శ్రీ శ్రీ శ్రీ నాగుల మల్లికార్జున స్వామి శతకము
సీ*1
శ్రీ శైల తనయేశ! శ్రీకంఠ! లోకేశ!
ఓశర్వ! సర్వేశ! ఓమహేశ!
రజితాచలనివాస! రజనీచరవినాశ!
రాజరాజేశ! పురాణ పురుష!
రమనీయ గుణకోశ! కమనీయ ధరహాస!
బ్రమరాంభ హృదయేశ! భవవినాశ!
పవనభుగ్వర భూష! భువనమోహనవేష
దివిజేశ! భూతేశ! దివ్యతేజ!
గీ*
సిరియు సత్కీర్తి సిరులిచ్చు చిద్విలాస!
కృపను గని మమ్ము రక్షించు కృత్తివాస!
భక్త జన పోష మారేడు బాక వాస!
పాహి నాగులమల్లేశ! పాపనాశ!
____
సీ*2
విశ్వశాంతికి మొదట విఘ్నేశు పూజింతు
విద్యార్జనకు వేదవేద్యు దలతు
పలుకులమ్మకు మ్రొక్కి ప్రార్థింతు పాండిత్య
మెలకువ నేర్పింప మేలొసంగ!
పూర్వాధునికకవి పుంగవులదలచి
ప్రణమిల్లి గురుదేవు ప్రస్తుతింతు
పెద్దలు పితరులు ప్రేమతో దీవింప
మదిలోన నీదివ్య మహిమ నెంచి
గీ*
భక్తి శతకంబు వ్రాయగా – భాగ్యమనుచు
పూనుకొంటిని నాపూర్వ పణ్యముగను
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*3
వేదవేదాంతాల వెలుగు విద్యలు నీవె
నిఖిల శాస్త్రజ్ఞాన నిధివి నీవె
అఖిలాండ పిండ బ్రహ్మాండ భాండము నీవె
పంచభూత ప్రకృతి ప్రభుడ వీవె
పరమాణు మధ్యమై బరగు జటియునీవె
ఆత్మలందున పరమాత్మ వీవె
ఆదియనాది మధ్యాంతలయుడ వీవె
సూక్తమీవె ధర్మసూక్ష్మమీవె
గీ*
దేవదేవనీ మాయయే దివ్య సృష్టి
వింత లెన్నగపుడమి నేనెంతవాడ?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*4
ఆదిదేవుడవీవె – ఆదిశక్తియునీవె
ముగ్గురమ్మలకును మూలమీవె
బ్రహ్మ విష్ణువు పరబ్రహ్మమూర్తివి నీవె
సృష్టి స్థితిలయ సూత్రమీవె
విశ్వరూపుడవీవె – విశ్వనాథుడవీవె
దివిసూర్య నక్షత్ర దీప్తి నీవె
భుక్తి నీవె శక్తియుక్తి నీవె సిద్ధి
బుద్ధినీవె భక్తి ముక్తి నీవె!
గీ*
నిఖిల శాస్త్రజాగృతినీవె నిత్యమీవె
సకల జీవన సత్వము సత్యమీవె!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*5
నిఖిల చరాచర నివహంబు సృజియించి
నీతిధర్మ నియమ రీతి దెలిపి
మంచిబెంచి ప్రతి మనిషిలో నివసించి
వంచకులనువంచి వసుధ గాచి
వాంచితార్థములిచ్చి సంచితార్థపు పుణ్య
పాపాల పాలెంచి ఫలమొసంగి
విశ్వజీవనగతి వికృతమై వికటింప
ప్రళయతాండవమాడి పరవశించి
గీ*
మూడుమూర్తుల యుగధర్మములను నడిపి
లీలసాగించు నీమాయ లెన్నశమె?
భక్త జనపోష మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*6
వాక్కుగల్గిననిను వర్ణించుటే మేలు
కనులుండినను నిను గనినచాలు
చేతులుండిన నినుసేవింప పదివేలు
వీనుల నీకథల్ వినిన చాలు
ఉదరాన నినునిల్పి యూరడిల్లిన చాలు
ఆత్మలో నీరూప మలరచాలు
మనసులో నీభావమంకురించుట మేలు
నరజన్మ నీభక్తి నరయచాలు
గీ*
జన్మజన్మల పుణ్యంబు జతపడంగ
పుడమి నరజన్మ నీదయా పూర్వకంబు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*7
నిర్మలాత్మయె నీదునిలయంబు నరుచిత్త
నిగ్రహంబే నీదు విగ్రహంబు
నిష్కల్మశంబైన నిత్యకర్మఫలమె
వేడ్కనీకొసగు నైవేద్యమగును
సత్య నీతియు ధర్మసాధన నిష్కామ
కర్మయేనీపూజ కలియుగాన
కలనైన వెలినైన కల్లలాడని నోటి
నాదమే ఘంటానినాదమగును
గీ*
నవ్వులేనీదు పాదాల పువ్వులగును
సమత మమతభావమె నీదు సుమత మగును!
భక్త జనపోష! మారేడుబాకవాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*8
అజ్ఞాన నిశియందు విజ్ఞాన దివ్వెగా
దేవ నీ శివగీత తేజరిల్లు!
కడలేని సంసార కడలి దాటింపగా
భవనీదు పదభక్తి భవ్య నావ!
ఘోరాపదలు ద్రోసి కోర్కెలు దీర్పగా
సాంబ నీనామమె సర్వరక్ష!
దారిద్ర్యమును బాపి దారినోదార్చగా
శివ నీదుసేవయే సిరులవాన!
గీ*
చపలచిత్తాంతరంగిక శత్రుగెలువ
మార వైరి నీధ్యానమే మంచిమందు
భక్త జనపోష! మారేడుబాకవాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*9
మలిన దృక్కులనుండి మరలించి కనుదోయి
కాపాడు కొని నిన్ను గాంచు నట్లు
విషవాసనలెల్ల విడదీసి నిశ్చల
భక్తి భావము గల్గి బ్రతుకునట్లు
ధర్మ బద్ధంబైన ధనదానములు పుణ్య
గుణమచే భాషించి మురియు నట్లు
సమదృష్టి సమభావ సంస్కృతి సంసృతి
సత్యవ్రతంబును సల్పు నట్లు
గీ*
నీ నిరాడంబరత్వంపు నీతిచరిత
తీర్చి దిద్ధును భక్తుల తీరుతెన్ను!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*10
శక్తులన్నిటికాది శక్తియై జగమేలు
పార్వతీ దేవినీ పట్ట మహిషి!
పాపసంచిత తతి రూపుమాపగజాలు
జీవగంగమ్మ నీ చిన్నభార్య!
నిఖిల విఘ్నంబులకీశుడు శ్రీ గణే
శుడు కుమారస్వామి శూరులనగ!
అమరసేనాపతుల్ – సమరదురంధరుల్
తమరిపేరును నిల్పు తనయులైరి!
గీ*
భార్య బిడ్డలింతటివారు ప్రకటితముగ
నింక నిన్ను వర్ణింప నేనెంత వాడ!
భక్త జనపోష! మారేడు బాకవాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*11
దేవ దానవ మూక లేకమై క్షీరధి
మధియింపగా బూన, మంధరగిరి
మునుగకుండగనెత్త కూర్మమయ్యెను శౌరి
వాసుకి కవ్వంపు త్రాడుగాగ
హాలహలజ్వాల తాళజాలక దేవ
దానవాళియు వేడ దరిని జేర్చి
కరుణించి వేగమే గరళంబు మ్రింగియు
కాపాడినావహో త్యాగమూర్తి!
గీ*
అమృతముదయింప దేవతలమరులైరి
రక్షకుడవు బోలాశంకరాయనంగ!
భక్త జనపోష!మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*12
ముల్లోకములలోన కల్లోలముదయింప
భీతిల్లు జీవాళి ప్రీతిగావ!
పృథివి రథముగాగ, విధి సారధిగరాగ
చక్రాలుగా సూర్య చంద్రులమర!
వేదాలు హయములై వెడలగా మేరువు
కార్ముకంబుగ నీదు కరము జేర!
నారాయణుండస్త్రమై రాగ సంధించి
త్రిపురాసురుల జంపి, తిరిగిపుడమి-
గీ*
ధర్మ రక్షణజేసియు ధాత మెచ్చ!
పూజలందిన పురహర! పుణ్య చరిత!
భక్త జనపోష మారేడుపాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*13
తండ్రి యజ్ఞము జూడ దలచి నిన్నొప్పించి
సతివచ్చె, దక్షుండు సరకుగొనక
దుర్మదంబుననిను దూషించె, పిలవని
పేరంటమయ్యె, నీ పేరు దలచి
యాహుతియయ్యె నాయజ్ఞాగ్నిలోయన
వీరభద్రుండవై వెడలి యాగ
ధ్వంసంబు గావించి, దక్షుని తలద్రుంచి
గొఱ్ఱె తలను జేర్చి కోర్కె దీర్చి!
గీ*
పశుపతీయని సురలంత ప్రస్తుతింప-
విడిచి పుచ్చిన పరమేశ! విశ్వనాథ!
భక్త జనపోష! మారేడు బాకవాస!
పాహి నాగుల మల్లేశ! పాపనాశ!
_____
సీ*14
తారకా సురబాధ తాళక లోకాలు
శరణువేడగ విధి కరణి దెలుప
చిలుకతేరిని బంపి, నీతపోభంగమ్ము
జేయనెంచిరి కట! దేవమునులు
పదపద్మమున వ్రాలు పార్వతి నీచూపు
మరుని తూపును గూడి మరులు గొలుప
మందలింపగ దోషి మదనుడెదుట నిల్చె
ఫాలనేత్రాగ్నిని భస్మమయ్యె!
గీ*
పతిని జూచి రతీదేవి పరీతపించ
మరల పతిభిక్ష నిడినకు మారజనక!
భక్త జనపోష! మారేడు బాక వా స!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*15
షోడశ కళల చంద్రోదయ శీతల
కిరణాలు భువి వణికింప జనులు
చలికి సైపగలేక సాగిలబడి వేడ
కరుణబూనియు తుదికళను దీసి
నీజటాజూటాన నీటుగా దాల్చగా
పదునైదు తిథులయ్యె పరగ కళలు
నమవాస్య పూర్ణిమ సమసీతలోష్ణమై
పుడమి భారతజాతి పుణ్య మెసగె!
గీ*
నీదు శిగపూవుగా శశి వన్నెలొసగె!
శాంతి సుఖ జీవనము సాగె చంద్రమౌళి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*16
శంబరాసురభంగ! సాంబ! నిరాడంబ
రా! దయాసాగరా! రాజమౌళి!
ఈశా! మహేశ! బోలాశంకరా! హరి
హరపుత్ర! సుచరిత్ర! గరళకంఠ!
సర్ఫభూషణ! పరదర్ఫనాశన!శూలి! భక్తవత్సల! శరభావతార!
విశ్వ ధర్మ వివేక! విధిశిరశ్చేదక!
భైరవా! జయ వీరభద్ర!రుద్ర!
గీ*
నీదు గిరిసుతా కళ్యాణ లీలలందె!
పావనగృహస్త ధర్మంబు పాదుకొనియె! భక్తజనపోష! మారేడుపాక వాస
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*17
విష్ణు దేవుడు బూని వేయిపూవులపూజ
నిష్ఠ జేయ నొకపువ్వు నీదులీల
దక్కువయ్యెను, లోటు చక్కదిద్ధగతన
కంటిపూవర్పించి గాంచె కీర్తి!
అతని భక్తికి నీవు అందించి నట్టి సు-
దర్శనచక్రంబు ధర్మ రక్ష!
కనుదోయి బెకలించు కన్నప్ప నీముగ్ధ
భక్తికి చిహ్నమై భ్రాంతి వీడె!
గీ*
ఏది నిస్వార్థమో స్వార్థమేదియగునొ
ఎవరు వివరింతురీవేళ ఏది దిక్కు?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*18
ఏడేడు భువనంబు లేలు తండ్రివి పోటి
పడినీదు తనయులు పరుగులిడిరి
శిఖి వాహనుడు మూసిక వాహనుని మించె
నీకుక్షిగతలోక నివహమెంచి
తాప్రదక్షణజేసె – తమ్మునో డింపగా
ఎటు వెళ్ళినా ముందె యెదురు వెడలె
కార్తికేయుండన్న గాంచి యచ్చెరువొందె!
సిద్ధి బుద్ధులు పొందె పెద్దకొడుకు!
గీ*
నిఖిల లోకాలు కీర్తించె నీదుకరణ!
గణవినాయకుని ఘనత గణనకెక్కె!
భక్త జనపోష! మారేడుపాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*19
పాశుపతము గోరి పార్థుండు ప్రార్థించి
తపము బూన నెఱుక దంపతులుగ
వెడలి పరీక్షగా – వేడ్క కవ్వింపగా
ఫల్గుణుండు మాయపంది నేసె
నాది వేటని వేటునాది చోటనియట
ద్వంద్వయుద్ధము సాగు చందమందు
విపులాస్త్ర శస్త్రాలు వికలమై నరుడంత
నెదను నిల్చిన నీమూర్తి నెదుట బోల్చె
గీ*
పదములంటె వివ్వచ్చుండు – పాశుపతము
బొందె జగదంబ దీవింప జగతి బొగడె!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*20
కైలాస గిరిపైన కమనీయ మందార
మూలంబు నురురత్న ముకుర పసిడి
సింహ పీఠమున భాసిల్లు నీవామ
భాగమమందున కాత్యాయినుండ
మధ్యన బాలకుమారుడు నిలువసో
మాస్కంధమూర్తివై మహిని వెలసి
జీవజాలము నెల్ల దీవించి పాలించు
దివ్య మంగళమూర్తి దీన బంధు!
గీ*
సర్వ లోక శుభంకర! శర్వ! భర్గ!
సకల శాంతిప్రదాత! విశ్వాత్మతేజ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*21
పద్మపీఠంబున ఫణిభూషణాలు, వి
భూతిరేఖలు దాల్చి పుడమి జీవ
కారుణ్యమూర్తివై కాంక్ష లిచ్చియు పాద
దాసుల నేలు సుఖాసనేశ!
మంగళప్రద మహాలింగ మధ్యమునందు
ప్రభలుచిందే ఏకపాదమూర్తి!
మును విష్ణు, విధియు నీమూల కంబాద్యంత
ములుదేల్చ వెనుదిర్గి మ్రొక్కి నిలువ
గీ*
మునుల సంశయములు దీరె ముక్తి దాత!
దక్షిణామూర్తి లీలావతార! శరణు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*22
పార్వతీ దేవి తపస్సుచే మెప్పించి
సగమేను బొంది నీసరస జేరె!
నాటినుండియు నర్ధనారీశుడను నామ
ధేయంబు దాల్చితో దేవదేవ!
ఋషులగావగ దివ్య వృషభ వాహన మెక్కి
దీప్తాగమనిధి బోధించినంత!
ప్రణవమేవృషభమై ప్రభవించెననియెంచి
నినుగాంచి నిశ్చల చిత్తులగుచు-
గీ*
-నిఖిల భువనేశ! వైరాగ్య నిధివి నీవె!
యనుచు మునులు కీర్తించిరి మురిపె మలర!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*23
శ్రీకర పాద రాజీవ! చరాచర
జీవజీవదాత! దివ్యతేజ!
అంబరాంబర భవ! అంభికాధవ! శివ!
అంబుధీషుది! ప్రభూ! త్ర్యంబకేశ!
దూర్వాహవాహన! దూర్జటీ! దుర్గేశ!
సర్వేశ! సర్వజ్ఞ! శర్వ! భర్గ!
హరిహర! స్మరహర! హరిశర! పురహర!
గిరిధన్వ! గిరిప్రియ! గిరిసుతేశ!
గీ*
కువలయానందకరధర! కువలయేశ!
ఉగ్ర యుగ్రదృగాయుధ! యురగహార!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*24
శైవులంతా నిను శివదేవుడని గొల్చి
సంతసింతురు మది చింతదీర!
వైష్ణవులందరు – విష్ణురూపుడవని
పూజింత్రు తమజన్మ పుణ్యమనుచు!
సగుణ నిర్గుణ సదుపాసనలు సాగింతురు!
బౌద్ధజైనములందు బరగు చుంద్రు!
అల్లదే నీకంఠమల్లనేరడి బోలు!
నల్లనీ కన్నయ్య నటన బోలు!
గీ*
మదికి సమ్మతమైనట్టి మార్గమందు
విశ్వమజ్ఞాత శక్తిగా విశ్వ సింత్రు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*25
దండిభక్తి నియమ ధర్మంబు మార్పించ
జాలె మార్కంఢేయ బాలకుండు!
సిరుల భ్రాంతిని బాపె సిరియాల చరితంబు!
కన్నప్ప కనుదోయి కాన్క జేసె!
గొడగూచి నినుగాంచి గోప్యంబు సాధించె
మల్లమ్మ నీభక్తి మార్గమెరిగె!
కాకతీ రుద్రమ్మ కాంక్షలీడేరగా
సామ్రాజ్ఞియై నిన్ను సన్నుతించె!
గ*
నమ్మికొలుచు వారికి మోక్షంబు నొసగు
శంకరుడవు సద్భక్త వశంకరుడవు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*26
ఒడిలోన గౌరమ్మ జడలోన గంగమ్మ
మెడలోన నాగన్న మెఱుగులీన
తొడపై కమారుడు కుడిప్రక్క గణపతి
కడువేడ్క ప్రమదాది గణము లెగుర
హాలాహలాధర! శూలాయుధకర!హే
శంభోశుభంకర! శరభ శరణు!
శరణంచు లోకముల్ చరణాలపై విరి
వర్షంబు గురిపింప హర్షమొదవ
గీ*
కొలువుదీరియుందువు వెండి కొండపైన
సేదదీర్చగ నామది చేరరమ్ము!
భక్త జనపోష!మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*27
అణువు,పరమాణువులను విభజించియు
భూతదర్పణమున జూడనగును. ఆత్మను విభజించి పరమాత్మ తేజము
జ్ఞాననేత్రమున గాంచదగును
సకలశాస్త్ర జ్ఞాన సారాంశములనెల్ల
సద్గురు కృపచేత చదువనగును
నీతి సత్యవ్రతాది నియమ జీవనమెల్ల
సజ్జన మైత్రిచే సఫలమగును
గీ*
భూతదయాధర్మ పూర్ణగతుల
సూక్ష్మమెరగించు నీభక్తి సూత్ర సూక్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*28
పర్వతుండర్చించి సర్వతీర్థ క్షేత్ర ములతోడ తలనుండ-ముదముజెందె
వాగీశు మెప్పించి వసుమతియనుకన్య
శ్రీ యని పేరొంది చెందెముక్తి
శ్రీ కన్నెపేరట శ్రీశైలమని జనుల్
పిలువ సాగిరియాత్ర ప్రీతిగొలిచి
మల్లెమాలలు ప్రొద్దు మాపునీకర్పించి
చంద్రవతీముక్తి జెందెనంత!
గీ*
మల్లికార్జున నామంబు మహిని వెలయ
వేడ్క భ్రమరాంభతోగూడి వెలసి నావు!
భకాత జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*29
ఘుశ్మ భక్తకిమెచ్చి ఘుశ్మేశ్వరుండవై
వెలసితివాయమ్మ వేడుకొనగ
సవతినుండి సుతురక్షణజేసితోదేవ
భక్తజనుల భ్రోవు భవ్యచరిత!
భీమకుడనురాజు భీకరతపమాచ
రించికోరగ వరమిచ్చి మెచ్చి
భీమానది తటిని భీమశంకరుడవై
వెలసితివో స్వామి ప్రేమమీర!
గీ*
గౌతముండువేడగాకడు గారవించి
తరలి వచ్చియు వెలసితో త్రంబకేశ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*30
విశ్వ వందిత శివ! వింద్యుండు తనపైన
నెలవుండ వేడగా నిరతమచట
నోంకార చక్రాన నోంకారనాథుండ
వై వెలసితివహో! వామదేవ!
శాపగ్రస్తుండైన చంద్రుడారాధించి
మృత్యుంజయా మంత్రమును జపించ
పార్వతి సతిగూడి ప్రత్యక్షమై కృష్ణ
శుక్ల పక్షములిచ్చి శుభము గూర్చి
గీ*
సోమనాథేశ్వరుండను నామమలర
పుడమి చీకట్లు బాపిన పుణ్య చరిత!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*31
దారుకా వనమందు-దారకు వధియించి
సుప్రియు రక్షించి సుస్థిరముగ
నాగనాథ స్వామి నామంబు వెలయంగ
భక్తుల దరిజేర్చు ముక్తిదాత!
దూషణాసురబాధ దూరంబు జేసియు
నుజ్జయిని జనుల నూరడించి
కరుణ జూపియు మహాకాళేశ్వరుండవై
వెలసితివో ప్రభూ వేదవేద్య!
గీ*
నరుడు నారాయణుడు గొల్వ నయమొసంగి
దాస జనుల రక్షించు కేదారనాథ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*32
వారణాసినదుల వరసంగమ స్థాన
మందు విశ్వేశ్వర స్వామి వగుచు
అన్నపూర్ణయు విశాలాక్షి దేవేరుల
తో వెలసితివి సంతోషమెసగ
విశ్వనాథానీవు నిందుప్రకాశింప
కాశియయ్యెను వన్నెవాసి గలుగ
లోలార్క కేశవాదాలయంబులు పంచ
గంగాది ఘట్టముల్ గలవు నందు
గీ*
దోష రహిత నమానత్వ దోవ సాగు
నట్టిదగు మణికర్ణికాఘట్ట కీర్తి
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*33
దైవగృహముజేరి రావణుండర్పించె
తలలు తొమ్మిది కోర్కెతగుగ దీర్ప!
నతని తలలు వేగ నతికించి నావట
వైద్యు డతికినట్లు వైద్యనాథ!
రామచంద్రడు జంపె రావణబ్రహ్మను
బ్రహ్మహత్య పాప హరముగాగ
మహసంద్రముల సంగమస్థానమున
ఆర్తి పూజించె నాపుణ్య మూర్తి పేర-
గీ*
రామలింగేశ్వరుండవై రామనాథ –
మండలమునందు వెలుగొందు దండిదేవ!
భక్తజనపోశ! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*34
శ్రీ కాంచిపురవాస! ఏకాంబ్రనాథేశ!
జంబుకేశ్వర! చిదంబరేశ!
ఓప్రభాస క్షేత్ర సోమనాథేశ్వర!
పార్వతీ ప్రాణేశ! భాసురాంగ!
అరుణాచలేశ్వర! కరుణాల వాలశ్రీ
కాళహస్తీశ! నేపాలదేశ-
పశుపతినాథ! ప్రభాకర ప్రత్యక్ష –
మూర్తివై విలసిల్లు సూర్యలింగ!
గీ*
అష్టమూర్తి స్వరూపివై శిష్టజనుల
కష్టములు దీర్చి బ్రోతవభీష్టమొసగి
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*35
శ్రీ ధనాధిపమిత్ర! శ్రీ ధర ప్రియ! జటీ!
పశ్యల్లలాటి! కపాలి! శూలి!
పరమ పావన గాత్ర! భక్తావళీ స్తోత్ర!
సురమౌని వరనుత! సుగుణభరిత!
ఓత్రిలింగా! త్రినేత్ర! త్రిమూర్తులవెలుగు
ఓంకార దీప! గీతోక్తి రూప!
శిష్ట రక్షక! దుష్టశిక్షక! విశ్వేశ!
జీవజీవనదాత! ధీసమేత!
గీ*
అప్రమేయ ప్రభావ! దివ్యప్రకాశ!
ఆత్మ లింగ స్వరూప!జీవాత్మ తేజ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*36
ఎముడాల రాజరాజేశ! మంత్రపురని
వాస! కాళేశ్వర వాస! ఈశ!
ఓదెల మల్లేశ! పుష్ఫగిరినివాస!
ఐలోని కొమరెల్లి యాదిదేవ!
పాపనాశేశ్వరా! లేపాక్షి శ్రీ విరూ
పాక్ష! సర్వేశ! పంపాంబ నాథ!
ఓరుగల్లు స్వయంభూనాథ! రామప్ప
దేవళంబున వెల్గు దివ్య తేజ!
గీ*
కోర్కెలీడేర్చు పరకాల కుంకుమేశ!
ప్రేమమూర్తి దాక్షారామ భీమలింగ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*37
శ్రీ కాలహస్తులు చిత్తంబు నర్పించి
సాయుజ్యమును బొందె సంతసమున
నీయంశ జన్మించి నిండుతేజమనొంది
పవనపుత్రుడు రామభక్తి దేలె
సౌజన్య శ్రీ రామ చంద్రుండు నినుగొల్వ
రామలింగేశ్వర నామమలరె
పార్వతీ వేడగాతారక మంత్రోప-
దేశంబు జేసిన దేవదేవ!
గీ*
తెల్పు! తరతమహృదిబేధ తెగులు మాని
మూఢ విశ్వాసమను వీడిమురియు విధము!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*38
గజరాజు ప్రతిరోజు నిజభక్తి నినుజేరి
దోషి వేసినరాళ్ళు త్రోసివేసి,
జలపత్ర పుష్ఫపూజలు జేసె ఫణిరాజు
మణి పూజలను జేసి మలినమూడ్చె!
ఆకు లలములు చీకాకుగొల్పగ దాగి
కాళము కరిరాజు కరము దూరి
కుహరమందు దిరిగి కుంభస్థలము మీటి
కడుబాధ గలిగించె కడకు హస్తి! గీ*
తొండమును మడిచి ఢీకొనె కొండ శిలను-
కళ హస్తుల జీవాత్మ గలిసె నిన్ను!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*39
చేయదగని తప్పు జేయగా సాగెను
యాజ్ఞదత్తుడు తండ్రి యాజ్ఞమీరి
ధర్మకర్మలు వీడి దుర్మార్గుడై చెడి,
కడుపాపములు సల్పె కావరమున
చోరుడై శిగపూలు గోరి కోవెల జేరి
శివరాత్రి వైభవ శ్రీని గాంచె!
పరవశించెను పాప ప్రక్షాలనగాగ
పావనుండై వెల్గె ప్రమథులందు!
గీ*
యముడు నినుజేరి శివరాత్రి మహిమ దెలిసి
భటుల శాశించె నిజభక్తి పరుల విడువ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*40
విష్ణుండు గీతను వినిపించె లక్ష్మికి
పరమేశ్వరా! నీవు పార్వతికిని
వివరించితివి గీత విశ్వాత్మ గుప్తార్థ
విషయ సూత్రంబుల విషదపరచి
జీవులన్నిట నీవె! జీవులు నీలోనె
నిలువగా ధర్మంబు నిలుపు విధము!
లేనివాడవు లేమి లేని వాడవు నమ్మి
కొలుచువారల యాత్మ కొంగు పసిడి!
గీ*
సకల లోకరక్షక! జీవసర్వమీవె!
సర్వమునకు వేరైయుండు సాక్షి వీవె!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*41
అందమైనది యాత్మ నింద్య దేహములందు
దాగియుండును దండ దారమట్లు!
ఆత్మ నాశనమొందది దేహములు మార్చు
మలిన వస్త్రంబులు మార్చి నట్లు!
ఆత్మ యద్ధము మాయ యనుదుమ్ము పేరగా
మనిషి గానక దాని మరచి బ్రతుకు!
ఆత్మ నెఱిగినంత నజ్ఞాన నిశివీడి
విజ్ఞానియై జ్ఙాన నిధినిబొందు!
గీ*
ఆత్మ చైతన్యమే పరమాత్మ జేర్చు-
రీతి బోధించు గీతోక్తి నీతి సూక్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*42
దీక్షతో తత్ఫలాపేక్షలేకను బూను
కార్య ఫలత్యాగి – కర్మయోగి!
వేదబోధల నాత్మ ఖేదబేధాలుడిగి
యానంద మగ్నుడౌ జ్ఞానయోగి!
సర్వస్వమును వీడి శరణాగతిని వేడి
ధర్మవర్తనుడగు ధ్యానయోగి!
సజ్జనావళి బొగడ సర్వత్ర నినుగాంచి
ప్రాకటముగ గొల్చు భక్తి యోగి!
గీ*
నీతినియమంబు, నిస్వార్థ నియతి సాగు
కర్మ సన్యాస యోగికి కలుగు ముక్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*43
చెట్టు పుట్టల జారి మిట్టలోయల దారి
వాన నీరంత కాల్వలుగ జేరు!
సాగు నదులు పారి సాగరానగలియు
పగిది యభిరుచిని బట్టి ప్రజలు
కర్మ భక్తి జ్ఞాన మార్గంబులను సాగి
పరమ పద ప్రాప్తి బడయ గలరు!
దమము దానము దయా ధర్మాచరణ నిత్య
కర్తవ్యముగ దీక్ష గలిగి – హృదయ-
గీ*
-దుర్భలత్వంబు వీడిన నిర్భయుండు
తుదకు భవబంధ మోక్షంబు పొందగలరడు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*44
నాది నేనను వాదు నయవంచనకు పాదు
మాయలోబడు మది మరొక తీరు!
తామసంబున త్రాడు పామని భ్రమపడు
భవబంధముల కట్టు బానిసగును!
కామాదులను జిక్కి కాలంబు వృధపుచ్చు
కల్ల నిజంబని కలత జెందు!
భోగాల తెట్టెలో రోగాల పుట్టగా
తులతూగి చావు పుట్టుకలు పొందు!
గీ*
అంతరాత్మ గుర్తెరిగినా సంతసంబు
నొప్పు పరతత్వమెఱిగెనా-ముప్పుదప్పు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*45
బుద్ధి శుద్ధియు ధైర్య వృద్ధితో నిస్వార్థ
మొదవు! రాగద్వేషముడిగి పోవు!
సాత్వికాహార విహారంబు సల్పిన
చిత్తమేకాగ్రత జెందు చుండు!
వగమాని తగ మనో వాక్కాయ కర్మల
ధ్యానయోగాది సాధనలు జేయ!
మమకారహంకార మాయభ్రాంతిని వీడ
సంపూర్ణ వైరాగ్య సంపదెసగు!
గీ*
చిత్త శాంతి గలిగిన విత్తభ్రాంతి దొలగు
సచ్చిదానంద బ్రహ్మ సాక్షాత్కరించు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*46
నీతత్వమే శివ గీతార్థసారమై
జన్మ శోకము మాన్పె జగతి మురిసె
పంకజ పత్రమున్ పంకమంటనియట్లు
పాపమంటదు గీత బాటసాగ
జాతిసమైక్యత, జనులసఖ్యత గుండె
బలముచే బ్రతుకు సఫలత గలుగ
అమృతము సుంతైన నమరత్వ మిడునట్లు
గీతాసుధాశ్రోత కిచ్చు ముక్తి!
గీ*
నీతిబాటను ద్వంద్వమతీతుడగుచు
బ్రతుకు నరు సుస్థిత ప్రజ్ఞ ఫలము ముక్తి!!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*47
జగమేలు జోగి నీనగలేమొ నాగులు
చెవిని తాటంకంబు జడలకొప్పు
వల్లకాటేలిక! వలువేమొ పులితోలు
పాత్రకపాలము నేత్రమగ్ని
చేతశూలము వూత, చెల్వబూడిదపూత
చేదుచేరిన గొంతు పేద చరిత
తెల్పినా పార్వతీ వలచినీ సతియయ్యె
నందివాహన సదానంద మూర్తి!
గీ*
నీనిరాడంబరత్వంబు నిచ్చు తృప్తి
దర్ప రహిత మమ్మేలు కందర్ఫ జిత్తు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*48
కాసున్న చుట్టాలు కాకున్న కష్టాలు
కాసుదే తిరకాసు కలియుగాన
కాసుతో పన్నీరు కాసుతో కన్నీరు
కాసుతో సెహబసు-కళలరేసు
కాసుకోసము శ్రమ కాసుకోసము భ్రమ
కాసుకోశముపైన కలుగు ప్రేమ
కాసుల పేరుకే కాసంత మరియాద
కాసు గలగకయున్న కార్యహాని
గీ*
పెళ్ళి యప్పుదీర్చ కుబేరుపేర వడ్డి
కాసు చెల్లించవలె శ్రీనివాసుడైన!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*49
ధరను బేపారియు కరువు లాభముగోరు
అధికారి లంచంబులడుగగోరు
దండి దొరయు గోరు దండుగ మెండుగ
ప్రజ గోరు పొరుగింటి పచ్చగూర
ఆటు పోటు రుజల నథమ వైద్యుడు గోరు
పితృయాజ్ఞికుడు గోరు మృత్యువార్త
పోయినోళ్ళ మరచిపోవ గోరు ననాథ
నక్కగోరు దినమొక్క శవము
గీ*
శూరుడు తగిన వారితో పోరుగోరు
బ్రహ్మముదమై ముముక్షువు భక్తి గోరు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*50
పనిలేక పరులింట తినియుండటము చేదు
పరువు దీసెడు మాట బడుట చేదు
తనయిల్లు ఇల్లాలు దలపకుండుట చేదు
చదవక పొరుగూరు జనుట చేదు
అప్పు పప్పుల కూటి గొప్పజూపుట చేదు
పరసౌఖ్యమునకీర్ష పడగ చేదు
పిలవని పేరంట విలువలెన్నుట చేదు
అల్పునితో సర మాడ చేదు
గీ*
బలరహిత జీవుల పగటి కలలు చేదు
భక్తి నీతి ధర్మము లేని బ్రతుకు చేదు
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*51
పిశినారి యాచించి పిదపదిట్టుట తప్పు
విననివానికి దెల్పు విధుల ముప్పు
పొట్టదల్పని కొల్వు పోటిసేవలు దప్పు
బలదర్పితునకెదురు బలుక ముప్పు
కఠినమతి తెలిసి కపటమైత్రియు తప్పు
మద్యపాయిని నమ్మి మనుట ముప్పు
కొంచగాని ననుసరించి తిర్గుట ముప్పు
నీతి రహితు వాదరీతి ముప్పు
గీ*
విడక కపటనాస్తికుల వెంట నడక తప్పు
క్రూరుడైయున్న నీభక్తి గూడ ముప్పు
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*52
ఊళ్ళు దోచియు నిన్ను పూజించి సంతర్ప
నలుజేయు నరుడు పుణ్యాత్ముడగునె?
చెర్లుబుంగలు బుచ్చి – చేపదిండిని బంచి
దాతగాప్రకటింప ధన్యుడగునె?
గుళ్ళుగూల్చియు కొన్ని రాళ్ళేరి మాచమ్మ
గుడిగట్టిప్రకటింప గొప్ప యగునె?
పండ్లతోటలు గొట్టి బండ్లుపుర్మాయించి
వంటచెఱుకు బంచ వంద్యుడగునె?
గీ*
కొలది పుణ్యంపు ముసుగున ఘోర దురిత
ములను, చేయు మూఢమతికి ముక్తి గలదె?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*53
ఉదధిలో విషంబు నద్భవించినయట్లు
కర్మసాక్షికి శని గలిగి నట్లు
చందమామకు మచ్చ సంక్రమించిన యట్లు
పరగదేవేంద్రుని పదవి యట్లు
పూవు చాటున ముల్లు పొంచియుండిన యట్లు
మల్లె పందిరి త్రాచు మసలి నట్లు
వెన్నపూసకు జిడ్డు వన్నెలాడికి గజ్జి
కస్తూరిలో పిప్పి గలిగి నట్లు
గీ*
దండి యజమాని చెంతనె కొండె గాడు
క్రియల సంబంధితుల కెల్ల కీడు సేయు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*54
మాయికుండు మరియమాయకుండైనను
చాడికోరును నమ్మి చెడుట కద్దు
పాపదోషంబని పరిశీలనము లేక
కొండెగాడు మిత్రు కొంప ముంచు
కుక్కతోక వలెను చక్కబడక బుద్ధి
పట్టుగొమ్మను గొట్టి పడియు లేచు
ప్రాయశ్చిత్తము జేయ పట్టించుకొనడంత
కంతకు తనబుద్ధి నధిగమించు
గీ*
దుష్టు వర్జించి దుర్జన దూరమైన
సజ్జనులమైత్రి నార్జింప చాలమేలు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*55
నాల్క తీపి కపట నాటక బూటకం
కల్లలాడుచు నుండు కపట బుద్ధి
వేషబాషలు మార్చి మోసగించుట నేర్చి
కడుదోషములు జేయు కఠిన బుద్ధి
ధనముచే నధికార దర్పంబుచే సాగి
నయ వంచనలు జేయు నాపబుద్ధి
పనికి వంగక దొంగ పనికి బెంగయులేక
పాటిదప్పియు చను పాపబుద్ధి
దానవులబుద్ధి కొందరు, మానవులకు
నిచ్చి యాడింతు వేలనో నీలకంఠ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
55* నాల్క తీపి కపట నాటకబూటకం
కల్లలాడు చుండు కపట బుద్ధి
వేషబాషలు మార్చి మోసగించుట నేర్చి
కడుదోషములు చేయు కపట బుద్ధి
ధనముచే నధికార దర్పంబుచే సాగి
నయవంచనలు చేయు నాపబుద్ధి
పనికి వంగక దొంగ పనికి బెంగయులేక
పాటి దప్పియు చను పాప బుద్ధి
గీ*
దానవులబుద్ధులు పుడమి మానవులకు
ఇచ్చి యాడింతు వేలనో నీలకంఠ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*56
కపట బుద్ధులకన్న కడుమేలు మూఢము
మూఢ భక్తిని మించు ముగ్ద భక్తి
మాయిక భక్తుడ మాయకులను భక్తి
పేరట వంచించు పెంచునాశ
భీతివీడియు పాప భీతినటించియు
మలినదేహ సుఖాల మరగువాడు
భయము వీడియు మైత్రి భావంబు దిగనాడి
నమ్మిన వారికి వమ్ము జేయు!
గీ*
నింక నేరీతి నిభక్తి నెగడు భక్తి
జాతీయత మదిని పాదు కొనును
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*57
సప్తవ్యసన పంక్తి గుప్తమై పైశున్య
గుణము మనములోన గుణకమగును
తాను దినక పైగ తన వారి దిననీక
నితరేతరుల తిండి నిచ్ఛగొనక
చిన్నినా కుక్షికే శ్రీ రామరక్షను
వారి సైపక జేయు వరుస నింద
పొదుపు పేర పిసిని గొట్టుతనకుతానె
జబ్బజరుచుకు వాస్తవము గనడు
గీ*
చెల్లి చెల్లని బ్రతుకునే వెళ్ళదీయు
మనుజులీమాయలో బడు మర్మమేమి?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*58
పోవునాడి సుమంత భూమి వెంటను రాదు
బహుళ సంపద పరభాగ్యమునకె
పుడమిని ప్రకృతియు పొందు వికృతి సృష్టి
రయముదాకనె సుస్థిరంబు పిదప
పిల్ల పాపలు యిల్లు నిల్లాలు నతిమూల్య
వస్తు సంతతి యాస్తి వసుధ వీడి
కీర్తి కేతన హేతు క్రియాత్మక సుకృత
ధన సంచితము గొని దలలి పోవు
గీ*
శాశ్వతాశాశ్వతము లెంచి శాశ్వతంబు
వెంట సాగిన యవితన వెంటసాగు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*59
నేను నీవను బేధమే తాను ధర్మంబు
దప్పి జనగ రాచదారి యగును
నేనను స్వార్థంబు నేరుగా గర్వమై
బుద్ధినాశన హేతు భూతమగును
నాది నీదను బేధ వాదు సమైక్యత
లోపకారణమగు లోకమందు
నాదను స్వార్థంబు నాత్మీయతనుగాల్చి
శోకకారణమగు సొమ్ము బెంచు!
గీ*
నేను నేనన్నదే గొప్ప నేరమగును
నాది నాదన్నదే ఘోర నరకమగును
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*60
సంసార సాగర సంగమ తీరాన
గులకరాళ్ళను బోలు కోర్కె లెగయు
ఆశ జలముగాగ నంతరంగతరంగ
ములు కామ క్రోధాది మోహఝరులు
తలిదండ్రి తనయాలి తనయాలి బంధముల్
సుడిగుండముల బోలుచుండు నిందు
సంతాన సహజన్మ సంతానములు జూడ
నురుతర జలజంతువులను బోలు
గీ*
బ్రతుకునెదురీతలో దేల్చి భద్రముగను
భక్తి నావలో మముముక్తి పదము జేర్చు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*61
చేరబిల్చియు నీతిజెప్పు వారలె గాని
చేసిచూపరు తమ చేతలందు!
చూపినంతనె వేడ్క దూరముందురుగాని
చేయువారల చెంత జేర రారు!
గురుబోధ పై గురి కుదురునందాక
సాధన జేయరు సహనమొప్ప!
అంతరాత్మయు చేతనత్వంబు గనుదాక
తనువు సుఖేచ్ఛల తలపు విడరు!
గీ*
చిత్తశుద్ధి బడయలేని శిష్యమూక
సద్గురుని యడ్గు జాడల సాగు నెట్లు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*62
మెఱుపు దీపంబని-మేఘంబు గొడుగని
పందిరిల్లని దల్ప ఫలితమేమి?
ఎండమావిని జలముండునా? నేతికై
నేతిబీరను బిండ నేమి ఫలము?
కలనిజమా? కత్తి తలగడయీ? కంతి
బలుపా? వేశ్య యిల్లాలు యగున?
ఎరువు సొమ్ములు సొంత మెట్లగు?చింతతీ-
రికగాదు! చెడు నాగరికము గాదు!
గీ*
జగతి చదవంగడిగొనెడు సరుకు గాదు!
కదలు మదికి నీదగు భక్తి కలుగ బోదు! భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*63
పూటకూల్ల గృహము పుణ్య సత్రము గాదు
పేరాశ దోషంబు ప్రేమ గాదు
ధనకాంక్ష జూదంబు ధర్మచింతన గాదు
జారత్వపు తెగువ జాడ వేరు
అల్పసంతోషము స్వల్పాధికారమై
కటుచిత్తునకు దయ కలుగ బోదు
వినకున్న బదిరుండు విధిగా తలను వూపు
కనకున్ననంధుడు కలసి నవ్వు!
గీ*
తగిన రీతి తనివి దీర్చు తదితరాల
నీదు భక్తితోడై సాగ నిచ్చు ఫలము!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*64
ధనహీనుడై దాన ధర్మంబు దప్పక
నోపినంతయు జేయు గొప్పవాడు
బలహీనతయు గల్గ బాధ్యత వీడక
కడదాక శ్రమజేయు కర్మయోగి
భోగియై రోగియై పొందిన యనుభవ
సారంబు బోధించు సాధకుండు
సంసారమును మోసి సంతానమును రోసి
చతికినా జంకడు సహనశీలి
గీ*
దీపముండగ నిలుదిద్ధి తీర్చు కొనెడు
సూత్రమే భక్తి జీవన సూక్తి యయ్యె!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*65
పస్తులుండెను పేద వస్తాదు పనిలేక
పిలిచి మీసము దువ్వె పిరికి లోభి
నిండుకొప్పిడ తైలముండదు విరబోయు
బొండుమల్లెలదండ బోడితలకు
భారితటాకముల్ బావురు మనియుండ
మురిగుంటకు రాతి ముకుర కట్ట
పరగనిల్లాలికి పసుపుతా డేగతి
పడుపుగత్తెమెడకు పసిడి నగలు
గీ*
ఖరము మేలయ్యె తురగము కన్న నేడు!
నాగరికమయ్యె తత్కాల నటన బ్రతుకు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*66
విరిదేనె పాదున విషముష్టి పెంచిన
సహజ చేదుగుణము సడల బోదు
కాకియీక నలుపు కడుగ తెలుపుగాదు
కుక్కతోకకు వంక చక్కబడదు
పంది బురద మెచ్చు పన్నీరు నొప్పదు
దుష్టబుద్ధియు మంచి నిష్ట పడదు
మాయికుండు భువి నమాయకు వీడడు
మూఢమతి వెనక ముందు గనడు
గీ*
నీతిబోధలు బూడిద నిడిన సెంటు
భయము భక్తియె మూర్ఖుల పాలి వరము
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*67
మధువు,మగువమత్తు, మాటికి ధూమపా
నపురిమ్మ జూద, ధనాశ, వేట
బొంకు,లోభము లేడు బోలు దురలవాట్ల
వారు నాదమరచి వాస్తవంబు
పరికింపరు, నెదుటి పిరికిగా నెంతురు
పరనిందచే తృప్తి పడగనెంత్రు
పరమేలు గన నీర్ష పరసొమ్ములనప్రీతి
అహరహము నహంబు నిహసుఖంబు
గీ*
అంతరంగశత్రువు లారు వంతపాడ
నిను చులకన జూతురో నీలకంఠ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*68
ఆపేక్షయే మనుజు నవలక్షణము లోభ
గుణమె లోపము నీర్ష గొనగచేటు
ఉన్నంతలో తృప్తినొంది పరోపకా
రముజేయుటే పుణ్య వ్రతము, పృథ్వి
దానధర్మమె నేటి తపమందురు బుధులు
సత్య శీలమె మానవత్వ సూచి
మంచి, మర్యాదలే మణిభూషణంబులు
శాంతగంభీరమే సత్త్వ దీప్తి
గీ*
విద్య సుస్థిర విత్తము విశ్వమందు
కీర్తినిధి వారసులకిడు స్ఫూర్తియగును
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*69
మౌనిమూగయగునె మంచిమన్నన శాంతి
బాటలు కొరగాని మాట లగునె?
నీతిదూరుని మాట నీతియై ధరజెల్లు
టొప్పునే? క్రూరుండు గొప్పయగునె?
శూరుండు ధర్మ విచారంబు లేకను
సాగిన సత్కీర్తి సాంద్రు డగునె?
నిత్య సత్య వ్రతుని నిందింపగానేల?
తేజస్సు గలవాని తెగడ నేల?
గీ*
మిత్రుడైన తప్పునుతప్పె, , శత్రువైన
సద్గుణంబులు కీర్తింప జాలవలయు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*70
మొసలినోట మణిని వెసదీయగావచ్చు
పొంగు కడలిదాటి పోను వచ్చు
పామును మాలగా పరగదాల్చగ వచ్చు
నంకుశమున కరి నణచ వచ్చు
నిసుకబిండి చమురు దీసికొనగ వచ్చు
యెండమావి నీరు నుండవచ్చు
ఎందేని దిరిగి కుందేటి కొమ్మును పొంద
వచ్చు గగన విరి గాంచ వచ్చు
గీ*
వజ్రమును వజ్రమున గోయ వచ్చు గాని
మనుజ యత్నంబులను మూర్ఖు మార్చ లేము
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*71
తమకార్యములు వీడి తదితరు కార్యముదీర్చు
వారలుత్తములుగా వరలు చుంద్రు
తమకార్యముల వెంట దరలి పరోపకా
రము సల్పువారు మధ్యములు ధరణి
తమకార్యములకై నితరకార్య భంగంబు
జేయువారధములు, చేయునట్టి
పనిలేక రిత్తగా పరకార్యము జెఱచు
వారినేమనదగు వరసదెలియ
గీ*
వశమె మాకు, తద్వచనంబు విషదపరచు
నిత్య నిర్మల! సర్వజ్ఞ! నిర్వికల్ప!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*72
పనసపండు తొక్కపై నెంత గరుకైన
లోనతీయని తొణలొలుకు నట్లు
మేల్గోరి తిట్టియు మేల్కొల్పు గురువుల
గుండెలోతున ప్రేమ నిండియుండు
జిట్రేగు తొక్కపై జిలుగు రుచులె లోన
కరకు బీజము నాల్క గరచుచుండు
నట్లు, నవ్వుతు చెప్పు నరులనాల్క తీపి
హృదిలోన కపటంబు నొదిగి యుండు
గీ*
తరచి చూచి గమ్యము జేర తారతమ్య
మెరిగి, వర్తింప ధరలోన మేలు గలుగు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*73
తలవెంట్రుకలవలె కలిగి తొలగె మైత్రి
బొమ్మవెంట్రుకలను బోలు మైత్రి
మొలవెంట్రుకలవలె తొలగింపబడు మైత్రి
పుడమి నరులయందు మూడు గతులు
కుజన మైత్రిని జూడ నుదయకాలపు నీడ
మొదట గొప్పగదోచు పిదప గురచ
సుజనమైత్రి విధము జూడ మధ్యాహ్నపు
నీడగా క్రమవృద్ధి నిగ్గుదేలు!
గీ*
పాపభీతి, నిష్కపటంపు భక్తి గలుగ
నీతి నిష్కామ్యకర్మ ఫలితము బొందు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*74
బలములేకను బుద్ధి బలముచే కుందేలు
సింహరాజును మోసగించి చంపె
పొంచిన తోడేలు గాంచి గాడిద కాలి
ముల్లుదీయగ దన్నె ముఖము బగుల
నక్కకు జిక్కి మై నానలేదని కాలు
సడలింప తాబేలు మడుగు జొచ్చె
మోసపోయిన కోతి మొసలి కోరిన గుండె
మరచితినని చెట్టు మరల యెక్కె
గీ*
పంచతంత్ర నీతుల బుద్ధి బలమెబలము
ధనము లన్నిట విద్య ప్రధాన ధనము!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*75
విద్యనేర్వగ సుఖనిద్ర దలపరంత
నాకొన్న నంబలి యమృతసమము
పరుడు బాంధవుడని పరికింపడు క్రోధి
కామాంధునకు సిగ్గు కలుగ బోదు
సాధకుండు పనుల సాధింప బూనిన
పట్టుదలను విడిచి పెట్టకుండు
క్షుధితుండు, యుక్తమయుక్తంబు దలపడు
బాధ నోర్వక దిట్ఠు భక్తుడైన!
గీ*
నిద్ర సుఖమెఱుంగదు వచ్చి నిలువ నీదు
కఠిన భూసెజ్జ పూసెజ్జ కరణి దోచు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*76
విద్య భూషణమగు వినయవిధేయత
ధీవివేక సొగసు దిద్ది తీర్చు
విద్యచే విత్తంబు – విత్తంబుచే విశ్వ
భోగభాగ్యములెల్ల పొందునరుడు
విద్యచే సుగుణాలు వికసించు సుఖశాంతి
కలుగు బ్రతుకు బాట వెలుగు కీర్తి
విద్య దైవమగు నభీష్ట సిద్ధినిగూర్చు
పరదేశమున బ్రోచు బంధువగుచు!
గీ*
విద్యతో సరిదూగునే విత్తము, భువి
విద్యరాని నరుండగు వింత మృగము!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*77
బాల్యమల్లరియాట పాటల పరిగెత్తు
తోటివారలతోడ కొన్నినాళ్ళు
యవ్వనదశ పొంగు సవ్వడిజేయగా
కోరిజవ్వనులతో కొన్ని నాళ్లు
కలిమిలో లేమిలో కలవారి సేవలో
పోటి కూటికి సాగు కొన్ని నాళ్ళు
పండిత పామర దండిసంసారంపు
జలధి నెగుల నీత కొన్నినాళ్ళు
గీ*
జనన మరణ పర్యంతమై జగతి బ్రతుకు
గడచు, భక్తిపై నాసక్తి గలుగునెపుడు?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*78
గంజిమెతుకుకైన గతిలేని వారలు
మిగుల సంతతి చేత మిడుకు చుండ
సంపదగలవారు సంతానమేలేక
చింతనొందిరి భక్తి చింతనముల
సంతతీ – సంపద సకలవిద్యలుగల్గి
సృక్కుచుండిరి శాంతి సుఖములేక
సంసారమును వీడి సన్యాసులనుగూడి
సంచరింతురు తృప్తి సాధ్య పడక
గీ*
శాశ్వతాశాశ్వతము దెల్పు సాధనమ్ము
నీనిరాడంబరపు భక్తి నిలువ ముక్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*79
ఆత్మ నెఱుగకున్న నాచారడంబమే
నియమరహితమైన నిష్ఠ వృధయె
కాకిబంగరు కాంతి గాంచలోటునులేదు
చేతగాని తనపు కూతఘనము
ఉండిలేమిని తిండి వండలేనిరుచులు
చెల్లని నాణెముల్ చెప్పు కథలు
తత్కాల వైరాగ్య తపనలే యోచింప
శాశ్వతములుగావు విశ్వమందు
గీ*
దొంగ సాధువులది జూడ కొంగ జపము
మాయికులజేబు నింపె నమాయకుండు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*80
మకరంధమును గ్రోల మధుపమోపును గాని
పేడ పురుగునెట్లు ప్రేమ జూపు
నాగిని విని నాగు నాట్యమాడగ నోపు
మన్నుగున్నకిదేమి మరులు గొల్పు
క్షీరనీరంబుల వేరుజేయును హంస
గుడ్డికొంగకు నేమి గుట్టు దెలియు
కవితారసజ్ఞత గలుగు వివేకికే
అవివేకికిదియేమి యర్థమగును!
గీ*
శిష్ట జనరక్ష దుష్టుడాశించ గలడె
మంచి ననుసరించని భక్తి మహిని గలదె!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*81
తల్లి దండ్రుల యందు దయలేని పుత్రుండు
మామకు మర్యాద మాట వినునె?
ఇంటిదేవత మ్రొక్కు లిడగూడదనువాడు
అతిదేవోభవ యనగ వినునె?
గురుబంధు మిత్రుల గుర్తెరుంగని వాడు
నాచార్యు పూజింప నర్హుడగునె?
ఆత్మీయ ప్రజబాధ లాలకించని వాడు
నిత్యప్రజాసేవ నిరతుడగునె?
గీ*
భువిపరోపకారియుగాని బుద్ధి జీవి
ఏమి సాధించు తానేమి యెంచి బ్రతుకు
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*82
త్రాగుబోతుల గూడి తర్కింప ఫలమేమి?
తిరుగు బోతుల వెంట దిరుగ నేమి?
వదరు బోతుల ప్రతివాదు జేయగ నేమి?
పరసొమ్ముపై నాశ పడగ నేమి?
సన్యాసి కెదురేగి సరసమాడగ నేమి?
పరసతికై చింత పడగ నేమి?
లంచగొండుల జేరి సంచరింపగనేమి?
వంచకు నమ్మగా వచ్చునేమి?
గీ*
కానిపని గూర్చి కలగన్న కలుగు నేమి?
జరుగ నున్నదే జరుగును జగతి యందు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*83
హిమగిరి శిఖరాగ్రమెక్కి రెక్కాడించ
నేర్చిన కాకమ్ము నెమలియగునె?
గొప్పజాతిది కుక్క గోముగా పెంచిన
గోదారి ముంచంగ గోవుయగునె?
కలవారి కంచెలో గలియమేపుచునుండ
దున్నపోతేనుగు గున్నయగునె?
వాతలెట్టిన నక్క వనములో పులిగాదు
పంది బలిసినంత నందిగాదు!
గీ*
గద్దె నెక్కిన ప్రతివాడు గనడు కీర్తి!
దుష్టులకు దూరముండుటే శిష్ట నీతి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*84
కోరియగ్గిని దూకి – కొరివితో తలగోకి
పసిడి కత్తుల మీద పడక వేసి
బావిచేరువ పసిపాపనుంచియు పెద్ద
పులిమేనుబునుకగా బూనుకొనియు
రంగు వజ్రము మ్రింగి – సింగపు గుహ గెంతి
పాము పడగ చేతి సాము జేసి
కోరి విద్యుల్లత కొరిగి కునుకు దీసి
పొందు ఫలము-హానినొందు నట్లు!
గీ*
చేరి చెప్పుడు మాటలు చెవిని బెట్టు
వాని నమ్మిగొల్వగ ప్రాణహాని గలుగు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*85
రాజులు మారి స్వరాజ్యంబు వచ్చినా
పరపీడనము గల్గ ఫలితమేమి?
స్వాతంత్ర్య పౌరుల స్వార్థమలుముకొన్న
సమసమాజము బాట సాగునెట్లు?
పాలకుల్ ప్రజమొర లాలింపకున్నను
పరదేశమున కీర్తి బరగు నెట్లు?
అన్నదాతలు లేక నైకమత్యము లేక
దోగాడు జనులకు దోచు నేమి?
గీ*
ఏది ఏమైన నీభక్తి నెంచు నీతి-
ధర్మమే ప్రజాస్వామ్య బాధ్యతగ నడుపు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*86
సత్యవంతుల కీర్తి నిత్యమై వెలుగొందు
సద్వర్తనము శాంతి సదనమగును
నిస్వార్థ చిత్తులు నీతి విత్తము గూర్చి
దయగల్గి జీవింప ధర్మమెసగు
దీనజనుల సేవ నీసేవ గానెంచి
సత్కార్యములు జేయ సమత మమత
ఆశ్రిత జనులందు నాదరంబును గల్గి
పాలించి పోషింప పరువు కీర్తి
గీ*
శిష్టులాచరించగ పరివేష్ట జనులు
అనుసరింతురు దానినే అవని యందు!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*87
నక్క బుద్ధిని భువి నరులమించితిననీ
యూహించి ముదమునయూలవేయు
పరుగులో మనుజుల పడగొట్టెద ననియు
చిందేసి గాండ్రించు చిరుతపులియు
పరిమాణమున కరి నరునిమించితి నని
బింకంబు జూపియు ఘీంకరించు
జవసత్వమున నరు జడిపింతునేనని
సింహరాజడవి గర్జించుచుండు
గీ*
మరణమగుదాక మృగబుద్ధి మార దనుచు
జంతు సభయుతీర్మాణించె జగతి కథల!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*88
తల్లి సేవయె పూజ తండ్రియే సంపద
పతిభక్తి వ్రతము నాపతికి సతియె
తోడునీడగ సాగు లోకజీవనమెల్ల
సంసృతి వెలసెను సంస్కృతిగను
బంధుమిత్రుల ప్రేమ భావన సంతృప్తి
వినయ విద్యాధన విమల కీర్తి
దీనపోషణ, పుణ్య తీర్థయాత్రలు, దాన
శీలమ్ము సద్భక్తి చిత్తమొప్ప-
గీ*
చింతనముచేత మరుజన్మ చింతవీడి
బ్రతుకు సాగింప నీగీత భావమయ్యె!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ89
మామ శ్రీహరిహిత రామచంద్రారెడ్డి
దేవనీ లీలలు దెలిపి భక్తి
కృతిజేయ గోరె నీకృప చేత శతకమ్ము
రచియింతు తగు రచిరార్థముగను హరనీకు మంగళహారతిచ్చితి, భక్తి
శతకంబు వ్రాయగా శక్తి నిమ్ము!
భక్తి భావము దప్ప బాష దోషమెఱుగ
దిద్ధి తీర్చుము నీతి సుద్ధులిందు!
గీ*
పురజనులు ప్రోత్సహింప బూని నట్టి
కృతిని సంపూర్ణ మొనరించు కృత్తి వాస!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*90
వంట చెఱుకుదెచ్చు వనితయొకర్తుక
పుట్టజేరియు కట్టె పుల్లలేర
నంతలో నమ్మరా నంతగా కమ్మని పరి
మళముసోకెనట! మల్లెపొదయు
లేదాయె, వెనుకంజ వేసె భిక్షుక వింత
పసిడి వన్నెల పణి పడగ వెడలె!
పడగపై శివలింగ ప్రతిమ జూచితి నంచు
తనవారలను బిల్చి తరలి వచ్చి
గీ*
నారికేళఫలము పాలు నారగింపు
జేసి మ్రొక్కియు తనదారి జేరె నిల్లు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సి*91
ప్రతిదినంబును ప్రజ లతి భక్తి పూజింప
సాగిరి శివరాత్రి జాతరట్లు
సాగెనీ యాత్రయు చాల పుణ్యంభని
పుట్ట మొక్కి రి భక్తి పులకరించి
నమ్ముకొన్నను వ్యాధి నయమయ్యె ననువారు
కడగండ్లు తొలగంగ కాన్క లిడిరి
పూలు మారేడు పత్రాలు భోనాలును
పట్నాలు పట్లును పసుపు బొట్లు
గీ*
ధూప దీప నైవేద్యాలు మ్రొక్కు బడులు
తీర్థ మయ్యెను గోదారి తీరమందు
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*92
మారారి! మముబ్రోవ మారేడు బాకకు
వేంచేసినావని వేడ్క మీర
మారేడు దళములు మంచి గంధము మల్లె
పూదండ లిచ్చియు పూజ సల్ఫి
సద్భక్తి లక్ష్ములు శయనింప కలగాంచె
పాము నీరూపాన బలికి నట్టి
వృత్తాంతమును గ్రామ వృద్ధులకు దెలిపి
ప్రజల గూడియు నిన్ను ప్రస్తుతించై
గీ*
నీదుగుడిగట్ఠ పెద్ధలు నిర్ణయింప
నదియు నెరవేరె ధనధాన్య నిధియుజేరె
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*93
యాత్రికుల్ నినుజూడ నాత్రుత పడివచ్చి
నాగదేవత పాలు ద్రాగు వేళ
కనులార గాంచగా – కలలుగాంచిరి జనుల్
వచ్చు చుండిరి భక్తి వాంఛదీర!
నీదు జాతరలాది బుధవారములజర్గె
భజనసాగెను, శివభక్తకథలు
వినువారు కానుక లిడువారు కోరిక
లడుగు వారు వివరమడుగు వారు!
గీ*
ఇసుక వైవరాలని జనులిట్లు గొలువ
జాగరణవైభవము దెల్ప వశమె! ఈశ!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*94
ఏమి విచిత్రము హేమసర్ఫము మోయు
శివలింగ ప్రాభవ సిరులు జూడ
దీక్ష బూనియు పరీక్షింప గూర్చుండిరి
భీష్మించుకొని మది భీతిమాని
కునికిపాటును బడి-యులికిపాటున జూడ
తక్షణమే పాలు త్రాగి నాగు
పూలదండలు బట్టి పుట్టలో కీడ్చగా
జూచి వాపోయిరి సుంతజడిసి
గీ*
ఎడముగా కొబ్బరియుగొని వెళ్ళు భక్త
మూక దీవించి బ్రోతువో పుణ్య మూర్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస! పాహి నాగుల మల్లేశ పాపనాశ!
____
సీ*95
ఉరగేశ! నీతీర్థ ముర్వియీనిన యట్లు
జనసంధ్రమైపోయె జానపదుల
స్నానాలు బోనాలు సద్భక్తి గానాలు
ఘంటాని నాదాలు కలరవాలు
ధర్మశాలల యందు దాతగృహములందు
వసతులేర్పడ సంత వస్తు క్రయము
జేసికుటుంబాలు జేజెబువ్వలు దిని
స్మరణ జేసిరి శివ శరణటంచు
గీ*
నీదు శరణాగతిని బొంది వెళ్ళువారి
కెదురు పడివచ్చు చుండిరి వేలజనులు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*96
ఆవు తనువు నంత నావరించిన పాలు
కొమ్ము బిండినరావు పొదుగు దప్ప
సర్వోపగతుడ నీసన్నిధిలో ముక్తి
ఎల్లెడలను బొందుటెల్ల కల్ల
గాన నీక్షేత్రముల్ ఘనతకెక్కెను భక్తి
ముక్తిదాయకములై ముదము గూర్ప
ఎటద్రవ్వినను నీరువెడలు కోనేరున్న
తక్షణావశ్యకత-తగలభించు!
గీ*
నీదు గుడియందు మామది నిశ్చలంబు
నీనిరాడంబరత్వమే నిత్యదీక్ష!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*97
కుండలానెడు మట్టి దిండులందున దూది
దండలన్నిట నుండు దారమొకటె!
నగలందు లోహము నరయ బంగారమే
నువ్వులలో నూనె పూవు తేనె
పలుఫలాల రసము పప్పుదినుసు ముడి
వస్తు రూపున వేరు వరుసగనగ
రకరకాలుగ రంగు రత్నాల వెలుగొందు
కిరణ మొక్కటి సృష్టి క్రియల జూడ
గీ*
బల్బులన్నిట విద్ముత్తు బారునట్లు
జీవులన్నిట నీదివ్య లీలసాగు
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*98
చంద్రాది గోళాల చందమెఱిగిన యంత
సూర్య గోళముద్రొక్కి చూడ వశమె?
మారణాస్త్రతతులు మరబొమ్మ నడపిన
మల్లెపూవొక్కటి మలచ గలమె?
జన్మనిరోధించి, జరపొడ గించినా
మరణ మర్మ మెఱుగ మాకు వశమె?
కృత్రిమములన్ని ప్రకృతి సిద్ధముల ముందు
నిలుచు నే నిలిచినా నీటు గనునె?
గీ*
ఆత్మ నజ్ఞాత శక్తి యై యలరు నీదు
తేజమే జీవులకు ధీ వివేకమొసగు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
_____
సీ*99
పుట్టు జీవికి దిన భుక్తిగావలె-భుజ
శక్తిగావలె-నీతి సూక్తి దెలియు
బుద్ధిగావలె-నాత్మ శుద్ధిగాగ వివేక
వృద్ధిగావలె-ధర్మ బద్ధమైన
ధనముగావలె-మంచితనము గావలె-దయా
గుణము గావలె – జాలి గుండె భక్త
జనుడు గావలె-పుణ్య ధనుడుగావలె-విద్య
ఘనుడుగావలె-పుణ్య గమనుడైన
గీ*
కామ్య కర్మఫలత్యాగ గమ్యమెఱిగి
సాధు సజ్జన సంగతి సాగ వలయు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*100
ఏల సృజియింతు వీనేల స్థితిలయంబు
లేల సాగింతువో నీలకంఠ!
జీవ ప్రకృతినెల్ల దీవించి చెడుమంచి
బుద్ధులిచ్చెదవేల? భూతనాథ!
నరజన్మమునకు వానరచిత్తమును గూర్చి
రాకాసి జేతువో రాజమౌళి!
నవ్వించి, కష్టాల కవ్వించి శోకంబు
మరపింప జూతువో మదనవైరి!
గీ*
నరుడు నరునకు బెదరెడు నటన బ్రతుకు
నిచ్చి ముచ్చట పడు నిచ్ఛ నీకు దగున?
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*101*(సంపూర్ణం)
ఈవి లేకను గొప్ప ఠీవి మీసము దువ్వు
డాంబికత్వమె సాహసంబు లేదు
జంకు గొంకును దాచిబొంకు కపటభక్తు
శంక జాస్తిని జూపు మంకు బుద్ధి
మూలమెఱుంగక దులనాడునే గాని
తనమూర్ఖతను మాను తపనలేదు
కవిని కపియనుచు, కవిత భగీరథ
జతనమనియు లెక్క జేయకుండు
గీ*
కుకవి పరనిందకై బుట్టు, సుకవి దిట్టు
మూఢు డిహలోక పరిధిలో మురియు చుండు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*102
వ్యసనాలలోబడి కసిపెంచుకోనీక
నిసుమంత నీతత్వమిమడనిమ్ము!
కమ్మరి పురుగట్లు దిమ్మరు సంసార
బురదనంటక సాగు బుద్ధి నిమ్ము!
కామ క్రోధాది శోకాబ్ధిలో నీభక్తి
నావ నీదరికేసి నడవ నిమ్ము!
మన్మదాంతక! మాయ మర్మంబు దెలియగా
నాత్మ దర్శనమిచ్చి యాదుకొనుము!
గీ*
ఆది భిక్షు బోలాశంకరా! మహేశ!
శిష్ట లోకంబు ననుమెచ్చు పుష్టి నిమ్ము!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*103
సర్వేశ!మామది సద్భక్తి నిలయమై
నీధ్యాన నిష్ఠను నిలువ నిమ్ము!
పరమదయానిధీ! ప్రాణికోటికి మేలు
చేయు సేవలు విధి చెలగ నిమ్ము!
నిటల నేత్ర! దురిత నివహంబు దాటించి
సుకృతజీవన తృప్తి – సుఖము నిమ్ము!
భక్తి వైరాగ్య ప్రభావితులను జేసి
దివ్య గీతాజ్ఞాన దీప్తి నిమ్ము!
గీ*
దీన జన్ముల దరిజేర్చు దేవదేవ!
నమ్మితిమి ముక్తి దయసేయు నాగభూష!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*104
జగదీశ! చల్లని నగలేమొ నాగులు
హిమశైల మేయిల్లు మహిత చరిత!
మహిచల్లనీ-తల్లి మంచురాచూలిని
సగమేనుగాచేర్చ, జగముపొగడె!
చల్లని గంగ మెట్టిల్లుగా నీకొప్పు
శీతాంశు రేఖనీ సిగను పువ్వు
గరళంబు నార్పగ గళమయ్యె నీలంబు
చిచ్చు దాచిన కన్ను నిచ్చు శోభ!
గీ*
మండిపోయెడు మామది మందిరమున
చల్లగానెలకొని బ్రోవు సాంబమూర్తి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*105
వరతిరుణా హరి వంశాబ్ధి చంద్రుడు
దాస జియరు పుత్ర త్రయము బడసె
వారిలో చిన వెంకటార్యునకు గలిగి
రిద్ధరు సుతులందు పెద్ధవాడు
గురుడు రంగయ కైదుగురు పుత్రు లందున
దాసవెంకటయ సీతమ్మలకును
తనయులిరువురు ప్రథమ తనయుడ నీదు
భక్తి సుధను గ్రోలు బాలకవిని!
గీ*
శతక కృతి జేసి యర్పించి శరణు గోరు
నత్యనారాయణుండనో నిత్య సేవ్య!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
సీ*106
ఓత్రిలింగేశ్వరా! సోమశేఖర! భక్త
పరమాణువును నేను ప్రమథనాథ!
పూనినీ శతకంబు పూరించి పులకించి
జనులాజ్ఞ పాలింప జన్మ ఫలమె!
దేశిచందము భక్తిదేల్చి రచించితి
తేటతెలంగాణ మాటలందు!
చెఱుకు వంకరయైన చెడిపోవునేతీపి
బాషదోషములెన్న భావ్యమగునె?
గీ*
చంద్రునకు నూలు పోగన్న చందముగను
కృతిని గైకొని నాయందు కృపను జూపు!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*107
జగదాంబికాధవ!జంగమదేవర!
హరిహర! మహదేవ! ధరవిధాత!
నందివాహన సదానంద! గంగాధర!
కాలకంధర! రుద్ర! ఫాలనేత్ర!
బ్రహ్మాదులకు పరబ్రహ్మ! నీతత్వంబు
నంతుచిక్కదు నేనెంత వాడ!
ముగ్ధ భక్తిని మెచ్చు ముక్తీశ్వరుండవు
సీసమాలికలివే స్వీకరించు!
గీ*
వచ్చి రాని మాటల రాత వంకదీర్చి!
చిత్తగింపుము స్వామి నాచింతదీర!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!
______
సీ*108
ప్రాజ్ఞులు దీవింప, ప్రజలు సంభావింప
నీతత్వమూహింప నిశ్చలాత్మ
ప్రార్థించి ప్రస్తుతి పద్యంబు లల్లినీ
కర్పింప వచ్చితి కమనపురికి
పదుగురు వినిభక్తి చదివియానందింప
పదుగురు పండితుల్ పరగబొగడ
శుభములు దయసేసి, సుఖశాంతి, సమదృష్టి
సమకూర్చి రక్షించు సాంబదేవ!
గీ*
విశ్వ సమైక్యత భారతీయ మనగ
జాతి జనుల వెల్గించు సౌజన్య బుద్ధి!
భక్త జనపోష! మారేడు బాక వాస!
పాహి నాగుల మల్లేశ పాపనాశ!