నీతివైద్యం శతకము-1
(తే.గీ.)
1*
శ్రీలు జిందు జీవనవృత్త చిత్త శాంతి!
ఆయురారోగ్య దాయకమఖిల జగతి –
భారతీయ సంస్కృతి దివ్యభావ ప్రగతి!
తిరుణవారి విను భరతజాతీయ నీతి!
2*
ఆయురారోగ్య భాగ్యమేయందముగను-
సత్యశీలనిర్మాణమే చందముగను-
సాగు చదువు సంస్కారమే చాలమేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
3*
ప్రథమ ధర్మసాధనమగు ప్రమిద తనువు
ఆత్మ దీపమ్ము వెలిగించు తాత్త్వికంబు-
గాకనేమున్న సుఖమేమి కనగ-వినగ?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
4*
తనువుకారోగ్యమున్నచో తత్వవాంఛ!
ఆత్మసాయుజ్య భావమానంద బ్రహ్మ!
గాంచలేనట్టి జన్మంబుగలుగనేల?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
5*
సభకు,అధ్యక్షులకు, సభాసదులకెల్ల-
వందనముజేసి-చందంబు విందుజేతు!
వినయమొప్ప నావాక్కులు విన్నవింతు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
6*
ప్రజకు,దేశదేశాల ప్రముఖులకును-
ప్రతిభ విశ్వరూపము దాల్చు పత్రికలకు-
వందలాది వందనములు వరుసగాను!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
7*
ప్రేమ నిధులార! బుధులార! పెద్దలార!
చిచ్చు బుడ్డినిరూపించు చిన్నలార!
మేటిగురులార! జనులార! మిత్రులార!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
8*
వేదికను వెల్గు విజ్ఞాన వేత్తలార!
సూత్రధారి గీతాజ్ఞాన సూర్యులార!
మాటదోషంబు సవరించు మాన్యులార!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
9*
దేశమంటె ప్రజలుగ సందేశమొసగ-
ప్రజల జీవన గమ్యంబు ప్రగతి వెంట-
ప్రతిభ నీతియుక్తముగాగ ప్రతిఫలంబు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
10*
ఏది జీవన గమ్యంబుజేర్చు రీతి? –
ఏవిధులు బాధ్యతలు, హక్కులేవి? యనియు-
నీతియావృతమై సదా నెగడుచుండు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
11*
దేశమెటు సాగుచున్నదో తెలుపువారు!
నాడు నేడున్న చందంబు నయము జయమె!
నీతియవసరముదెల్పు నియమమేది!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
12*
నీతి విద్యలన్ పనిబడి నేర్చుకున్న
నీతి కోవిదులానాటి నిపుణమతులు!
నీతి సంబాషణలు కృతి నిల్పినారు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి
13*
చెలగు నీతిచే నరజాతి శ్రేష్ఠమగుట-
నీతి ధర్మంబుచే కీర్తి నిత్యమగుట-
కథలు కథలుగా మ్రోగెను-గతచరిత్ర!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
14*
భరత చరిత సుబాషిత భాగ్యగరిమ!
నిత్య కీర్తి పతాకమ్మునెత్తెనాడు!
శతక నీతి నినాదమై సాగె చదువు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
15*
నీతి విద్యను పనిబడి నేర్పవలయు!
నితర విద్యలభ్యాసమై హితవు గూర్చు!
బ్రతుకు దెరువు కైచ్చికవిద్య-బాటవేయు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
16*
నీతిలేక నాదర్శమౌ రీతిలేదు!
నీతి లేక మానవతత్వ నియతి లేదు!
భువి సుబాషితకారులే పుణ్యజనులు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
17*
జాతి నీతిధర్మమువెంట జగతి కీర్తి-
గాంచు, ధార్మిక జీవన గతిని జన్మ-
గడచి ధన్యతగను పుణ్య గతినిజెందు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
18*
కట్టు బాటు సూత్రము నీతి చట్రముగను-
శాసనము సాగు సుఖశాంతి శాశ్వతముగ!
చెల్లుబాటగు స్వాతంత్ర్య దేశమందు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
19*
ఇచ్ఛ’మొగమిచ్ఛమాటల స్వేచ్ఛ గాక-
కట్టు బాటగు స్వేచ్ఛయే పట్టుగొమ్మ!
నీతి గీత సరళరేఖ నిర్వచనము!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
20*
జాతి పూర్వానుభవమూట నీతిమాట!
నచ్చినా నచ్చకున్నను నడవడిగను,
హితవు గూర్చునదియె-భూతహితవు గాన!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
21*
విచ్చలవిడి వర్తనలోన హెచ్చు ముదము!
తరచి చూడ తత్కాలిక తనివి దీర్చు!
శాశ్వతము గాని సుఖమిచ్చు చావునిచ్చు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
22*
మంచి చెడు విభజించెడు మాట మరచి-
సంచరించిన చెడిపోవు మంచివాడు!
మంచి సంచితార్థము వెంట మంచివాడు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
23*
నచ్చకున్నను కష్టంబు లచ్చుపడిన-
మెచ్చు కట్టడి మీరక మెదల మేలు!
నరుడు కీడెంచి మేలెంచ నయము గలుగు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
24*
స్వేచ్ఛ కట్టుబాటును మీర చేటు గలుగు!
సహజ తంత్రంబు చెడిన దుస్తంత్రమగును!
నీతి విద్య యవిద్యచే నీరసించు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
25*
నీచ వర్తన గలచోట నీతి లోటు!
చెడుగు వర్తన నీతిని చెల్లనీదు!
నేటి కూటి విద్యల గోల నీతి మరపు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
26*
నీతి మాటంటె నపహాస్యమే తనంత-
తానుగా నీతి బోధించు తరతరాల-
ధీవివేకంబు గుర్తించు ధీరులేరి?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
27*
ధీరు గమనించు విజ్ఞాన వీరమేది?
లేరు లేరంద్రు నైతిక తీరు తెన్ను-
లెంచు పెద్ధలు మంచినే బెంచుచుంద్రు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
28*
నీతిమాటలసహ్యమై నిత్య గడన-
నీతిమాట సహించని నింధితులను-
ఎదిరి ప్రశ్నించు వారేరి? బెదరకుండ!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
29*
వాస్తవము చేదుగానుండు వరుసదెలుప-
మంచివాని వంచింపగా సంచరించు-
మోరకుల మ్రొక్కుకున్నను మోదమేది?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
30*
మంచి మాట్లాడ గలవారి మించులెంచ-
అంచుడాబె గా-లేదాయె పంచెడాబు!
లేకి బుద్ధులనెదిరింప నేమి ఫలము!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
31*
మంచిబెంచి చెడుపనులు మానవలయు!
నీతి నిల్పి యక్రమ నీతి నెదురు కొనగ-
నీతి పరులేకమై జాతి నిలుప వలయు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
32*
విత్త దృష్టి సర్వస్వమై వెలయు చోట
కనరు వినరు మంచి నోటనరటంచు-
ధర్మమిది యంద్రు కలిమాయ మర్మమందు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
33*
సాటి నిందించుటయె గాదు పోటి బ్రతుకు-
నిర్విరామ కృషిని సాగ నిండుదనము!
నీతి దప్పిన పనులెల్ల నిష్ఫలములు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
34*
భూత హితవైన కర్మచే పుణ్యమెసగు!
పాటి దప్పిసాగిన జన్మ ఫలము లేదు!
నాణ్యమగు నీతి వర్తనే నయము జయము!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
35*
అతియు సర్వత్ర వర్జితమ్ – బ్రతుకు నీతి
అతిశయించిన సర్వత్ర నదియె గాన
ఇతర మోసంబు గొనసాగదింక జగతి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
36*
తరతరాల సంపద జీవితావసరము-
తీర్చగా విత్త దృష్టిని గూర్చు పనులు-
దాన ధర్మము – నీతి నిధానమగునె?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
37*
పెద్ద మాట పెర్గన్నపు సద్దిమూట!
నాటి యుపమయది నేటి హాటుబాక్సు!
పెద్దలాశయమునకు విరుద్ధమేల?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
38*
మొదట కీడెంచి మేలెంచ ముదమటంచు-
పెద్దలన్నది వినకున్న పెద్దముప్పు!
చేయి గాలియేడ్చిన నేమి చేయవచ్చు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
39*
వినగ వినగ నీతియు వీను విందు జేయు!
అనగననగ నీతియు ప్రజల కందుబాటు!
కనుల విందు ప్రజానీతి కనగ కనగ!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
40*
మునుల నీతి భావించుటే ముందు చూపు!
ముప్పు దప్పించ కవచమై ముదమొసంగు!
సాకు నీతియే మూఢ విశ్వాసి రీతి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
41*
యోగి-భోగి, రోగియునీతి యోగమందె
తగిన ఫలితమొందుదురన్న-తథ్యమెఱిగి-
నీతి వీడక తరియింప నెంచ వలయు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
42*
మొరటు దనములేకను శ్రద్ధ కొరతలేక-
నీతి విద్యబోధనసేయ నిత్యయశము!
పిరికి దనముచే బోధన ప్రీతిగొనదు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
43*
వెసన పరిసరాలు కలుష వేదికలుగ-
పుట్టి పెరిగి యవిద్యచే, పుణ్య, పాప-
మెరుగనట్టి పేదల, నీతినెఱుగుటెట్లు?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
44*
వసుధ కాలుష్య జీవన వసతి బ్రతుకు-
తెగులు తనదాక వస్తెనే తెలియుగాన!
చేరి నీతి ప్రచారంబు జేయమేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
45*
విషయ విజ్ఞానికే రీతి వివరమందు-
సాహసించి తెల్పిన విను సహనమేది?
తీరు తెన్నులు దెలియగా తీరికేది?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
46*
నేడు విజ్ఞాని యజ్ఞాని నీతిమాలి-
ఏడ్సు రుజసోకి ఎలుగెత్తి ఏడ్చువేళ-
అవసరము – నైతిక విలువలనెడు మాట!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
47*
వింత వైరసుల్ బ్రతుకెల్ల చింతవంత
రోజు రోజుకు క్షీణించు-రోగి లోప-
మైన రుజనిరోధకశక్తి-మందగించు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
48*
మంచియడుగు జాడలసాగు మంచి బాట!
మంచి బాటలో నడయాడ మంచి బ్రతుకు!
మంచి బ్రతుకులో వికసించు మనుజు నీతి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
49*
కల్ల నిజములు జీవన గమన గతులు-
మంచి చెడులుండు-విభజించి మంచినెంచు-
వివరమే పురాణములందు విస్తరించు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
50*
యోగి-భోగియై మలినసంభోగియైన-
వేయి సుఖరోగ క్రిమితతుల్ వెంటనంటు!
వేరు వేరైన హేతువుల్ వేయినేల?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
51*
ఒక్క మాటయె! ఒకబాణ మొకతె పత్ని-
రాజు పేదలకొకదీక్ష రామవ్రతము!
పుట్టినిల్లు భారతమాత-పుడమికీర్తి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
52*
బ్రతుకు పరపీడనము చేత పాపిగాగ-
పుడమినుపకారమొనరింప పుణ్యమగును!
సప్త వెసనాల దురితంబు సాగుచుండు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
53*
శూర రామలక్ష్మణు గోరెశూర్పనఖయు!
సుధతి సీతకై రావణా సురుడు గూలె!
కాలిపోయె లంకయు లోక కథగ మిగిలె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
54*
శృంఖలత్వంబునకు భువి శృంగభంగ-
మొందు!! దగదు పరస్త్రీల పొందుచేటు!
సెక్సు విశృంఖలత్వంబు చే యెయిడ్సు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
55*
భద్రతలేని జీవనమెల్ల బాధమయము!
బాధ్యతయులేని బ్రతుకున బరిదెగింపు!
రోతయేగాని యది బ్రహ్మరాతగాదు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
56*
దుడుకు దనముచే నీతికి దూరమైన-
దురిత యోచన, లవినీతి దురలవాట్లు!
పీల్చి పిప్పిజేయు రుజలు పిదప గలుగు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
57*
శుద్ధి గల్గిన త్రికరణ శుద్ధి గలుగు!
బుద్ధి సూక్ష్మతచే నీతి పుడమి వెలుగు!
ఆత్మ చైతన్యమున నీతి యతిశయించు!
తిరుణహరి విను భరత జాతీయ నీతి!
58*
సహన సంపదచే బుద్ధి సత్వమెసగు!
సహనమే బర్వు బాధ్యతసాగజేయు!
బ్రహ్మ రాతకష్ట సుఖంబు పాలు సగము!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
59*
చేతులార పాపముజేసి చెడు సహించి-
రుజువుగా తత్ఫలముగానె రుజలబాధ!
బ్రహ్మ రాతను నిందింప భావ్యమగున?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
60*
పోటు బంటైన తనచావు గోరుకొనడు!
కల్మిగలవాడు రుగ్మత కాంక్షగొనడు!
చేటు నూహించి జాగ్రత జెందుచుండు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
6*
విశ్వవైద్య వైజ్ఞానికుల్ వెల్లువెత్తి-
ముందుజాగ్రత, టీక మందు- యాంటి-
వైరసునిరూపణ గనిరి వరుసగాను!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
62*
తగిన తీరుతెన్నులు దెలుపగను- సంస్థ-
వైరసుల శోధనలు సాగు వరుస టెస్టు-
మొదట ముందు జాగ్రతభేరి మ్రోగెనంత!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
63*
వర్ధమానదేశాలలో నార్థికముగ-
పెక్కుకారణభూతముల్ పెనుగులాట-
హెచ్చు హెచ్చైవినణగించ వచ్చెనిధులు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
64*
మనుజులకు కీడుగూర్చెడు మలిన సెక్సు-
జాడలోహెచ్చు హెచ్చైవి జగతి-తఱచు
గూఢ వర్తన గలవారి గూడికలను!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
65*
క్షణిక సౌఖ్యముప్రాణాంతకముగ నేడ్సు
రక్తధార సెలైవలా సక్తి జేరు!
మలిన శృంగార దారిలో మణిగి యుండు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
66*
చెబితె పరువు నష్టము విప్పి చెప్పకున్న-
ప్రాణనష్టమిలనరక-బాధమయము
తగినటెస్టునిర్ధారణల్ తఱచు వేళ-
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
67*
సూక్ష్మ సాంకేతికపు శోధ సుళువు గాగ-
మందు లేని రోగాలొచ్చు మార్గమెఱుగు!
క్రొత్త రుజకౌషదము గనుక్కొనగ వీలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
68*
రక్తమార్పిడి కలుషిత రాహజనగ-
రక్త దానప్రయోజనం రిక్తమగును!
కోరియంటించుకొన్న దై కొంపముంచు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
69*
చేరి చేర్పించి, నిశ్శబ్ధ ఛేదనముగ
గుట్టు వివరించి, నినదించి గుర్తు గీసి
చేయి జోడించ సాగె సంక్షేమ విధులు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
70*
సాంప్రదాయకుటుంబాలు సాగు దేశ-
దేశముల నింట బల్కరు ఎయ్డ్స్ పేరు!
విశ్వసింపక వాదింత్రు విస్మయముగ!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
71*
పెనుదుమార తుఫానయ్యె-పెద్దముప్పు-
తొల్త జడిపించె! నణుబాంబు తోసమస్య-
మరిజనాభాధికము, ఎయ్డ్సు మరొకసమస్య!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
72*
విజ్ఞులిది పల్లె జనులకు విధిగ దెలుప
నిజము జీర్ణింప-కాలంబునిట్టె గడచె!
వెలసె నిశ్శబ్ద ఛేదన వేదికలుగ!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
73*
ప్రభుత కట్టడి నగరాల ప్రజలుముందు
జాగరూకత పాటించు చర్ఛనడుప-
పల్లె పట్టు జనాళి నిర్భయముజెందె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
74*
కలుపు మొక్కబుద్ధుల చీడ కడకుదొలుగు-
ముర్గు కాలుదీయగ వైద్యు ముందుచూపు!
జగతి గలిగించు మేలైన జాగృతంబు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
75*
తోటి వారిభుజాలెక్కి తొక్కి పట్టి
సాటి పోటిగేళినిసాగు చట్టబుద్ధి-
ప్రశ్న వేసి జవాబడ్గు- పరిహసించు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
76*
కాలమాసన్నమై ఏడ్సు కాటు మాను
దాక దయజూచి-రోగుల సాకవలయు!
చేరి నిశ్శబ్ధ ఛేదన చేష్ట మేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
77*
ఎయ్డ్సు రక్తంటు రోగము ఏరికోరి
రోగియంటించు కొన్నదో – రోగి పొందు
రక్తమార్పిడిలోనంటి రగులు కొనెనొ?
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
78*
ఎయ్డ్సు రోగి బ్రతుకు పదైదేండ్లు సాగు!
తీవ్రతైదేండ్లలో బ్రత్కు దీరిపోవు!
ముందుజగ్రత తగుటీక మందుదాక!
తిరుణహరి విను భరతజాతీయ నీతి
79*
సోకి నారునెల్లకుటెస్టు మూడుసార్లు!
పాజిటివు రాగ, హెచ్చైవి పట్టువడును!
రోగనిర్ధారణకువచ్చు రోగితీరు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
80*
అల్ప యూష్ణోగ్రతకు వైరసంతరించు!
రక్త వీర్యాన బడుకున్న రయముజెందు!
సెక్సు-ధనలోభముల దీని టెక్కులుండు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
81*
లోపమును తనదారిగా లోనజేరి-
భోగి, రోగిగా జేసెడు, కోరి దీని-
పగిది భూతద్ధమున ముళ్ళపంది బోలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
82*
రోగి వెలివేయ దగదెన్ని రోజులైన-
ఎడముగా నిడి పోషింప నెంచవలయు!
సాకవలె మానవత జూపి సాదరమున!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
83*
నేర మేదైన శిక్షతానే భరించు-
చేదు బ్రతుకీడ్చు తనవారి సేవగోరు!
కాన్సలింగుననోదార్చ గలుగవలయు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
84*
మలిన సంభోగమో – రక్త మార్పిడందో
కారణము దెల్యకను నింద గలుగ హాని!
జాగృతముజేయు మాటలే చాలమేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
85*
రోగి పీడింపబడు నిర్నిరోధకముగ-
తట్టుకొను శక్తి లోపించు-తనుకృశించు!
చిన్నచితక రోగాలెచ్చు, చిచ్ఛుబెట్టు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
86*
నీతి మార్గాన ఏబది శాతముగను-
వైరసు నశించె ననువార్త వైనమెరుగు-
తీరు తెన్ను భారతమాత దీవెనయ్యె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
87*
మందు టీక శోధన సాగె-ముందు ముందు!
విరుగుడులు దీక్ష గనిపెట్టు వీలుగలిగె!
రక్త వీర్యదారులు పిల్టరగుట కొఱకు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
88*
వైద్య శోధనార్జిత టీక విషయ చర్ఛ-
దినము ప్రకటించ ప్రజగుండె దిటవు గలుగు!
వీధి నిశ్శబ్ద చేధన భీతిమాన్పు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
89*
నడక కరచాలనాదుల నంటుకొనదు!
నీరు నాహార వస్త్రాల నిలిచి రాదు!
కలిసి బ్రతికిన వీర్య రక్తాన దాగు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
90*
వస్తు సామాగ్రికంటదు! వలస బ్రతుకు-
మరుగు దొడ్డిదారినిరాదు – మలిన సెక్సు-
రక్త వీర్య ద్రవాలలో రాటు దేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
91*
రక్త మార్పిడి యంటు చిరంజి సూది-
గంటు బెట్టిన బ్లేడును-అంటి దూరి-
విశ్రమించు నెత్తురులోనె వింత వైరి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
92*
చదువు కొనువారు, యువ బ్రహ్మ చారు లంత-
పెండ్లి కిటునటు సంభోగ ప్రేమ విడువ-
వైరసాక్రమింపదు రక్తాన వైద్యు నికష!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
93*
మనుజు మనుజు కయ్యముబెట్టు మాయ డబ్బు!
మలిన నెయ్యంబుగొను మాయదారి ఏయ్డ్సు!
వైరసులు రెండు! మొదటిదే వైరి పుడమి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
94*
వలస సెక్సు నిరోధన-వైరిలొంగు!
కల్తి రక్తంబు వర్జింప గలుగు మేలు!
మనువు మనుగడ రక్షిత మగతనంబు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
95*
స్వార్థమును వీడి జనులు స్వచ్ఛంద సేవ-
ముందు జాగ్రత నేర్పించి మందు దెలిపి-
తప్పు దిద్దిరోగులరుజన్ దరుమమేలు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
96*
లబ్ధ గెలుపోటముల వాదులాట చాలు!
శ్రేష్ఠ నరజాతి” నీతి” సంక్షేమమొసగు!
వైద్య నారాయణుడు గెల్చు వైరసులను!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
97*
తల్లి రక్తంబు తనలోకి తరలు కతన-
రోగి సంతుకు హెచ్చైవి సోకు – సెక్సు-
మానుకోవలె సుఖరోగ మర్మమెరిగి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
98*
మనసు లేని పనుల రాతి మనుజు చేష్ట-
తరతరాలకు శిక్షగా తరలివచ్చు!
వెసన సప్తకమున జొచ్చు వెసగజంపు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
99*
బాల-బలవంతముగ సెక్సు బలియ జేయ-
మనుజులెందరిజంపు నీ మగతనంబు!
పోటి పందెముల్ వైరసే పోటుబంటు!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
100*
కనికరములేని మానవాకార దనుజ!
దురిత యోచన వైరసుల్ దూరు సెక్సు-
బుద్ధిమారిన, వ్యాధియు బుగ్గియగును!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
101*
మాయరోగము జాతీయ గాయమయ్యె!
మారి ఎయ్డ్సుజాగరణ సమస్యయయ్యె!
వర్ధమానదేశములెల్ల వణుకుచుండె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
102*
కంట్రి కంట్రోలు సంస్థలు కదలిరాగ-
చేయు సేవలో నిశ్శబ్ధ ఛేదనాలు!
సాగె డెబ్బది శాతము సఫలమయ్యె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
103*
మునుల సంతతి మనదను మురిపె మిపుడె
నిజముగానుండె దృఢదీక్ష నిగ్గుదేలె!
నూరు శాతము నయమగు నూహగలిగె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
104*
నిబ్బరమునిడు స్వచ్ఛంద నిధులు వెలసె!
పథము జూపించె జాతీయ పథకసేవ!
విద్య వైద్య శాఖల కృషి విస్తరించె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
105*
యువత జాతీయ సేవ చేయూతగాగ-
ప్రకటితముగ ప్రజ ప్రభుత పట్టుదలయు-
దేశమాతాజ్ఞ నీతి సందేశమొసగె!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
106*
డాక్టరేటుల నుండియు డాక్రదాక!
యుద్ధ ప్రాతిపదికన ఎయ్డ్సు యుద్యమంబు!
వైరసరికట్టగా మ్రోగె సైరనొకటి!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
107*
అవని నీతి ధర్మములేక నసలుకెసరె!
అల్పునాత్మ విశ్వాసమే యధికుజేయు!
భావి భాసించు నాత్మీయ భావగతుల!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!
108*
తల్లి భారత సంస్కృతి దలప శుభము!
నీతి భారత రీతికి నిత్య శుభము!
విశ్వ కళ్యాణ దాయక విధికి శుభము!
తిరుణహరి విను భరతజాతీయ నీతి!