top of page
శ్రీ సాయి నివ్వాళి శతకము
(తే.గీ.)

1*

శ్రీలువెలయించు నీచూపు చింతబాపు

చిత్తమలరించు నీరూపు-చేతనాంశ!

భక్తి విశ్వాస సూచి ప్రపంచ శాంతి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

2*

నిశ్చలానంద దాయక నిర్మలాంగ!

సచ్చిదానంద పరబ్రహ్మ! సాధు హృదయ!

దేవ మానవ రూప! సంజీవరాయ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

3*

ఔషదంబుగా వ్యాధుల నణచు వేప-

వృక్షమూలాన జనకర్మ సాక్షివగుచు-

భక్త జనుల సంభావించు బ్రహ్మచారి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

4*

వైద్యుడవు-దాతవు-పకీరు వైననీవె!

ఫికరు మాన్పి సంరక్షింతు ప్రియతముడవు!

నింగి నీకీర్తి హంసిరాణించి యెగసె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

5*

వచ్చు భక్తలోకము మది వాంచితముల-

నిచ్చు వరదుండవని భక్తి నిష్టగొలుచు-

ప్రజల నానందవారాశి పరగ దేల్చు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

6*

ప్రాణి సేవలో తరియించు బాటనీది!

మదికి నిశ్చలత్వము గూర్చు మహిమ నీది!

మానవత్వ క్రియాత్మక మార్గదర్శి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

7*

జీవకోటిని ప్రేమించు దివ్య హృదయ!

మోక్ష బాటను నడిపించు దీక్ష తమది!

మానవత్వ మార్గము నీది-మాన్య చరిత!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

8*

భరత జాతి సమైక్యత బాటవేయు-

సంస్కృతికి రక్షగా భక్తి సాగువిధుల-

నాణ్యమగు బోధ జేయు సనాతనుడవు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

9*

రాజు పేద నేకము జేయు రాహసాగి-

బాట సారివై సద్భక్తి పదిల పరచి-

ఋషుల సాంప్రదాయము నిల్పు కృషియె నీది!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

10*

నీతి వివరించు నేర్పున నీదు తీర్పు!

బీద సాదల మొరవిను ప్రీతి కూర్పు!

మార్గదర్శక! ద్వారకామాయి నిలయ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

11*

నారికేళపాకపు వేదసారమెల్ల-

ద్రాక్ష పాకాన నందించు దార్శనికుడ!

కదలి పాకమే నీభక్తి గమన విధులు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

12*

భరత జాతినేకము జేయు భావ గరిమ-

నీతి-త్రికరణ శుద్ధి పునీత దృష్టి-

సకల ధార్మికుల్ హర్షించు సమతసూక్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

13*

రామ తారక ధ్యానివై రాత్రి పగలు-

మానవావతారిగ నీ మహిమ జూపి-

దూపు జనుల రక్షించిన దురిత దూర!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

14*

శ్రీ శ! రామ-రహీమేసు క్రీస్తు రూప!

సకల ధర్మ సమన్వయ సమతయోగి!

సత్య వచన నీ చరణాలె శరణమంటి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

15*

రామ!భృగురామ!రిపుభీమ!రాజమౌళి!

కృష్ణ!బలరామ!పరబ్రహ్మ! కృత్తివాస!

సాంప్రదాయ సనాతన సాధు రూప!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

16*

సత్య శివసుందరాకార! సాయి రామ!

ప్రకృతి చేతనాంశను వెల్గు పరమ పురుష!

బ్రహ్మ – విష్ణు-మహేశ్వరా! భవవినాశ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

17*

సాధు సజ్జన పోషక! సంయమీంద్ర!

వీర బ్రహ్మ! సూర్దాసు కబీరు దారి-

సఖ్య భక్తి జాతీయత సమైక్య వరద!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

18*

కాల పురుష! కాలాతీత! కాలకంఠ!

కర్మ ఫలద! సంచితపాప కర్మ నాశ!

పూని భక్తి విత్తియు పంచు పుణ్య పంట!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

19*

చెత్త దేహాన నాత్మయు చెన్ను మీర-

నాత్మ దివ్వెన పరమాత్మ నరయ జేసి-

ప్రాప్త జన్మ సార్థక్యమౌ ఫలము నొసగు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

20*

భారతీయ సమైక్యతా భావగరిమ-

చిత్తమే భక్తి పూర్వక క్షేత్ర మయ్యె!

జన్మమే పుణ్య హుండిగా జమలు నిండె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

21*

వసుధ శాంతి త్రివిక్రమ వటుని యట్లు-

విశ్వ సంక్షేమ సూత్రమై విస్తరింప-

భక్తి మార్గ దర్శకు లైరి భరత జనులు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

22*

మూడు మూర్తుల నీప్రేమ ముడిని బడగ-

ప్రేరణొసగె జీవుల నిండె ప్రేమశక్తి- ప్రాణ శక్తి సమార్జిత ప్రక్రియలుగ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

23*

లక్ష్య-లక్షణ సత్కర్మ సాక్షముగను-

భరత ప్రజలకేకాత్మత పంచువిధులు-

చావడోత్సవ సందేశ భావజములు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

24*

కలిని యాకలి పోకార్చు కార్మికుడవు!

మాయ మర్మంబు ఛేదించు మాంత్రికుడవు!

మేటి జాతీయ సద్భక్తి తోటమాలి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

25*

వనము బెంచియు మహోత్సవంబు జరిపి

చూప-ననుసరించిరి సదా ధూపుజనులు!

వసుధ నీసేవలు పరియా వరణ శుద్ధి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

26*

ముగ్ధ విజ్ఞ భక్తులు మోదమొందు విషయ-

చర్ఛలాకర్శనీయమై సైన్సు-భక్తి-

ఫలసమర్పణ నీభక్తి పరిధి వెలసె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

27*

జీవ సేవకంకితమయ్యె శిష్య కోటి!

దానమే తపముగ సాగు దారి భక్తి-

జన్మరహిత ముక్తిని ధన్య జన్ములైరి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

28*

ఆలకింప నీకీర్తనల్ – అమృత ఝరులు!

పరమ పదపు సోపానముల్ ప్రవచనాలు!

క్రూర మతిమారి భక్తి యక్రూరులైరి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

29*

కలిని హింసాత్మకులపర కంసమూక-

సదమదంబయ్యె-నీయాజ్ఞ జడియ చదరె!

ప్రకృతి నీశాసనము మేర ప్రతిఫలించె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

30*

వేయి పేరుల నీస్తుతి వెల్లువెత్తె!

వేయి బాషల నీసూక్తి వెలసె-వసుధ!

వేయి నోళుల నీకీర్తి విస్తరించె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

31*

దానవుని మానవుని జేసి-మానవులను

దైవములజేయ నెంచిన దేవదేవ!

దైవ భాగమాత్మగ జూపు దారి నీది!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

32*

సర్వ ధర్మ సమన్వయ సమత-మనుజ-

ధర్మమై భక్తి సుఖశాంతి దారి సాగి-

విస్తరించెను నీచుట్టు విమల చరిత!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

33*

ధర్మ రూప! త్రికాలజ్ఞ కర్మయోగి!

కర్మ ఫలదాత కలియుగ కలుష నాశ!

కాల గమన శాసన కర్త కాలరూప!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

34*

రక్ష గోరు జీవుల పాలి రామచంద్ర!

అన్న వస్త్ర హీనుల కృష్ణ! ఆత్మ బంధు!

తత్వ సారామృత విధాత! దత్తరూప!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

35*

వివిధ యోగాల గీతార్థ విషయ గతుల-

చర్ఛ సాగింప సద్భక్తి సాగ సుళువు!

బ్రహ్మ విద్యార్థి జనగురు బ్రహ్మ వీవు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

36*

విగ్ర హారాధన సగుణ విధుల వెలయు-

నిర్గుణోపాసన ధ్యాన నిష్ఠ మెఱయు-

సగుణ నిర్గుణంబుల సాగు సద్గురుండ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

37*

మంచి విజ్ఞానమున మూర్తిమంతులగుచు-

విద్య నేర్చి గీతాబ్రహ్మ విద్య నెఱిగి-

చెడును వర్జింప-గలుగును చేతనమ్ము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

38*

పరగ తాపసుల్ నిర్గుణో పాసకులుగ-

సగుణ భక్తి యోగులు పూజ సాగు విధులు-

పొసగ నానందబ్రహ్మంబు బొందు చుంద్రు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

39*

సంకటావృత సంసార సాగరాన-

భక్తి నావసావసాగించియు ముక్తి జేర్చు-

నావికుడవీవె! జనులకు నాడు నేడు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

40*

సహజ సులభమౌ సాకార సగుణ భక్తి-

యోగమే జనామోదమై సాగె-పుణ్య-

మార్గ దర్శక! ద్వారకామాయి నిలయ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

41*

పుడమి నరజన్మ గతపుణ్య పూర్వకంబు-

పాపమొనరింప మరుజన్మ పతన గతియె!

తెలిసి పుణ్యంబు జేయని తెగువదేమి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

42*

జగతి నీయండ గలుగుటే జన్మ వరము!

జన్మ తరియింప నీభక్తి జాగృతంబు!

భక్తి నీనామ జపమిచ్చు బ్రహ్మముదము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

43*

సాంద్రమంత సాహసమిమ్ము సాగు పనుల-

నేలయంత-ఓపికనిమ్ము నీలకంఠ!

నింగియంత నమ్మకమిమ్ము నీరజాక్ష!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

44*

బాషలేవేరు-నీభక్తి భావమొకటె!

గమనములు వేరు సద్భక్తి గమ్యమొకటె!

జాతులెన్నున్న మానవ నీతి యొకటె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

45*

నిత్య సంతోషి సుఖియించు నెపుడు భువిని-

సంతసము గూర్చ నీసూక్తి సంతతమ్ము!

సుజన మైత్రి సుధాపూర్ణ సుకృత నిధియె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

46*

ప్రాప్త లేశంబునకు తృప్తిపడుట మేలు!

పూలు పత్రి శాలువమ్రొక్కు పూజవెంట-

స్వీయ కృతినంకితముగను స్వీకరించు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

47*

వ్రాయ నేర్చితి-సత్యనారాయణుడను-

నిత్య నీరాజనముగ సాహిత్య దివ్వె-

నిచ్చి శరణంటి ననుకరుణించు దేవ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

48*

దిక్కు మ్రొక్కుగా నీభక్తి దివ్య శక్తి-

నీదు రూపున దర్శింప నిండుచూపు-

చూపు గల్పు వారికి చిత్త శుద్ధి గలుగు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

49*

కలలు పండించు నీగుడి కనులవిందు!

వీనులకు విందు నీపాట-విధుల తోట!

విరిసి-ఫలియించు దీవెన విశ్వ ప్రేమ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

50*

నిత్య కర్తవ్య విధిసాగు నిష్ఠనిమ్ము!

సంతతారోగ్య భాగ్యము సాగనిమ్ము!

పరులపై భారమిడకుండ బ్రతుకునిమ్ము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

51*

ఆర్తి బాపి రక్షించు దయార్ద్రహృదయ!

ప్రీతి వర్ధన నీవిశ్వ ప్రేమశక్తి-

దుష్కృతముమార్చి-సుకృతమావిష్కరించు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

52*

నీతియుక్త విజ్ఞానంబు నివ్వటిలగ-

ధర్మయుక్త పుర్షార్థముల్ దనరు నరుల-

త్రిగుణ త్రికరణాలను మంచి తీర్చిదిద్దు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

53*

భువి పరోపకారంబగు పుణ్యమనగ-

పరగ పరపీడనంబగు పాపమయము

సత్యమన భూతహితవుగా శాస్త్ర సూక్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

54*

జ్ఞానమందించు గీతార్థ గానఝరులు

శాంతి కొఱకు వెచ్చించు విజ్ఞాన ధనము-

విశ్వ శాంతి సంస్థాపన విస్తరించు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

55*

మనుజు త్రికరణ శుద్ధియే మార్గముగను

శ్రద్ధబూనిన మదిభక్తి వృద్ధియగును

మంచిపూరింప చెడుదొల్గి మాన్యుడగును

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

56*

మనసునిల్పక శ్రద్ధయు మరుగు పడును

శ్రద్ధలేకను భక్తియు సాగబోదు

మనసుటద్దంబు జేరును మాయదుమ్ము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

57*

మాయ తెరజీల్చ వేదాంతమాయుధమ్ము!

జ్ఞాన నేత్రాన నాత్మను గాంచవీలు!

పుడమినాడంబరపు భక్తి పుణ్యమిడదు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

58*

సాయ సహకార దానముల్ సాగమేలు!

ధరను తపముతో సమమగు దాననిష్ఠ-

దాన గుణవర్ధనుడవు-వేదాంతి వీవు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

59*

శాంతి లేక సౌఖ్యము నిల్వజాలదెందు-

సుఖములేని జీవితమంత శూన్య చరిత!

ముదమె బ్రహ్మముదమునకు మూలమగును!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

60*

శాంతి సంతృప్తి లేకున్న సగము బ్రతుకె-

పుణ్య సంపదనార్జింప పుడమి భక్తి!

పుణ్య ధనము వెచ్చించితే పూర్ణ ముక్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

61*

భరత విద్యలలో లోగీత బ్రహ్మ విద్య-

ఉపనిషత్తుల సారంబు నుర్విగీత!

వేదవేదాంత వేదికై వెలసె షిరిడి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

62*

సాంప్రదాయ సంస్కృతి చర్ఛ సభలు సాగ-

చీమనుంచి యేనుగుదాక శివుని గాంచు!

తీరుతెన్నున సమదృష్టి తీర్పు నీది!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

63*

జన్మ సార్థక్యమున సదసద్వివేక-

భక్తి మార్గంబు నీదయ్యె – పాపపుణ్య-

గతివిచక్షణ సాగె సద్గతినిజూపె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

64*

యాగ యోగముల్ సద్భక్తి యోగ గతులు-

మనసు నిశ్చలమొనరించు-మాయ దుడిచి,

చేతనత్వంబు గలిగించి సేమ మొసగు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

65*

ఎన్ని తీరుల దెల్పిన కొన్ని మిగులు!

దోష రహిత దృష్టి-విధుల దోహదంబు!

సతత సంతస దాయక సమత యోగి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

66*

ఆత్మ దర్శనమొనరించు-ఆదిదేవ!

తనువు తొడవుగా దలపించు తత్వదీప్తి-

నంతరింద్రియమును నిల్పియాత్మ జూపు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

67*

ప్రాణ తీపిని మరపించు ప్రార్థనముల-

దినము భక్తిబాటను సాగు దీనజనుడ-

భక్త పరమాణువును నేను భద్రతొసగు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

68*

మనసును ల్యాబు జేసియు జూచి “ఇదియటంచు”

దెల్పునదియాత్మ యనిదేల్చి దివ్య తేజ-

మయుడుగానున్న పరమాత్మ మాకు జూపు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

69*

మహిమతో మాయికుల మార్చి మమ్ముబ్రోవు!

తామసము బాపి సాత్విక తత్వమొసగు!

భక్తి నియమావళిని పుణ్య ముక్తి గూర్చు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

70*

షిరిడి సంస్థాన సంస్కృతి సిరుల భరిణె!

దేశి పరదేశి విడిదిగా తేజమొందె!

విశ్వ శాంతి సమైక్యతా విధుల మెఱసె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

71*

అచ్చుపడె నచ్ఛమౌభక్తి మదినిజేచ్ఛ-

స్వచ్ఛత స్వతంత్రాత్మ విశ్వాస పూర్ణ-

నిర్ణయం వ్యక్తిగతమయ్యె నిత్య విధిగ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

72*

బుద్ధి వికసించు త్రికరణ శుద్ధి నాత్మ-

నిశ్చలానంద బ్రహ్మము-నిహమునందు!

పారలౌకికయోజన భక్తి ఫలము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

73*

మనసు గనిపెట్టుటకె కాలమయ్యె నింత-

ల్యాబు దశనుండె మాయత్న లబ్ధి – గలుగ

విధులనాధ్యాత్మికము మేలవింప మేలు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

74*

మొదట కామియై తదుపరి మోక్షగామి-

భక్తిమార్గ-ముముక్షవై ఫలముబొందు!

రాగి బైరాగి తరియించు రాహ భక్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

75*

సత్య వ్రతమె సద్గతి జేర్చు సకల జనుల-

సేమమై సైన్సు పుణ్యంపు ధీమనొసగు-

విశ్వ శాంతి దృష్టికి నీదె విరుల బాట!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

76*

సంఘ జీవిగోరును నిత్య శాంతి సుఖము!

గమ్యమును జేర్చు తద్భావ గమనగతులు!

ఏది గోరితే – అదియిచ్చు నెపము నీది!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

77*

దుష్ట చింతన దొలగించు ధునివిభూతి!

తొలగు హారతి దీప్తుల దోషదృష్టి-

మంచికి నిధులు ద్వారకా మాయి విధులు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

78*

మంచికోసమై శతకోటి మార్గములను

దీవెనలుగూర్చు ముక్కోటి దేవతాళి-

పుణ్య మార్జింపగా జన్మ బూను నాత్మ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

79*

కూర్మి పేర్మి నీభక్తి చేకూర్చు శాంతి-

సుఖము పారలౌకికముగా సుకృత ఫలము!

నీదు సాహిత్య పఠనంబు నిత్య శుభము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

80*

గతము చరితార్థమైన సద్గతికి దోవ!

వేదవిజ్ఞాన బోధ వివేక భక్తి-

భవిత రూపొందు తగుపుణ్య ఫలముగూర్చు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

81*

ఉర్వి నిస్వార్థమునులేక యుద్ధ ముఖము!

పుడమి బుట్టుజీవుల హక్కు పూర్ణ సుఖము!

శాంతి మైత్రి భక్తిని తగు విశ్రాంతి సఖము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

82*

సాత్వికత సాగు దారుల శాంతి వెలయు

కాలగతిని కల్మశ హరం క్రాంతి పథము-

భక్తి మానవలోకపు ప్రగతి మెట్టు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

83*

పచ్చదనము శుభ్రత గల్గు పరిసరాల-

చేతనత్వమే మానవ శ్రేష్ఠ కీర్తి!

ప్రకృతి సిద్ధమౌ సుఖశాంతి ప్రాభవమ్ము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

84*

విశ్వ విజ్ఞాన సంపదల్ వివిధకళలు-

జ్ఞాన తత్వావగాహన గానసుధలు-

ప్రకృతి జఢచేతనంబుల పరిధి వెలయు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

85*

ధర్మ సూక్ష్మార్థ బోధక! దత్త రూప!

పవన పుత్ర వినాయక! పాపనాశ!

సర్వ దేవతా నిలయ సంస్థాన రూప!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

86*

నాన సాహెబు నిను గొల్చి నయము జయము-

సంతు సంపదలునుబొంది-సంతసించె!

దయను బ్రోచితివి శ్యామ దాసగణుల!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

87*

చాందు ధూపు వాసులతోడ సకల జగతి-

గనియు మ్రొక్కి దాల్తురు నీధుని విభూతి!

నిర్భయముగల్గ గడిపేరు నిండు బ్రతుకు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

88*

నమ్మకము వెంట బాధలు నిమ్మలింప-

మదినిఊరట గల్గు! సమాదివాక్కు-

ప్రశ్న తత్సమాధానాల బరగు తృప్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

89*

నీదు జీవిత చరితంబు నింపు గూర్ప-

పంతు హేమాడు వ్రాయగ-పరగ చర్ఛ-

శ్యామ రాధల సలహాల సంప్రదింపు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

90*

గ్రంధ కూర్పున భక్తుల కథలు-వెతలు

వెలయు నీలీల సందర్భ విషయగతులు-

శిష్యగణ నిరూపణవాక్కు-చిత్రణములు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

91*

నాడు జనులంత శ్రీరామనవమి వేడ్క-

జరుప నుప్పునూతిని మంచి జలములూరె!

ఊరు వాడనీమహిమను బొగడి మ్రొక్క!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

92*

గర్వి-వాదవివాదియై గద్ధరించు-

నానవలియోడె – పడిమ్రొక్కె నంత ఘోల-

సామిశిష్యుండు నీముందు సాగిలబడె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

93*

రొట్టెలశనార్థి జీవికి బెట్టుడనుచు

మాట క్రియజూపి చరియించు మార్గదర్శి!

నిత్య పశుపక్షి పోషణ నీకు ప్రీతి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

94*

చరిత పారాయణోక్తమై మార్మికముగు

మహిని కలిదోషవారణ మంత్రమయ్యె!

తిమిర హరుడనీ మహిమలన్ తేటపరచె!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

95*

బాలగణపతి బూటియు బడీసె సంతు!

రెండు బల్లులకథ జీవి నెసగు మమత

రుజలు వీడిన జనవాక్కు రుజువు నుడులు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

96*

ఆర్త నాదామే నినుబిల్చు వార్తగాగ

తక్షణమె బాధలణచగా తరలి వచ్చి-

మంచిగూర్తువు ద్వారకామాయి నిలయ!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

97*

అనలుడవు నీవె-ధునిగాల్చి యహము దుడిచి-

రక్షగలిగించితివి దోష రహిత దృష్టి-

బ్రతుక నేర్పిన గురువర ప్రణతి శతము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

98*

సహన సంయమన మది సమత మమత

బాలలీలలు వైద్యాలు బరగు పుటల-

చరిత పారాయణమునిచ్చు శక్తి యుక్తి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

99*

ధ్యానము-ధ్యాని-దైవము-త్రయదకార-

సాక్షరరముగ సందేశంబు-చావడోత్స-

వంబు సాగించి ప్రకటించు వాస్తవంబు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

100*

ఇరువదవ శతాబ్దినితొలి ఇరువదేండ్లు-

సాగె సందేశ సేవనీ సాక్షిగాను-

మాటవినబడె పిదప సమాదినుండి!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

101*(సంపూర్ణం)

విజయ దశిమి నీనిర్యాణ విధులు సాగె-

లబ్ధిగా నవ నాణెముల్ లక్ష్మి పొందె!

చివరి చెల్లింపుగా జనుల్ చింతనొంద!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

102*

జనులుమునిగిరి శోకాబ్ధి జడుపు గనెడు-

వారినూరడింపగ సమాది నుండి వాక్కు వెడలె-

బాధ వలదు “భారమునాదె” భక్తి జనుడు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

103*

అహము వీడి నిర్భయవృత్తి సహన చిత్త-

భక్తి పూర్ణులై సాగుడు-భద్రతొసగు-

భారమంతనాదేయని బలికినావు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

104*

సూక్ష్మమున మోక్షమందించు సూక్తి నిధివి!

శాంత గంభీర గళ! వక్త-సద్గురుండ!

నీదు శతక పాఠకులకు నిత్యశుభము!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

105*

వత్స వెంట ధేనువువలె వచ్చి బ్రోచు-

వేల్పులకు వేల్పువై యిల వెలసినావు!

శతకమర్పింతు నీదివ్య చరణములకు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

106*

కల్మశోల్భనమై తిండి- గాలి-నీటి

ప్రకృతి – కలతదీర్పగరమ్ము-ప్రాకటముగ!

శాస్త్ర వేత్తావతారివై జగతి బ్రోవు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

107*

నీతి శతకాలు మానవ నీతి నిధుల-

కనగ వినగ ననగ మంచి-కలుగుభక్తి-

శతకగానముచే జన్మ సార్థకంబు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

108*

శుభము నీభక్తి భావన స్ఫూర్తి గరిమ!

శుభము నీధర్మ కర్మల సూత్రచయము-

శుభము నీప్రసాద మహిమ శుభఫలంబు!

స్వస్తి నివ్వాళి గొనుషిర్డి సాయిబాబ!

Contact
bottom of page