top of page
మైత్రిహృదయం శతకము
(తే.గీ.)

1*

శ్రీలు జిందు శ్రీకృష్ణ కుచేల మైత్రి-

నరుడు నారాయణుడు మైత్రి నలరురీతి-

చిత్తమున నిల్పి శతకంబు – జెప్పనెంతు!

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

2*

భారమువహించు,కోటంచ నారసింహు-

బాల్య భక్తుడనై గొప్ప భావ పటిమ-

పనియు పాటల మనసున్న ప్రజలు మెచ్చు –

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

3*

వరుస పూర్వాధునిక కవివరుల దలతు!

తప్పు సవరించు, చనువు-సోదరుల, గురుల-

పాఠకుల, పండితుల, బాటనుతుల!

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

4*

తిరుణహరి వంశజుడ వెంకటార్య సుతుడ!

వావిలాల వాస్తవ్యుడ-వాసిగాంచు-

వాసుదేవుని భక్తుడ! వసుధయందు!

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

5*

విశ్వశాంతి సమైక్యత విస్తరించు!

భారతీయ కళాశాల బాష లందు-

వెలుగు తెలుగు బోధ గురుడ-వేడ్కమీర!

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

6*

స్వామి వ్రతమందు పితరులాచార్య వరులు-

జన్మ వెవహారనామ విచారమైత్రి-

సత్య నారాయణని బిల్వ సాగిరంత!

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

7*

జీవనోఫాధి బోధన ధీవివేక-

అనుభవజ్ఞాన విద్యతో నాత్మతత్వ-

పాఠ గుణపాఠముల, పుణ్య పటిమ వెంట-

తిరుణహరిమాట విరిబాట తిరము మైత్రి!

8*

సాటి వారితోనాటలు పాటలందు-

తోటివారితో చదువుల పోటియందు-

శ్రద్ధ భక్తిని బాల్యంబు సాగిపోయె!

తిరుణహరిమాట విరిబాట తిరముమైత్రి!

9*

బాల్యమున భక్తి గలుగుట భాగ్యమనిరి!

పూర్వ పుణ్యమేగ పురాణ పుటలు ద్రిప్ప-

మొగ్గ పరిమళమని భక్తి యోగులనిరి!

తిరుణహరిమాట విరిబాట తిరముమైత్రి!

10*

బ్రతుకు నెదురీత యవ్వన బాటసాగె!

జానపద గీతమున భక్తి జాగృతింప-

మనసు వికసించె – వెలువడె మధురకవిత!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

11*

మధురకవి నారన తనూజ మాతగాగ-

రంగకవి పౌత్ర సత్యనారాయణ కవి-

తెలుగు పండితుడై పేరు నిలిపె ననిరి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

12*

భావముదయింప బాధించె బాషలోటు-

బాష ప్రకటింప తద్భావ పటిమ లోటు-

మౌన గీతాలు ప్రచురింప మాను లోటు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

13*

నీతి బోధించు గురువెంట నిల్చి తిరిగి-

రీతి వివరించు సాహితీ మిత్ర కవుల-

చర్ఛ, భగవదార్చన కృతుల్ చవులు మీర!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

14*

లేమి-సంబరాలకు,తిండికే మిడుకగ-

శూన్య హస్తము పైగ పైశున్య గుణము!

మౌన పోరాటమగు సామాన్యు బ్రతుకు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

15*

మంచియను పుణ్యమే గుభాళించు పుడమి-

మంచి తోటలో వటవృక్షమగును నీతి!

మంచి పాదులో సన్మైత్రి మల్లెపొదయె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

16*

వాస్తు కర్థము పుడమియే వాస్తవముగ!

ఇలను శోధింపు-ఇన్నరు ఇంజనీరు!

జరుగనున్నదే జరుగును జగతియందు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

17*

మంచి పాదున ఫలియించు మంచి మైత్రి!

మంచి మాటయే మతధర్మ మగును-మనుజు,

మంచి మనసుమైత్రికిపాదు మనుగడెల్ల!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

18*

మనము పోయినా మిగిలేది మంచి చెడులె!

మంచి పేరు ప్రతిష్ఠగా మైత్రివెలయు!

మంచి మైత్రియే స్థిరభక్తి మార్గదర్శి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

19*

క్రొత్త పాతల కలయిక కొసమెఱుంగు!

కరుణ రసమొప్పు మైత్రియే కలియుగాన!

నిండు గుండె మైత్రియుగల్గ నిబ్బరంబు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

20*

తరతరాలకు ఘనమైత్రి తరలివచ్చు!

తాతపేరుతో మనుమలు తదితరముల-

మైత్రిపేరున బంధు సమైక్య సరణి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

21*

నీది నాదన్న దొకనాట నిత్యమగునె?

మనదొ-మరొకరిదోయను మాటలేల!

ఏది ఎవరికాలమొ వారి దదియుగాగ!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

22*

మంచి మనుజుల నిస్వార్థ మైత్రి నిజము!

మనుజు మార్చు కోర్కెను గూడ మైత్రినటన!

కాల గమనాన సన్మైత్రి కడకుదేలు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

23*

పెంపు లేదన్న పెరిగెను పేదరికము

తెంపు లేదన్ననేకాంత మింపు గూర్చె!

ఏది ఎవరిదో-వారిదదేకముగను!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

24*

మంచి మైత్రిచే శాశ్వతమైన కీర్తి!

కీర్తి ఖండూతిచే మైత్రి కీడుగూర్చు!

కీర్తి కోర్కెయు భువి శోక క్రీడనడుపు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

25*

కూటి కోర్కలీడేరగా పోటి విద్య!

కోటి కోర్కెల కోసమై నేటి విద్య!

పోటి కోర్కెల మానసమ్ పొసగునెట్లు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

26*

కోటికిని పడగెత్తిన కూటి కుడుపు-

లవణమన్నమేయగు మిత్రలాభమందు!

పోటి పడుట తలెత్తదు పొంగు ప్రేమ!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

27*

పోటి పెంచుమాటల కోట పెద్దయైన

నీతి కాలుగడపదాట నిందితంబు!

మైత్రి భావంబుచే సర్వమమరికగును!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

28*

ఆప్తి వీడగల్గుటయే సంప్రాప్త తృప్తి!

సప్త ఖండాలు తనవైన నాప్తి జెందు!

కోర్కె సుప్తభుజంగమై గొట్టు బుసలు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

29*

ఆప్తి చే కోర్కెలెగయు సంప్రాప్తమునకు-

తృప్తి గలుగదు, సన్మైత్రి తేగబుద్ధి!

నలరు సమ్మతి నాపేక్ష సమసిపోవు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

30*

పాటి దప్పిన స్వార్థమే పడగ విప్పు!

పోటి పెరిగి యనర్థమై కోరసాచు!

సర్వ జనసఖ్య దీవనల్ సాగునెట్లు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

31*

ఎవరి బ్రతుకు వడ్డించిన విస్తరగును?

ఎట్టి కలలు ఫలించిన చెట్టులగును?

సర్వ జనసౌఖ్య దీవనల్ సాగునెట్లు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

32*

విశ్వ మైత్రి వడ్డించిన విస్తరైతె-

కలలు, కల్లల – పనిలేదు, కష్ట ఫలము-

ఎవరిది వారికినందు నెదురులేక!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

33*

తేగ గుణమిచ్చు మైత్రియే తెగువగూర్చు!

భువిపరోపకారము కీర్తి బురుజులెత్తు!

లబ్ధి జేకూర్చు, ఫలశుద్ధి లాభవృద్ధి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

34*

తేగ గుణముతో పాటుగా తెగువ గలుగు-

బ్రతుకు వేగంబునకునోర్చు పటిమ వెంట-

నేటి కోర్కెల వలయంబు నెగ్గగలుగు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

35*

ఆశ మోసులెత్తగ కోర్కెలతిశయించు!

నాశ్రయించు నిరాశచే నమితశోక-

సంద్రముప్పొంగ-మైత్రిచే సద్దుమణుగు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

36*

స్వార్థమునువంచి పూర్ణ విశ్వాసమిచ్చి-

చెడును వర్జింప సన్మైత్రి చేయుమేలు!

మంచి-నిస్వార్థమును పెంచు-మాటనిలుపు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

37*

స్వార్థ గుణచేష్టలను రిత్తసాగు చదువు-

అర్థమవదు! నీతియునర్థమైన-దాని,

నేతి బీర నీతిగ దెల్పు నితరులకును!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

38*

తేప తేపకు పరనింద తేలియాడు-

హృదయ గాయంబు తదుపరి యెదను మచ్చ!

మరచిపోనీక దిట్టించు మరల మరల!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

39*

ఊర్ధ్వలోకాల మనుజుండు నొందు వృద్ధి!

అడ్డ దిడ్డంపు పనిమాని యధమ దృష్టి-

నూబి దిగబడకుండుటే – ఊర్ధ్వ దృష్టి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

40*

ఊర్ధ్వలోక దృష్టిని-గీత బోధసాగె!

అధమ దృష్టి పాదతలపు పథముజూపు!

అహము నిహముదాటగనీదు, అహరహంబు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

41*

ఆత్మ తత్వంబునకు లౌక్యమవధి గాదు!

లౌక్యమునకాత్మ మార్గంబు లాభమవదు!

లోకమున గూర్చు పుణ్యంబు మోక్షమునకె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

42*

తప్పు దెలిసి పశ్చాత్తాప తప్తుడైన-

చాలు నందురు, తదుపరి సాగు బ్రతుకు!

ఒప్పు దెలిసి సాగినమేలు! గొప్పతనము!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

43*

వంచకుని చెడుయోచనల్, మంచిజెఱచు!

వంచకుని మార్చనెంచు విశ్వాసి యూత!

గోముఖ వ్యాఘ్రమును మార్చు గోవు మైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

44*

మనుజుడై పుట్టి యాత్మను, మనసు నిలిపి-

నమ్మకము-నెమ్మది మతము సమ్మతముగ!

హంస వలెమంచి గైకొని సంచరించు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

45*

మార్పు’చెడునుంచి మంచికే చేర్చవలయు!

తీర్పు’ చెడుమార్చి మంచిని గూర్చవలయు!

అన్ని కోణాలలో మైత్రి యదియె మేలు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

46*

కృపయు లేకున్న మానవ క్రూరమృగము!

మనసు లేకున్న ను-సజీవమైన శిలయె!

ఉన్న లేకున్న మిత్రుడే కూర్మి పేర్మి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

47*

హద్ధు సరిహద్ధులుండు గృహంబులందు!

దేశ దేశాల మధ్య సందేశ హద్దు!

తమ – తమ సమాజిక హద్ధు తాత్వికంబు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

48*

బ్రతుకు తరువున నమృతంపు పండ్లు రెండె!

జన్మ తరియింపజేయు సజ్జనుల మైత్రి!

మరియు సద్గ్రంధ పఠనంబు మానవులకు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

49*

మంచి చెడు విత్త గడనల మరిగి, ధనము-

గూర్చు చుందురు తృప్తి చేకూరుదాక!

శాంతి సంతృప్తి లేకున్న భ్రాంతి బ్రతుకు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

50*

మంచి సంపాదనయె తృప్తి మార్గమంద్రు!

పాట్లు దప్పవు నడవడి పాటిదప్ప!

దొరలు పొరబాట్లు నగుబాట్లు దోషిజేయు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

51*

మంచి మైత్రి శత్రుత్వంబు మార్చు-సర్వ-

జీవ సమదృష్టి పాటించు సేవ సాగు!

నరుడు పరమాత్మ తత్వంబు నరయ సుళువు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

52*

మంచియన, పుణ్యమేకదా! మనుజ సేవ!

చెడ్డయన పాపమే హింసజేయు పనుల!

మంచి భూతహితవు-సత్యమనగ నదియె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

53*

మంచి చెడు విచక్షణ జేసి, మంచి నెంచి-

దేశకాల పాత్రంబుల దెలసి చేయు-

మైత్రి రూపాంతరము భక్తి మార్గమగును!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి

54*

కోటి విద్యలు కూటికై పోటి పడగ-

మనుజు తృప్తి ప్రశాంతత మనుగడెట్లు?

బ్రతుకు కర్థము దెలిపేదె బ్రహ్మవిద్య!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

55*

ఉప్పులేని పప్పులకూర చొప్పు బ్రతుకు!

మైత్రి లేకరుచింపదు, మనసులేని-

మనిషి-మానుకన్న కనిష్ఠమంద్రు బుధులు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

56*

నవత సాగాలి పుడమి మానవత పరిధి!

పాప భీతిగల్గిన పుణ్య పాత్రధారి!

దైవమై దేవదేవుని దారి జేర్చు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

57*

మైత్రినిహలోక జీవనమార్గ తృప్తి!

పార లౌకిక జాగృతి భక్తి పేర!

దివ్య తత్వమై దేవుని దారి జేర్చు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

58*

మనుజ మైత్రి భయావృత మైన భక్తి

రూపు దాల్చిన మదినాత్మ రూపుదెలియు!

సర్వ జీవులనాత్మ సాక్షాత్కరించు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

59*

మైత్రి గలుగుట యలవోకమాట గాదు!

మనసు గుదిరిన సద్భక్తి మార్గమలరు!

కనగ సుళువుగాదాధ్యాత్మిక ప్రయాస!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

60*

మంచి మైత్రికి స్వాగతం-మదిని చెడుగు

మైత్రికిలటాట! జెప్పిసమైక్య దారి-

భక్తితో మమేకముజెందు బ్రతుకుమేలు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

61*

భర్తృహరి నీతి, సుభాషిత భావపటిమ మైత్రి!

భక్త పోతన భాగవతోక్తి-సఖ్య

భక్తి ప్రకటనగ-కుచేల భక్తిగాగ!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

62*

మంచి చెడు కాలనికషలో నెంచబడియు-

మంచి మది ఫలవృక్షమై మైత్రి పేర-

భక్తియోగ బోధన కదా! భాగవతము!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

63*

దోవ మారిన, దొలగునే దోస్తు ప్రేమ!

మనుజు జీవనాధారమీ మైత్రి ప్రేమ!

తలపులో వ్యక్తి గతమైన తత్వమొకటె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

64*

మైత్రి చెఱుకు గడను బోలు, మనుజు విధులు

మంచి బాధ్యతలను మైత్రినెంచు-చెఱుకు

పిప్పినైనను చీమలు పీల్చి మురియు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

65*

మనుజు వర్తన చాటించు మంచి తనమె!

మనసు నర్తన సదృశము మైత్రి గుణము!

పుణ్య పాప మెఱిగిన పైశున్య ముడుగు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

66*

మదియు నిస్వార్థమై స్థిర మార్గ గణన-

మంచినెంచిన మైత్రిని సంచరించు!

కలుగజేయును మైత్రియే గట్టిమేలు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

67*

ఆశ పిచ్చుక గూడు నిరాశ మోడు!

మధ్య బ్రతుకంత దారిలో మబ్బుతునక-

మాట మైత్రిని సరిబోల్చు మాటయంద్రు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

68*

నరుడు నారాయణుని మైత్రి నరసె గీత!

కర్ణ దుర్యోధనుల మైత్రి గలిగె హింస!

ధర్మ జయశబ్దములమధ్య దనరె గీత!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

69*

మహిని కృష్ణకుచేలుర మధుర మైత్రి!

భక్తియే-నవముల సఖ్య భక్తియనగ-

నాత్మ – పరమాత్మ బంధంబునలర జేసె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

70*

పాఠ గుణపాఠములతోట బరగుమైత్రి!

బ్రతుకు వడవోతలో మైత్రి భక్తి తేట!

కామియై మోక్ష గామియై కదులు చోట!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

71*

మంచి రూపున చెడు సంచరించు,

కలిని అయ్యొ పాపమనియు జాలి పడుట గాగ-

పాపమగు పుణ్యరూపున పాడు మైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

72*

సుకృతమైదోచు దురితంబు, చూపరులకు-

మైత్రియై దోచు శాత్రవ మాయ తెరలు!

కపట నరరూప రాకాసి కథలు కలిని!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

73*

జ్ఞాని యాధ్యాత్మికము దెల్పు జగతి యందు!

సైన్సు పేర ననుభవ విజ్ఞాని విద్య-

నేటి క్రొత్త రేపట పాత నేది వింత!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

74*

మైత్రి సద్భావపూర్వకమైన దగుట-

బంధు మిత్రులనంగ విందుమెపుడు!

మైత్రి బాంధవ్యమును మించి మంచి గూర్చు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

75*

అవసరార్థము వర్తించు ననుకరించు-

వరుస లబ్ధికి యవకాశ వాది మైత్రి!

నటక మైత్రియై తొలగు ప్రాకటముగాను!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

76*

చంద్ర తారలు పద్మార్క చందమొప్ప-

తూర్పు పశ్చిమాలను మైత్రి సూర్య రశ్మి!

బాహిరంతర ప్రకృతిని-భక్తి వెలయు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

77*

మంచి చెడుగుల వివరించి మంచి బాట-

మనుజు దేవునిగా మల్చు మైత్రి పుడమి!

చదువు సంస్కారముల మంచి సాగుచుండు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

78*

మాయ తెరదాగు, మదిగాంచు-మైత్రి దృష్టి-

మాయికుని మాయ వదలించు మంచి మైత్రి!

బ్రతుకు తుదదాక వెన్నంటు ప్రాణమైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

79*

తేప తేపకు పరనింద దేలు వారు-

మైత్రి గలచోట నిందింప మనసు పడరు!

ధర సురాసుర నరులందు దనరు మైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

80*

భిన్న జాతి విబేధాలు భిన్న రుచులు-

రూపు రేఖావిలాసాలు చూపు గతుల-

నొక్క త్రాటను నడిపింప నోపు మైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

81*

మైత్రి భిన్నత్వమేకత్వమైన పాత్ర-

భారతీయ సుహృజ్జన బ్రతుకు యాత్ర!

సప్త వర్ణ చక్రగమన సరణి దోచు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

82*

మంచి చెడుమైత్రి సాగు సమాజమందు-

మంచి మైత్రి శాశ్వతమగు మనుజులందు!

తారు మారగు చెడు మైత్రి, వారు వీరు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

83*

ఏండ్లు పూండ్ల చీకటినున్న యెదుటి మదిని-

తరతరాల యజ్ఞానము-దరుము మైత్రి!

చీకటిని బాపు వెలిగించు చిన్న దివ్వె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

84*

ఆత్మ తాత్విక సత్సంగమైత్రి చేత –

తత్వ-పరతత్వ చింతన, తార్కికముగ!

మార్గమైసాగు-మదిమెచ్చుమతము వెలయు

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

85*

ఆత్మ తననుండి వెలువడి-యవని జన్మ-

మెత్తి, తనను వెదకుదాక-తెరలయందు!

నుండు, పరమాత్మ వెలయించు దండి మైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

86*

వెల్గు దీపంబు, మనుజుండు వెలుగు మైత్రి-

దివ్వె క్రీనీడ శాత్రవ ధీమతంబు!

శత్రు శత్రుత్వమును మైత్రి చేత దొలగు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

87*

వెల్గు దీపంబు క్రీనీడ వెలయు నట్లె-

మంచి దాపున చెడు మైత్రి మార్గముండు!

చెడును మార్చు మైత్రిని మంచి చెన్ను మీరు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

88*

కర్మ ఫలతేగమై మైత్రి కలిగె నేని-

మనసు నవనీతమై మంచి మార్గమందు-

మైత్రి గల్గు రసాకృతి-మధుర భక్తి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

89*

ఒక్క మాట మైత్రిని దెల్ప నోపలేక-

ప్రేమ మైత్రి -భక్తియు పేరుపేర దెల్పి

ఏక తత్వంబు గనగ వివేకమనిరి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

90*

నెమ్మదిగ మైత్రి సాగింప తేగ గుణమె!

గాక పాదుకొనునెమైత్రి-సాగవశమె?

సహన సహకారమున మైత్రి సత్వమొసగు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

91*

భౌతికాసక్తి వాదాలు బహువిధాలు-

మానసిక యిచ్ఛ మాయికామాయికులకు!

నైతికాసక్తి వాదాలె నయము జయము!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

92*

మైత్రి భక్తుల మార్గంబు, సఖ్య భక్తి!

ధర కుచేల మైత్రియు చాల దనరె ననగ!

నర నారాయణుల మైత్రి నాణ్యమయ్యె!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

93*

భక్తి భక్తి చే స్థిరముగా మనసు నిలుచు!

కట్టడినిసాగు సంసారి కడకు జేర్చు-

గుట్టెఱింగిన పరమందు నెట్టి బ్రోచు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

94*

మైత్రి భక్తి చే శత్రుత్వమణచి శత్రు-

రక్ష సేయగ వీలు విలక్షణముగ!

పాపినే క్షమింపగ దైవ ప్రార్థనంబు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

95*

భువి పరోపకారమె ముఖ్య సూత్రముగను-

మంచికిదె పరాకాష్ట సమ్మతము మతము!

క్రీస్తు మహ్మదు మంచిచే కీర్తి గొనిరి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

96*

సిక్కు జనవిందు గోవింద సింగువాక్కు!

మతము నిస్వార్థ పూర్ణ సమత్వ దారి-

నహము వీడిన పరమత సహనమైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

97*

స్వార్థ మైత్రిని జన పరస్పరము గొడవ-

తేగ పరిపూర్ణమగుమైత్రి తెంపులేక-

బ్రతుకు సాగు దాకను సాగు భక్త పేర!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

98*

భావప్రధాన్యతను దోష పదములనక-

వ్రాసి యిచ్చితి జాతీయ పథక సేవ-

ఛాత్ర జనసంతసము నిత్య సత్యమనగ!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

99*

గాయపడి గాయమును జేయ డాయవలదు!

దయయు దాక్షిణ్యమును ప్రేమ దనరు మైత్రి!

మనసు గాయాలు మాన్పగ మనుజువంతు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

100*

లేమి మరిపించు మైత్రినింకేమి లోటు!

కలిమి మరలించు మైత్రియే కలియుగాన!

ధాతగా జేసి, తాపసిదారి నిలుపు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

101*

మైత్రి ప్రేమయై భక్తియై మానవాళి

మనసులో నారుగురు శత్రు లణగి పోవ!

ఆత్మ కన్వేషణము సాగు నమిత శ్రద్ధ!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

102*

పోటి తత్వంబు విద్యలో పొసగ మేలు!

బ్రతుకు పోటి, మానవతను పదట గలుపు!

మైత్రి లేకున్న సుఖశాంతి మాటలేదు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

103*

ధర్మమర్థకామము మోక్ష దారి మైత్రి-

భయముచేగూడి భక్తియై బ్రతుకు శ్రద్ధ

దైవ దత్తమై సద్గతి దారి నడుపు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

104*

కయ్యములు మాన్ప నెయ్మంబు గలుగ వలయు!

మోదమును గూర్చు భక్తియు మొగ్గదొడగి

పరిమళింప జీవన్ముక్తి ఫలము వెలయు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

105*

బ్రతుకు పోరాటమున మైత్రి బలము నిచ్చు!

కోర్కె లారాటమున మైత్రి గూర్చు శాంతి!

మైత్రి భక్తి సంతృప్తి మమేక ముదము!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

106*

నీతి విలువ గల్గిన గల్గు నిరత మైత్రి!

విశ్వ సింప మానస మైత్రి విశ్వశాంతి!

దీన మానవోద్ధరణయే దివ్యమైత్రి!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

107*

మిత్రుడన సూర్యుడే రస్మి మైత్రిగాగ!

చంద్ర రశ్మియు మిత్రుని చలువ గలుగు!

మైత్రి భావంబు మనుజు మహాత్ము జేయు!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

108*

శుభము-మానవతకు విశ్వ సుజనులకును!

శుభము మిత్రకోటికి నిత్య సుఖము శాంతి!

శుభము గల్గు మైత్రి శతక శ్రోతలకును!

తిరుణహరి మాట విరిబాట తిరము మైత్రి!

Contact
bottom of page