఱుగు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
56*
ప్రకృతి – పురుషతత్వము, సృష్టి ప్రజల పుష్టి-
ప్రణయ-ప్రళయాల నడిమింట ప్రణవఘోష!
గమ్యముగ సాగు మత తారతమ్య గతుల!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
57*
ప్రకృతి పురుషానురాగమ్ము ప్రణయమయ్యె!
దిశలు శోభించె-ప్రళయంబు తీర్చిదిద్ధె!
మరల సృష్టికి ప్రణవంబె మంత్రమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
58*
నరుడు సుకృత వశంబున సురల జేరు!
దష్కృతంబున నసురుల దూరి, తుదకు-
జేరు మైత్రి వైరంబులన్, జెందు ఫలము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
59*
మంచియే చాలు, పదివేలు-మానవులకు!
మంచి సాధన సార్థకమైన దారి!
మంచి పుణ్యసంచిత ముక్తి మార్గధనము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
60*
సాటి వారి సంక్షేమంబు సాగు చోట –
తోటి వారిలో చెడు పోటి తోసమస్య!
సాగు నారోగ్య ప్రదవృద్ధి చాలమేలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
61*
మంచి చెడులకు నిస్వార్థ మార్గ నికష-
కల్గెనా? జన్మ తనువాత్మ కదన భేరి!
తాను మహలోకమైతేనె తత్వమెరుగు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
62*
మంచి వాడె పుడమి దేవుడంచు బ్రీతి-
బిలుచు లోకమ్ము, చెడు గని, భీతినొందు!
దేవుడన, మూగ నిస్వార్థ సేవకుండు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
63*
లేమిలో విజ్ఞుడును మాయలెరుగలేడు!
జాలి జూపి యమాయక జనుడటంద్రు-
మొండి వాదులు! మరి మాయలుండ వలెన?
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
64*
వాస్తవాభివృద్ధియె సౌష్టవాభివృద్ధి!
మూల ద్రవ్యదాన్యోల్భన మూల్య గణన-
సాత్వికా రాజసాహార సరణి దేలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
65*
మనసు బోయిన పోకల మనుజు నడక-
మంచి చెడులెంచు చోట, నేమంబు లేక
బ్రతుకు మూలంబు దెలియక బాధగూలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
66*
నడిమి తరగతి మామూలు నరుని బ్రతుకు-
మంచి చెడులందు దైవ నమ్మకము మెండు!
దేని కదిసాగు విభజింపలేని యతుకు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
67*
సంపదలకన్న పదిపుట్ల సహనమున్న-
తాత పేరొందె, మనజాతి పితగ వెల్గె!
కాని కటుకాలమున భక్త గణన కెక్కె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
68*
బ్రతుకు వైకుంఠ సోపాన పంక్తులాట!
బ్రతుకు తిరుమల తిరుపతి బస్సుబాట!
టీకు టాకైన సాగునే టికెటు వేట!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
69*
పరమ పద నిచ్చెనయె-తిరుపతిని టికెటు!
దొరికెనా! మేలు దొర కోయ దొరకునైన!
గదికి దర్శనానికిలెంక-గలుగ సుఖము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
70*
కర్మ ఫలము దేవుని కిచ్చి కదలిరాగ-
సకలయోగ సిద్ధిని జన్మ సార్థకంబు!
గీత సమతయోగము భక్తి గీతమటుల!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
71*
మంచి – చెడు సాగు భారమై మనుగడెసగ-
మొదట పదిపుట్లయోపిక మెదల వలయు!
మంచి ఫలమొంద కష్టమే మనకు మేలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
72*
లబ్ధి-ధన ఋణ గుణకాల లాటరీలు-
పెద్ద – నిచ్చెన బోలు పెద్ధరికము!
మరల మరల నెన్నికయగు మాట నిలుప!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
73*
మంచి జేయ బూనిన గల్గు మంచి ఫలము!
మంచి యసిధార వ్రతదీక్ష మించు జగతి!
మంచి చేత మనీషియై మహిమ బొందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
74*
మంచి బాటలో దేవుని మైత్రి భక్తి!
మంచి మనిషి దేవుని జేయు-మహిని పుణ్య
మనగ మంచియే, చెడు పాపమంద్రు బుధులు
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
75*
కలిమి నాటి దెల్లయు లేమి కల్లయగును!
మనిషి పోయినా, భువిలోన మంచి మిగులు!
మంచి తులతూగ నేర్చుటే మనిషి ఘనత!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
76*
అర్థ కామాశ పీడిత స్వార్థ బుద్ధి-
మంచినాశ్రయించదు, మంచి మాట వినదు!
జరుగు మంచి సహించదు జగతియందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
77*
విత్త ప్రాధాన్యతే సాగు చిత్త వృత్తి-
హావ భావమాంగిక వాచికాల నటన!
వేష- బాషల తద్విత్త వేట సాగు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
78*
మనసు సున్నితత్వము మాట మన్నననగ-
మంచి మృదు వాక్కున మైత్రిమార్గముండు
మంచి మార్గాన కర్తవ్యమదియె దోచు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
79*
నీతి తృప్తి లేని మనసు నిప్పుమూట!
నిల్పు కోని తీరున మాట-నీటి మూట!
నిలకడయు లేని మనుజుని నీతి జూట!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
80*
స్వేచ్ఛ – జీవన స్వాతంత్ర్య సిద్ధి గన్న
విధులు, బాధ్యతల్, హక్కుల విందు గొన్న-
కట్టు బాటున జీవింప గలుగ వలయు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
81*
వెసన మొక్కటి బ్రతుకును వెసగ ముంచు!
చిన్న లోపంబు గలిగినా చెరుపు గలుగు!
కడవ ఛిధ్రాన నీరంత గారినట్లు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
82*
కలుష సాంధ్రత, కలిమాయ, ఖలుల దుడుకు-
దుష్ట నడవడి, దుష్కర్మ, దురిత గతుల-
నిష్ట రాజ్యంబు సాగిన-నీతి సున్న!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
83*
సుకృతమున గల్గు జాతికి సుఖము, తృప్తి!
సహన బుద్ధి గల్గిన చిత్త శాంతి వెలయు!
మంచి చెడు విచక్షణ గల్గ మనిషి గెలుపు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
84*
దృశ్య,గాన,సుగంధ,రుచుల మనిషి-
వలచి పంచేంద్రియాల సవారి జేయు!
తాట కనుముక్కు చెవినాల్కలాట బ్రతుకు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
85*
మనుజు కోర్కె తురంగాల మనసు రౌతు!
నరక దారుల నురికించు నష్ట పరచు!
దాని గెల్వగ వెలసె నాధ్యాత్మికంబు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
86*
తనువు-ఆత్మ సంబంధంబు దఱచి- జగతి-
ఆత్మ పరమాత్మ విరహంబు నరసి ముక్తి-
గూర్చు సద్భక్తియోగంబు-గుదరవలయు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
87*
దానమే తపసు పుడమి, ధాత తపసి-
గాగ కలికాలమున జన్మ గలుగు-పుణ్య-
విత్త సంపాదనయె, మేలు విశ్వమందు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
88*
భక్తి – నీతి ధర్మము చుట్టు బాటలెన్నొ-
తరతరాలుగ నేర్పడె-తాత్వికములు!
జాన పదవాణి వినిపించు జాగృతములు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
89*
కామ్య నిష్కామ్యమగు ధర్మ కర్మ ఫలము-
భక్తి దైవార్పణము జేయు బాట దెలుపు!
భువి పరోపకారము జేయు బుద్ధి గెలుపు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
90*
నీతి దాయక జీవన నిష్ఠ గడుపు-
మాన్య సామాన్యులైనను మాయ గెలుచు-
తత్వమాధ్యాత్మికము జీవ సత్వమయ్యె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
91*
మాధవుని సేవలో సాగు మానవుండు-
మానవుని బ్రోవగా వచ్చు మాధవుండు!
భువి పరోపకారము పుణ్యపూరకంబు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
92*
మనుజు తీర్చి దిద్ధగ గీత మరల- మరల-
మాతవలె దెల్పె-మాస్టరు మల్లెగాక!
సహనమొప్పగ తాత్విక సారమొసగె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
93*
కలిమి లేముల కావడి కడవమోత!
ముళ్ళు, పూలున్న బాటలో వెళ్ళు యాత్ర-
బ్రతుకు-మంచియనెడు పుణ్య ఫలము జాత్ర!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
94*
ఇంట బయట గెల్చియు ప్రేమ నంటు వడియు-
బడిని గుడిని జేరియు, పల్కుబడిని బడసి-
బ్రతుకు నిశ్చల చిత్తుని-భక్తి దృఢము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
95*
భౌతికము పాజిటివ్వుగా బ్రతుకు నిచ్చు!
మానసికము నెగెటివ్వుగా మంచి చేర్చు!
రెండుగావలె సంధింప రేయి బవలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
96*
ఎయ్డ్సి-అణుయుద్ధ భీతిచే నేడ్చె జగతి!
నాయకత్వలోపము-బహునాయకత్వ-
మై బహుజనాభ-విషమ సమస్య-కుదిపె!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
97*
ఆరు నూరైన పోటి సవారు సాగె!
నూరు నారైన నొకటయ్యె నూరువాడ!
నరుల నోడింప సాగుటే నరుజిగీష!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
98*
న్యాయమైనను పోటికి నప్పదేమి?
నీతికే కట్టుబడు జాతి నీది నాది!
ధర్మ మైనను పోటియు దప్పదేమి?
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
99*
తిట్లు దీవెనలే నీతి మెట్లు గాగ-
ఎట్లు దాపురించు, ఎయిడ్స్ – ఏది దారి?
నేతి బీరబోలునె నేటి నీతి విద్య?
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
100*
చూడ గతకాలమున మేలు గలిగెనేమొ?
వచ్చు కాలమేడ్పించ రావచ్చునేమొ?
భారతాన నన్నయదెల్పె భావమెరుగ!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
101*(సంపూర్ణం)
విజ్ఞ విద్యలున్నను సాగె విశ్వమంత-
నీతి విద్యగ భారత జాతి విద్య-
జాతి విద్యల కొనసాగె నీతి విద్య!!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
102*
ఎవరి సంస్కరింతము నిజమేది విద్య-?
అర్థ-కామాశ వీడి నిస్వార్థమొప్ప-
నెవరు నేర్పింత్రు? మరి నేర్తురెవరు?
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
103*
ఏకతా భావమేది? వివేకబుద్ధి-
ఏక తాటిపై నిల్చి మమేకమైన-
జాతి యేదిల? భారత జాతి గాక!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
104*
ఇతర వైజ్ఞానికము నేర్చి యింపు మీర-
పంచె నాధ్యాత్మికమును పరుల కైన-
బ్రహ్మ విద్య బోధించదే? భరతమాత!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
105*
ప్రజలె రాజులై – పాలన ప్రగతి గలుగ-
శ్రమ ఫలంబుగ ప్రజా సంక్షేమమొసగ-
నీతి వైజ్ఞానికము మేళవించ మేలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
106*
పరుల పరిపాలనలు బోయె-పరువు దక్కె!
ఎవరి పైయుద్ధభేరిని వేయగలము!
కూడి దుర్భిక్షమును గెల్చు కృషియె మేలు!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
107*
భిన్న తత్వమేకత్వమై యున్న భరత-
దేశ పావన జీవనోద్ధేశమేమి?
దాని నేర్పింప విద్యార్థి దనరు కీర్తి!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!
108*
ధర్మ మార్గంబు దీపించు కర్మ భూమి!
విశ్వ శాంతిని కాంక్షించు వీరజాతి!
శుభము భారత నీతికి శుభము! శుభము!
తిరుణహరి మాట విరిబాట తేనెతేట!